వ్యవసాయ రంగం

వ్యవసాయ రంగం

బ్రిటీష్ వారు రాక పూర్వం భారతదేశంలో వ్యవసాయం పరిశ్రమల మధ్య సమతౌల్యం ఉండేది. రెండూ పక్కపక్కనే అభివృద్ధి చెందేవి. బ్రిటీష్​ వారి కాలంలో వారు అవలంబించిన విధానల వల్ల గ్రామీణ చేతివృత్తులు, కుటీర పరిశ్రమలు క్షీణించాయి. పైగా గ్రామీణ పేదలను పీడించే ఒక జమిందారీ వర్గం అభివృద్ధి చెందింది. రైతు పండించిన పంటలో కొంత భాగాన్ని జమిందారీలు తీసుకుపోగా, వ్యవసాయదారుడికి జీవనాధార ఆదాయమే మిగిలేది. వ్యవసాయదారునికి పెట్టుబడి పెట్టడానికి వనరులు, ప్రోత్సాహకం రెండూ ఉండేవి కావు. ఫలితంగా స్వాతంత్ర్యానికి ముందు వ్యవసాయం జీవనాధార వ్యవసాయంగా ఉండేది. ప్రణాళికలు ముఖ్యంగా హరిత విప్లవం(1966) ప్రారంభమైన తర్వాత కొంత మంది వ్యవసాయదారులు వాణిజ్య ప్రాతిపదికన వ్యవసాయం చేపట్టారు. 

మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో 2/3వ వంతు జాతీయ ఆదాయం వ్యవసాయం నుంచే వచ్చేది. పారిశ్రామికాభివృద్ధి, పరిశ్రమలు, అవస్థాపనా సదుపాయాలు అభివృద్ధి కాకపోవడమే దీనికి కారణం. ప్రణాళికలు ప్రారంభించిన తర్వాత ద్వితీయ, తృతీయ రంగాలు అభివృద్ది చెందడం వల్ల వ్యవసాయం వాటా తగ్గుతూ వచ్చింది. 1950–51లో జీడీపీలో వ్యవసాయం రంగం వాటా 53.1 శాతంగా ఉండేది.

1980–81 నాటికి 36 శాతానికి, 1990–91 నాటికి 29.6 శాతానికి తగ్గింది. ప్రస్తుత ధరలలో గత ఆరు సంవత్సరాల్లో జీవీఏలో వ్యవసాయ రంగం వాటా ఇలా ఉంది.  ప్రస్తుత ధరల్లో 2022–23లో జీవీఏలో వ్యవసాయం అనుబంధ రంగాల వాటా 21.1 శాతం. జాతీయాదాయంలో వ్యవసాయం వాటా అనేది ఆర్థికాభివృద్దికి ఒక సూచీగా గుర్తిస్తారు. అభివృద్ధి చెందిన దేశాల్లో వ్యవసాయం నుంచి తక్కువ వాటా వస్తుంది. 

ఉపాధిలో వాటా

1950–51లో మొత్తం ఉపాధిలో వ్యవసాయంపై ఆధారపడ్డ వారి శాతం 72. అంటే 3/4 వంతు వ్యవసాయంపైనే ఆధారపడ్డారు. 2011 జనాభా లెక్కల నాటికి 54.6 శాతానికి తగ్గింది. ఎన్​ఎస్​ఎస్​ఓ వారి 27వ రౌండ్​ (1972–73)లో 73.9 శాతం వ్యవసాయంపై ఆధారపడగా 68వ రౌండ్​ (2011–12) నాటికి వ్యవసాయంపై ఆధారపడే వారి శాతం 48.9శాతానికి తగ్గింది. ఇతర రంగాలు సరిపడినంతగా ఉపాధి కల్పించకపోవడం వల్ల పెరిగే జనాభా వ్యవసాయం పైనే ఆధారపడాల్సి వస్తుంది. ఫలితంగా వీరి ఉపాంత ఉత్పాదకత 0 లేదా సున్నాకి సమీపంగా ఉంటుంది. అందుకే అల్ప ఉద్యోగిత, ప్రచ్ఛన్న నిరుద్యోగిత ఏర్పడుతుంది. 

వృద్ధిరేటు

ప్రముఖ ఆర్థికవేత్త రంగరాజన్ పేర్కొన్నట్లు వ్యవసాయ రంగంలో ఒక శాతం వృద్ధిని సాధిస్తే అది పారిశ్రామిక ఉత్పత్తిని 0.5 శాతం, జాతీయాదాయ వృద్ధిరేటును 0.7 శాతానికి పెంచుతుంది. అందుకే 12వ ప్రణాళికలో జీడీపీ వృద్ధి 8 శాతం సాధించాలి అంటే వ్యవసాయ రంగం 4 శాతం వృద్ధిని సాధించాలని నిర్దేశించారు. అయితే, సాధించింది 2.86 శాతం. అయితే, 2022–23లో 3.3 శాతం అంచనా వేయడమైంది. ఏ సంవత్సరంలో అయితే వ్యవసాయ రంగంలో మంచి వృద్ధిని సాధించగలమో ఆ సంవత్సర జీడీపీ వృద్ధి కూడా మెరుగ్గా ఉంటుంది. 

గ్రాస్ క్యాపిటల్​ ఫార్మేషన్​

ఆర్థికాభివృద్ధికి మూలధన కల్పన అవసరం. మూలధన కల్పన రేటు పెరగకపోతే ఆర్థికాభివృద్ధిని సాధించలేం. భారత్​ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అతి పెద్ద పరిశ్రమ వ్యవసాయం. మన దేశంలో అతి పెద్ద ప్రైవేట్​ రంగం కూడా వ్యవసాయమే. కాబట్టి మూలధన కల్పన రేటు పెంచడంలో వ్యవసాయం ముఖ్యపాత్ర పోషిస్తుంది. వ్యవసాయ రంగంలోని మిగులును పొందడానికి వ్యవసాయం నుంచి వ్యవసాయేతర రంగానికి శ్రమ, మూలధనం తరలించాలి. వర్తక నిబంధనలు వ్యవసాయానికి అనుగుణంగా మార్చడం వల్ల విధానాలు అమలుపర్చాలి. ప్రస్తుత ధరల్లో జీసీఎఫ్​లో వ్యవసాయం అనుబంధ రంగాల జీసీఎఫ్ వాటా 2021–22 నాటికి 8 శాతానికి పెరిగింది. స్థూల మూలధన కల్పనలో వ్యవసాయ అనుబంధరంగాల వాటా తగ్గుతూ వస్తున్నది. 

ఆహార ధాన్యాల సరఫరా

భారత్​ వంటి అధిక జనాభా గల దేశాల్లో ఆహార ధాన్యాల డిమాండ్​ రోజురోజుకూ పెరుగుతున్నది. ఈ దేశాల్లో ఆదాయం తక్కువగా ఉండటంతో ఆహార వినియోగం తక్కువగా ఉంటుంది. తలసరి ఆదాయం పెరిగే కొద్దీ ఆహారానికి డిమాండ్​ అంతకంటే ఎక్కువగా పెరుగుతుంది. అంటే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఆదాయ డిమాండ్​ వ్యాకోచత్వం ఆహారానికి అధికంగా ఉంటుంది. కాబట్టి పెరిగే జనాభాకు అవసరమైన ఆహార ధాన్యాలను సరఫరా చేయాల్సి ఉంది. లేకపోతే భారీ మొత్తంలో ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది.

పేదరికం తగ్గింపు

నేటికీ దేశంలో సగం మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. బ్రిక్స్​ దేశాల అనుభవం ప్రకారం వ్యవసాయ రంగంలో 1 శాతం వృద్ధిని సాధిస్తే అది కనీసం 2 నుంచి 3 రెట్లు ఎక్కువ సమర్థవంతంగా పేదరికం తగ్గడానికి దోహదపడుతుందని తెలియవస్తున్నది. వ్యవసాయ వృద్ధి, పేదరికం, అపౌష్టికత్వం తగ్గింపునకు ఉపయోగపడుతుంది. 2011–12 ఇండియన్​ అగ్రికల్చర్​ రిపోర్టు ప్రకారం దేశ జీడీలో 8 నుంచి 9 శాతం వృద్ధిని సాధించినా వ్యవసాయ వృద్ధి అధికంగా లేకపోవడం వల్ల అది పేదరికాన్ని తగ్గించలేదు.

అంతర్జాతీయ వ్యాపారం

చాలా సంవత్సరాలు వస్త్రాలు, జనపనార, తేయాకు మన దేశం నుంచి ఎగుమతి అయ్యే ఎగుమతులు ఆదాయంలో 50 శాతం అందించేవి. వీటితోపాటు జీడిపప్పు, పొగాకు, కాఫీ, వనస్పతి నూనెలు, పంచదార కూడా తర్వాత కాలంలో ఎగుమతి అయ్యాయి. దీనివల్ల ఎగుమతుల్లో కూడా 70 శాతం వరకు వ్యవసాయంపైనే ఆధారపడాల్సి వచ్చేది. ఇది వెనుకబాటుతనాన్ని సూచిస్తోంది. అయితే, ఆర్థికాభివృద్ధి జరిగే కొద్దీ ఉత్పత్తిలో వైవిధ్యం రావడంతో వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు క్రమంగా తగ్గాయి.

 పారిశ్రామికాభివృద్ధి

జాతీయ ప్రాధాన్యత కలిగిన కొన్ని పరిశ్రమలకు వ్యవసాయరంగమే ముడి పదార్థాలను అందిస్తుంది. ఉదా: వస్త్ర, జనపనార, పంచదార పరిశ్రమ, వనస్పతి పరిశ్రమ. వనస్పతి పరిశ్రమ ఎక్కువగా మహారాష్ట్రలోని ముంబయి, పుణెల్లో కేంద్రీకృతమై ఉంది. మొదటి వనస్పతి పరిశ్రమ ముంబయిలోనే ఏర్పడింది. చాలా చిన్న పరిశ్రమలకు వ్యవసాయమే ఆధారం. ఉదా: చేనేత, రైస్​, ఆయిల్​ మిల్స్​ మొదలై నవి. ఆహార ఉత్పత్తి ప్రక్రియ పరిశ్రమకు వ్యవసాయమే ఆధారం. వ్యవసాయం అభివృద్ధి చెందకపోతే ఈ పరిశ్రమలన్నీ వెనుకపడతాయి. అయితే, ఈ మధ్య కాలం లో వ్యవసాయంపై ఆధారపడని పరిశ్రమలు అభివృద్ధి చెందుతూ వస్తున్నాయి. అంటే వ్యవసాయ ప్రాధాన్యత పరిశ్రమల్లో క్షీణత కనిపిస్తున్నది. భారతదేశంలో 2/3వ వంతు ప్రజలు గ్రామాల్లోనే నివసిస్తున్నారు. వీరి కొనుగోలు శక్తి పెరిగితే అది పారిశ్రామికాభివృద్ధికి ఉత్తేజం వస్తుంది.

ఆహార ధాన్యాల ఉత్పత్తి      మిలియన టన్నులు

1950-51                                             50.8 
2015-16                                             251.6 
2016-17                                             275.1 
2017-18                                             285.01 
2018-19                                             285.21 
2019-20                                             297.5
2020-21                                             310.74 
2021-22                                             315.616 
2022-23                                             330.53
2023-24                                             332