- ఇటీవలి ఒప్పందంతో నాలుగేండ్ల ఉద్రిక్తతకు ముగింపు
- ఈ నెల 29కల్లా బలగాల ఉపసంహరణ పూర్తి
న్యూఢిల్లీ: తూర్పు లడఖ్‌లోని డెమ్‌చోక్, డెప్సాంగ్ ప్రాంతాల నుంచి భారత్, చైనా బలగాల ఉపసంహరణ ప్రక్రియ మొదలైంది. ఈ నెల -29 నాటికి ప్రాసెస్ పూర్తయ్యే అవకాశం ఉందని ఇండియన్ ఆర్మీ వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్ఏసీ) వెంబడి పెట్రోలింగ్ పునరుద్ధరణ, బలగాల ఉపసంహరణపై భారత్, చైనా మధ్య ఇటీవల కీలక ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం.. డెమ్‌చోక్, డెప్సాంగ్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకున్న మౌలిక సదుపాయాలను, టెంట్లను, తాత్కాలిక నిర్మాణాలను ఇరు దేశాలు తొలగిస్తున్నాయి. 2020 గల్వాన్ ఘర్షణలకు ముందు నాటి స్థానాల్లోకి వెళ్లనున్నాయి.
ఇరు దేశాల సైనికులు 2020లో గస్తీ నిర్వహించిన పెట్రోలింగ్ పాయింట్ల వద్దకు ఇకపై మళ్లీ స్వేచ్ఛగా వెళ్లవచ్చు. బలగాల ఉపసంహరణ ప్రాసెస్ పూర్తయిన నాలుగైదు రోజుల్లో డెమ్‌చోక్, డెప్సాంగ్ ప్రాంతాల్లో పెట్రోలింగ్ పునరుద్ధరించనున్నట్లు సమాచారం. కాగా, 2020లో గల్వాన్ లో భారత్, -చైనా సైనికుల మధ్య ఘర్షణ ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ ఘర్షణలో తెలంగాణకు చెందిన కర్నల్ సంతోష్ బాబు సహా 20 మంది భారత సైనికులు వీరమరణం పొందారు. దాంతో ఇరుదేశాలు ఎల్ఏసీ వెంబడి భారీస్థాయిలో బలగాలను మోహరించాయి.