మూసీ పునరుజ్జీవం ఆచరణ సాధ్యమే : రాయబారి అమిత్ కుమార్

మూసీ పునరుజ్జీవం ఆచరణ సాధ్యమే : రాయబారి అమిత్ కుమార్
  • నదుల అభివృద్ధి దక్షిణ కొరియా అభివృద్ధికి తోడ్పడింది
  • మీడియాతో అక్కడి భారత రాయబారి అమిత్ కుమార్

సియోల్ నుంచి వెలుగు ప్రతినిధి: మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు ఆచరణ సాధ్యమేనని దక్షిణ కొరియాలోని భారత రాయబారి అమిత్ కుమార్ అన్నారు.  ఇందుకు చేయాలన్న ఉద్దేశం, రాజకీయ నిబద్ధత అవసరమని తెలిపారు. దక్షిణకొరియాలో నదుల అభివృద్ది అనేది దేశాభివృద్దికి కూడా తోడ్పడిందని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి  స్కిల్ యూనివర్సిటీ పై ఆలోచించి, దాన్ని ప్రారంభించడం గొప్ప విషయమని ఆయన పేర్కొన్నారు.

ఒకప్పటి పేద దేశం దక్షిణకొరియా యుద్ధం తర్వాత కేవలం 30 ఏండ్లలో సొంతంగా అద్భుతమైన పురోగతిని సాధించిందని, అభివృద్ది చెందిన దేశంగా ఆవిర్భవించిందని తెలిపారు. సియోల్ లోని భారత ఎంబసీలో తెలంగాణ మీడియాతో భారత రాయబారి అమిత్ కుమార్ మీడియాతో చిట్ చాట్ చేశారు. దక్షిణ కొరియాలో షిప్పింగ్ పరిశ్రమ, సెమీ కండక్టర్స్, ఆటోమొబైల్, డిజిటల్ ఇన్​ఫ్రాస్టక్చర్ రంగాల్లో రాబోయే రోజుల్లో భారీగా ఉద్యోగావకాశాలు ఉంటాయన్నారు. షిప్పింగ్ పరిశ్రమలో పనిచేసేందుకు భారత్ నుంచి 200 మందిని తీసుకొచ్చామని చెప్పారు.

 ఇక్కడ మొత్తం 15 వేలమంది భారతీయులు ఉన్నారన్నారు. ‘‘దక్షిణ కొరియా షిప్పింగ్ కంపెనీల్లో పనిచేస్తున్నోళ్లలో ఎక్కువ మంది 60ఏండ్లకు సమీపంలోకి వచ్చేశారు.   ఇంకో పదేండ్లలో వీరు పనిచేసే స్థితిలో ఉండరు. అందుకే ఈ రంగంలో భారతీయులకు అనేక అవకాశాలుంటాయి” అని తెలిపారు. ‘‘దక్షిణకొరియాలో 12వ తరగతి వరకు ఉచిత విద్య అందుతుంది. అక్షరాస్యత వందశాతం ఉంది. ఇక్కడ పత్రికా స్వేచ్ఛ బాగుంది. భారత్ – -కొరియా వాణిజ్య పరి మాణం ఏటా 25బిలియన్ డాలర్లు” అని ఆయన చెప్పారు. 

పరిశోధనలకే ఎక్కువ ఖర్చు

దక్షిణ కొరియాలో తాజా అంచనాల ప్రకారం జననాల రేటు 6.8శాతం మాత్రమే ఉందని, ఇది తీవ్రంగా ఆందోళన కలిగిస్తున్న విషయమని అమిత్ కుమార్ తెలిపారు. ‘‘దక్షిణ కొరియాలో పరిశోధనపై ఎక్కువ ఖర్చుపెడ్తారు. పెద్ద కంపెనీలు భారీ మొత్తాల్లో సొమ్మును వెచ్చిస్తాయి.  కార్ల తయారీ వంటి రంగాల్లో మెరుగైన ఫలితాలు సాధించారు. హ్యుందయ్ కంపెనీ ఐపీవోకు వెళ్లడం ఊహించలేదు. భారత్​లోని తన వ్యాపార విస్తరణ లక్ష్యాల కోసమే ఈ పనిచేసి ఉంటుందని భావిస్తున్నాం” అని చెప్పారు.