బాణం గురి కుదిరేనా?..మరో 7 రోజుల్లో పారిస్‌‌‌‌‌‌‌‌ ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌

బాణం గురి కుదిరేనా?..మరో 7 రోజుల్లో పారిస్‌‌‌‌‌‌‌‌ ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌
  •     తొలి పతకంపై ఇండియన్‌‌‌‌‌‌‌‌ ఆర్చర్ల దృష్టి
  •     ధీరజ్‌‌‌‌‌‌‌‌, దీపికాపై భారీ ఆశలు
  •     మరో 7 రోజుల్లో పారిస్‌‌‌‌‌‌‌‌ ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌

ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ ఆర్చరీ పోటీలు జరిగినా మనకు ఒకటి, రెండు పతకాలు రావడం కామన్‌‌‌‌‌‌‌‌..! వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌లోనూ అరుదైన రికార్డులూ మన వాళ్ల పేరిటే ఉన్నాయి..! కానీ ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌లో మాత్రం ఇండియన్‌‌‌‌‌‌‌‌ ఆర్చర్లు ఇంకా బోణీ కొట్టలేకపోతున్నారు..! 1998 నుంచి మెగా గేమ్స్‌‌‌‌‌‌‌‌లో బరిలోకి దిగుతున్నా ఇప్పటి వరకూ ఒక్క మెడల్‌‌‌‌‌‌‌‌నూ గెలవలేకపోయారు..! కారణాలేమైనా..12 ఏళ్ల తర్వాత పూర్తి స్థాయి జట్టుతో పారిస్‌‌‌‌‌‌‌‌ గడ్డపై అడుగుపెడుతున్న మనోళ్ల బాణాల గురి కుదురుతుందా? లేదా? చూడాలి. 

వెలుగు స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌ డెస్క్‌‌‌‌‌‌‌‌ : ధీరజ్‌‌‌‌‌‌‌‌ బొమ్మదేవర, తరుణ్‌‌‌‌‌‌‌‌దీప్‌‌‌‌‌‌‌‌ రాయ్‌‌‌‌‌‌‌‌, ప్రవీణ్‌‌‌‌‌‌‌‌ జాదవ్‌‌‌‌‌‌‌‌, దీపికా కుమారి, భజన్‌‌‌‌‌‌‌‌ కౌర్‌‌‌‌‌‌‌‌, అంకితా భాకట్‌‌‌‌‌‌‌‌.. ఇండియన్‌‌‌‌‌‌‌‌ ఆర్చరీలో చాలా కామన్‌‌‌‌‌‌‌‌గా వినిపించే పేర్లు ఇవి. అలాగే వరల్డ్‌‌‌‌‌‌‌‌ వైడ్‌‌‌‌‌‌‌‌గా జరిగే ఏ టోర్నీలోనైనా పతకాలు గెలిచే సత్తా ఉన్న విలుకాండ్లు వీళ్లు. కానీ ఇప్పటివరకు వీళ్లకు ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌ పతకం ఆశలు నెరవేరలేదు. ఇందులో దీపికా, తరుణ్‌‌‌‌‌‌‌‌ నాలుగోసారి, ప్రవీణ్‌‌‌‌‌‌‌‌ రెండోసారి మెగా గేమ్స్‌‌‌‌‌‌‌‌ ఆడబోతున్నారు. దీంతో కనీసం ఈసారైనా పతకం కరువు తీరుస్తారా?

అని ఫ్యాన్స్‌‌‌‌‌‌‌‌ ఆశగా ఎదురుచూస్తున్నారు. ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌లో కేవలం రికర్వ్‌‌‌‌‌‌‌‌ విభాగంలోనే ఆర్చరీ పోటీలు జరుగుతాయి.  మొత్తం ఆరు మందితో కూడిన ఆర్చరీ బృందం వ్యక్తిగత (మెన్స్‌‌‌‌‌‌‌‌, విమెన్స్‌‌‌‌‌‌‌‌), టీమ్‌‌‌‌‌‌‌‌ (మెన్స్‌‌‌‌‌‌‌‌, విమెన్స్‌‌‌‌‌‌‌‌), మిక్స్‌‌‌‌‌‌‌‌డ్‌‌‌‌‌‌‌‌ విభాగాల్లో బరిలోకి దిగనుంది. టీమ్‌‌‌‌‌‌‌‌ విభాగంలో మెన్స్‌‌‌‌‌‌‌‌, విమెన్స్‌‌‌‌‌‌‌‌ జట్లు నేరుగా ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌కు అర్హత సాధించలేకపోయాయి. వరల్డ్‌‌‌‌‌‌‌‌ ర్యాంకింగ్స్‌‌‌‌‌‌‌‌ ఆధారంగా పారిస్‌‌‌‌‌‌‌‌  బెర్త్‌‌‌‌‌‌‌‌లు దక్కించుకున్నాయి. 

అరంగేట్రం అదిరేనా?

ఈసారి ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌లో తెలుగు ఆర్చర్‌‌‌‌‌‌‌‌ బొమ్మదేవర ధీరజ్‌‌‌‌‌‌‌‌ అరంగేట్రం చేయనున్నాడు. గతేడాది జరిగిన ఆసియా క్వాలిఫయర్స్‌‌‌‌‌‌‌‌లో రాణించడం ద్వారా 22 ఏళ్ల ధీరజ్‌‌‌‌‌‌‌‌ ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌ బెర్త్‌‌‌‌‌‌‌‌ను దక్కించుకున్నాడు. ఆర్చరీలో పారిస్‌‌‌‌‌‌‌‌ ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌ బెర్త్‌‌‌‌‌‌‌‌ దక్కించుకున్న తొలి ఇండియన్‌‌‌‌‌‌‌‌ ఆర్చర్‌‌‌‌‌‌‌‌ అతనే. ఇటీవల అంటాల్యాలో జరిగిన వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌లో ఇండివిడ్యువల్‌‌‌‌‌‌‌‌ కేటగిరీలో బ్రాంజ్‌‌‌‌‌‌‌‌ మెడల్‌‌‌‌‌‌‌‌ గెలిచి మంచి ఫామ్‌‌‌‌‌‌‌‌లో ఉన్నాడు. అత్యధిక పాయింట్ల (689/720) రికార్డు కూడా అతని పేరుమీద ఉంది. ఇక ఇండియా ర్యాంకింగ్స్‌‌‌‌‌‌‌‌లో టాప్‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌లో ఉన్న అతను కచ్చితంగా మెడల్‌‌‌‌‌‌‌‌ సాధిస్తాడని ఆశిస్తున్నారు.

గతేడాది ఆసియా గేమ్స్‌‌‌‌‌‌‌‌లో సిల్వర్‌‌‌‌‌‌‌‌, షాంఘైలో జరిగిన వరల్డ్‌‌‌‌‌‌‌‌కప్‌‌‌‌‌‌‌‌లో టీమ్‌‌‌‌‌‌‌‌ గోల్డ్‌‌‌‌‌‌‌‌ నెగ్గడంలో ధీరజ్‌‌‌‌‌‌‌‌దే ప్రముఖ పాత్ర. ఓవరాల్‌‌‌‌‌‌‌‌గా వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్స్‌‌‌‌‌‌‌‌లో అతను ఓ గోల్డ్‌‌‌‌‌‌‌‌, సిల్వర్‌‌‌‌‌‌‌‌, ఆరు బ్రాంజ్‌‌‌‌‌‌‌‌ మెడల్స్‌‌‌‌‌‌‌‌ గెలిచాడు. మెన్స్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌ విభాగంలో తరుణ్‌‌‌‌‌‌‌‌దీప్‌‌‌‌‌‌‌‌ రాయ్‌‌‌‌‌‌‌‌, ప్రవీణ్‌‌‌‌‌‌‌‌ జాదవ్‌‌‌‌‌‌‌‌తో కలిసి ధీరజ్‌‌‌‌‌‌‌‌ బరిలోకి దిగనున్నాడు. ఓవరాల్‌‌‌‌‌‌‌‌గా మెగా గేమ్స్‌‌‌‌‌‌‌‌లో ఒత్తిడిని జయిస్తే కచ్చితంగా ధీరజ్‌‌‌‌‌‌‌‌ మెడల్‌‌‌‌‌‌‌‌ గెలుస్తాడనే నమ్మకం బలంగా ఉంది. ప్రవీణ్‌‌‌‌‌‌‌‌ జాదవ్‌‌‌‌‌‌‌‌, తరుణ్‌‌‌‌‌‌‌‌దీప్‌‌‌‌‌‌‌‌ రాయ్‌‌‌‌‌‌‌‌ కూడా మంచి ఫామ్‌‌‌‌‌‌‌‌లో ఉండటం ఇండియాకు కలిసొచ్చే అంశం.

దీపిక ధీమా..

విమెన్‌‌‌‌‌‌‌‌ ఆర్చర్లలో అత్యంత సీనియర్‌‌‌‌‌‌‌‌ అయిన దీపికా కుమారిపై ఈసారి ప్రత్యేక దృష్టి నెలకొంది. బిడ్డకు జన్మనివ్వడంతో 14 నెలల పాటు ఆటకు దూరంగా ఉన్న ఆమె ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌ కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంది. ఆసియా కప్‌‌‌‌‌‌‌‌లో గోల్డ్‌‌‌‌‌‌‌‌, షాంఘై వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌లో సిల్వర్‌‌‌‌‌‌‌‌తో సత్తా చాటింది. టోక్యో ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌లో అనూహ్యంగా క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌లో తడబడిన దీపికా ఈసారి ఎలాగైనా మెడల్‌‌‌‌‌‌‌‌ నెగ్గాలనే కసితో ఉంది. పరిస్థితులు ఎలా ఉన్నా గురి తప్పకుండా బాణాలు వేయడంలో దీపిక దిట్ట. ఇక ఈమెకు తోడుగా భజన్‌‌‌‌‌‌‌‌ కౌర్‌‌‌‌‌‌‌‌, అంకిత కూడా పతకంపై గురి పెట్టారు.

ఒలింపిక్‌‌‌‌‌‌‌‌ క్వాలిఫయర్స్‌‌‌‌‌‌‌‌లో గోల్డ్‌‌‌‌‌‌‌‌ నెగ్గడం ద్వారా పారిస్‌‌‌‌‌‌‌‌ బెర్త్‌‌‌‌‌‌‌‌ దక్కించుకున్న భజన్‌‌‌‌‌‌‌‌ అదే ఫామ్‌‌‌‌‌‌‌‌ను కంటిన్యూ చేయాలని భావిస్తోంది. గతేడాది ఆసియా గేమ్స్‌‌‌‌‌‌‌‌లో బ్రాంజ్‌‌‌‌‌‌‌‌ నెగ్గిన టీమ్‌‌‌‌‌‌‌‌లో భజన్‌‌‌‌‌‌‌‌, అంకితా సభ్యులుగా ఉన్నారు. కొరియా సవాల్‌‌‌‌‌‌‌‌ను అధిగమిస్తే విమెన్స్‌‌‌‌‌‌‌‌లోనూ మెడల్‌‌‌‌‌‌‌‌ ఖాయం. అయితే పారిస్‌‌‌‌‌‌‌‌ గేమ్స్‌‌‌‌‌‌‌‌లో స్టార్టింగ్‌‌‌‌‌‌‌‌ నుంచే చాలా నిలకడగా బాణాలు సంధించి స్కోరును పెంచుకోవడం అత్యంత కీలకం. ఎందుకంటే గంటగంటకు అక్కడ వాతావరణం, గాలి వాటం పెరగడం, తగ్గడంలాంటివి జరుగుతాయి.