
వాషింగ్టన్: వచ్చే ఏడాది జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇండియన్ అమెరికన్, ఇంజినీర్ హర్షవర్ధన్ సింగ్(38) కూడా పోటీ చేయనున్నా రు. రిపబ్లికన్ పార్టీ తరపున ప్రెసిడెంట్ పదవికి పోటీపడతానని ఆయన ట్వీట్‌చేశారు. దీంతో అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న మూడో ఇండియన్ అమెరికన్‌గా హర్షవర్ధన్ నిలిచారు. నిక్కీ హేలీ, వివేక్ రామస్వామి కూడా ప్రెసిడెంట్ రేసులో ఉన్నారు.
తాజాగా తాను జీవితాంతం రిపబ్లికన్ గానే ఉంటానని హర్షవర్ధన్ తెలిపారు. ‘‘గత కొన్నేండ్లలో అమెరికాలో చోటుచేసుకున్న మార్పులను రివర్స్ చేయడానికి, అమెరికన్ విలువలను పునరుద్ధరించడానికి మనకు బలమైన నాయకత్వం అవసరం. అందుకే 2024లో జరిగే ప్రెసిడెంట్ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున నామినేషన్ వేయాలని నేను నిర్ణయించుకున్నా” అని హర్షవర్ధన్ ట్వీట్లో తెలిపారు.