భారత వైమానిక దళ హెలికాప్టర్ బుధవారంనాడు రాజస్థాన్‌లోని నాగౌర్‌లో అత్యవసరంగా ల్యాండింగ్ అయింది. జోథ్‌పూర్ నుంచి జైపూర్ వెళ్తుండగా సాంకేతిక లోపం తలెత్తడంతో పైలట్ అప్రమత్తమై జాస్‌నగర్‌లోని పొలాల్లో హెలికాప్టర్‌ను ల్యాండ్ చేయడంతో ప్రమాదం తప్పింది. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. రెండు ఐఏఎఫ్ హెలికాప్టర్లు జోధ్‌పూర్ నుంచి జైపూర్ వెళ్తుండగా.. అందులో ఒక టెక్నికల్ ఇష్యూ రావడంతో పైలెట్ గుర్తించాడని ఎయిర్ ఫోర్స్ అధికారులు చెప్పారు. దీంతో అత్యవసరంగా హెలికాప్టర్ ల్యాండింగ్ చేశాడు.
వాయుసేనకు చెందిన నిపుణుల బృందం ఘటనా స్థలికి చేరుకుని సాంకేతిక లోపాన్ని సరిచేసిన అనంతరం హెలికాప్టర్ తిరిగి బయలుదేరిందని చెప్పారు. సాధారణ శిక్షణా విన్యాసాల్లో భాగంగా హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తిందని రక్షణ శాఖ అధికారులు తెలిపారు. ఆ వెంటనే సురక్షితంగా హెలికాప్టర్ ల్యాండింగ్ కావడంతో వింగ్ కమాండర్ పాల్ సింగ్ సహా అందులోని వారంతా సురక్షితంగా బయటపడ్డారని చెప్పారు. ఐఏఎఫ్ హెలికాప్టర్ పొలాల్లో దిగడంతో స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు.