ఓపెన్ ఏఐ (OpenAI) కాపీరైట్ విషయాన్ని బహిరంగంగా నిలదీసిన సుచిర్ బాలాజీ(26) అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శాన్ ఫ్రాన్సిస్కో లోని తన అపార్ట్ మెంటులో అనుమానాస్తద స్థితిలో చనిపోయినట్లు శాన్ ఫ్రాన్సిస్కో పోలీసులు ధృవీకరించారు.
ఓపెన్ఏఐలో నాలుగేళ్లుగా రీసర్చ్ అనలిస్ట్ గా, ట్రైనర్ గా పనిచేసిన సుచిర్.. ఆగస్టులో ఆ సంస్థ నుంచి బయటకు వచ్చాడు. ఓపెన్ఏఐ కాపీ రైట్ కు పాల్పడటంపై చాలా కాలంగా న్యాయ పోరాటం చేస్తున్నాడు. ఓపెన్ఏఐ పై న్యాయ పోరాటం చేస్తున్న క్రమంలో సుచిర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం పలు అనుమానాలకు తావిస్తోంది.
అయితే సుచిర్ మృతిని పోలీసులు ఆత్మహత్యగా ధృవీకరించారు. నవంబర్ 26న సుచిర్ ఆత్మహత్య చేసుకున్నట్లు మెడికల్ ఆఫీసర్లు, పోలీసులు ధృవీకరించారు. అయితే మృతికి గల కారణాలను పోలీసులు వెల్లడించలేదు.
ఓపెన్ ఏఐలో పనిచేసిన సుచిర్ ఆ కంపెనీ చేస్తున్న కాపీరైట్ ఉల్లంఘలనలపై చాలా రోజులుగా న్యాయపోరాటం చేస్తూ వస్తున్నాడు. వివిధ వెబ్ సైట్ల సమాచారాన్ని వినియోగించి ఓపెన్ ఏఐ.. ఛాట్జీపీటీ (ChatGPT) లాంటి జెనరేటివ్ మోడల్ కు ట్రైనింగ్ ఇచ్చిందని, ఇది కాపీరైట్ ఉల్లంఘన కిందికి వస్తుందని గొంతెత్తాడు. మూడు నెలల క్రితం యూఎస్ కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించి ఛాట్ జీపీటీ ని డెవలప్ చేస్తున్నారని బహిరంగంగా విమర్శించాడు.
Also Read : 18 వేల ఇండియన్లకు డిపోర్టేషన్ ముప్పు!
2022 ఛాట్ జీపీటీని లాంచ్ చేసిన తర్వాత ఇదే అంశంపై పలువురు రచయితలు, జర్నలిస్టులు, ప్రోగ్రామ్మర్లు ఓపెన్ ఏఐపై న్యాయపోరాటం చేశారు. ఓపెన్ ఏఐ150 బిలియన్ డాలర్ల విలువైన కంపెనీగా ఎదగడం వెనక కాపీరైట్ ఉల్లంఘనలు ఉన్నాయని అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.
ఇదే అంశంపై 2023 అక్టోబర్ లో న్యూయార్క టైమ్స్ కు ఇచ్చిన ఇంటర్వూలో సుచిర్ మాట్లాడుతూ.. ఛాట్ జీపీటీకి ట్రైనింగ్ ఇస్తున్న సమయంలో వివిధ వ్యాపార సంస్థల, ఎంటర్ ప్రెన్యుయర్స్ కు సంబంధించిన సమాచారం వాడుకోవడం.. వారిపై ప్రతికూల ప్రభావం చూపిందని.. ఇది సస్టైనబుల్ మోడల్ కాదని అభిప్రాయం వ్యక్తం చేశాడు.