
- రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్
- ఎన్వోసీకి సమగ్ర వివరాలు అందించాలని ఏఏఐకి ఆదేశం
- భవిష్యత్తులో శిక్షణ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తామని వెల్లడి
- కేంద్రానికి ధన్యవాదాలు తెలిపిన ఆర్ అండ్ బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: ఆదిలాబాద్ లో ఏర్పాటు చేయనున్న ఎయిర్ పోర్ట్ కు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్ ) గ్రీన్సిగ్నల్ఇచ్చింది. ఈ మేరకు ఆర్ అండ్ బీ ( ఎయిర్ పోర్ట్స్) స్పెషల్ సీఎస్ కు ఐఏఎఫ్ డైరెక్టర్ బాజిరావ్ రామ్ నాథ్లేఖ రాశారు. రానున్న రోజుల్లో శిక్షణ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తామని ఐఏఎఫ్ వెల్లడించింది. అలాగే, రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ఐఏఎఫ్.. ఆదిలాబాద్ లో సివిల్ ఆపరేషన్స్ ను కూడా ప్రారంభించేందుకు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది.
ల్యాండ్, టర్మినల్స్ ఏర్పాటు, ఎయిర్ క్రాఫ్ట్ పార్కింగ్, రన్ వే.. ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ)తో కలిసి అభివృద్ధి చేస్తామని ఐఏఎఫ్ తెలిపింది. దీనికి సంబంధించి ఎన్వోసీ ఇవ్వడానికి సమగ్ర వివరాలు సమర్పించాలని ఏఏఐని ఐఏఎఫ్ ఆదేశించింది. ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు ఐఏఎఫ్ అంగీకారం తెలపడం పట్ల ఆర్ అండ్ బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి బుధవారం ఓ ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.
ఎన్నో ఏండ్ల నుంచి పెండింగ్ లో ఉన్న వరంగల్ మామునూరు ఎయిర్ పోర్ట్ కు కూడా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు సాధించిందని తెలిపారు. ఆరు నెలల స్వల్ప వ్యవధిలోనే రెండు ఎయిర్ పోర్టులకు అనుమతులు సాధించడం.. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అవిశ్రాంత కృషికి దక్కిన ఫలితమన్నారు. ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కోసం 2024 డిసెంబర్ 18న కేంద్రానికి లేఖ రాశామని మంత్రి తెలిపారు.
ఎయిర్ పోర్ట్ కు అవసరమైన అన్ని అనుమతులు పొందేందుకు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా డిటెయిల్డ్ ప్రపోజల్స్ ను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు సమర్పించాలని కోరినందున త్వరలో అధికారులతో రివ్యూ చేసి అన్ని వివరాలతో రిపోర్ట్ ను కేంద్రానికి, సంబంధిత విభాగాలకు పంపిస్తామని మంత్రి వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, కేంద్ర సివిల్ ఏవియేషన్ మంత్రి రామ్మెహన్ నాయుడు, సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి వెంకట్రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.