ఐఎస్ఎస్​లో సునీత డ్యాన్స్

  • స్పేస్ స్టేషన్​తో బోయింగ్ స్టార్ లైనర్ అనుసంధానం 

హ్యూస్టన్: ఇండియన్ అమెరికన్ ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్, మరో ఆస్ట్రోనాట్ విల్ మోర్ సురక్షితంగా అంతరిక్షానికి చేరుకున్నారు. వాళ్లు వెళ్లిన బోయింగ్ స్టార్ లైనర్ క్యాప్సూల్ గురువారం మధ్యాహ్నం 1:34 గంటలకు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ఐఎస్ఎస్) తో అనుసంధానమైంది. అనంతరం సునీత, విల్ మోర్ ఐఎస్ఎస్ లోకి వెళ్లారు. ఈ సందర్భంగా స్పేస్ స్టేషన్ లోని ఆస్ట్రోనాట్స్ సంప్రదాయం ప్రకారం గంట కొట్టి వాళ్లకు స్వాగతం పలికారు.

స్పేస్ స్టేషన్ లోకి వెళ్లిన తర్వాత సునీత డ్యాన్స్ చేశారు. అక్కడున్న ఆస్ట్రోనాట్స్ ను హగ్ చేసుకుని తన ఆనందాన్ని వ్యక్తపరిచారు. ‘‘స్పేస్ స్టేషన్ కు చేరుకున్న తర్వాత ఇంటికి తిరిగి వచ్చినట్టు ఉంది. ఇక్కడ ఉన్నోళ్లందరూ నా కుటుంబసభ్యులు. మాకు ఘన స్వాగతం పలికినందుకు కృతజ్ఞతలు” అని ఆమె అన్నారు. ఈ వీడియోను బోయింగ్ కంపెనీ సోషల్ మీడియా ‘ఎక్స్’లో పోస్టు చేసింది. కాగా, సునీత అంతరిక్షంలోకి వెళ్లడం ఇది మూడోసారి. ఈ మిషన్ లో సునీత పైలట్​గా, విల్ మోర్ కమాండర్ గా వ్యవహరిస్తున్నారు.  

గంట ఆలస్యం.. 

బుధవారం ఉదయం 10:52 గంటలకు ఫ్లోరిడాలోని కేప్ కానవెరాల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి బోయింగ్ స్టార్ లైనర్ బయలుదేరింది. అది 26 గంటల జర్నీ తర్వాత ఐఎస్ఎస్ తో అనుసంధానం కావాల్సి ఉండగా, టెక్నికల్ ఇష్యూస్ కారణంగా దాదాపు గంట ఆలస్యమైంది. హీలియం లీకేజీ కారణంగా అనుసంధానం ఆలస్య మైందని బోయింగ్ ప్రతినిధి తెలిపారు.