మాల్దీవులలో 1988లో తిరుగుబాటు.. తిప్పికొట్టిన భారత ఆర్మీ

  • మిలిటెంట్ల నుంచి ప్రెసిడెంట్ గయూమ్​ను కాపాడిన మన సోల్జర్లు
  • రక్షించాలంటూ పలు దేశాలకు గయూమ్ ఫోన్ కాల్స్ 
  • పట్టించుకోని అమెరికా, బ్రిటన్, పాకిస్తాన్​లు 
  • వెంటనే స్పందించి, సాయం చేసిన రాజీవ్ గాంధీ సర్కార్

న్యూఢిల్లీ: రిపబ్లికన్ ఆఫ్ మాల్దీవ్స్.. హిందూ మహాసముద్రంలో లక్షద్వీప్ కు దక్షిణాన కొన్ని దీవుల సమూహంగా ఉన్న అందమైన, అతి చిన్న దేశమిది. టూరిజం, చేపల వేట తప్ప వేరే జీవనాధారమే లేదు. అయినా.. హిందూ మహాసముద్రంలోని ప్రధాన రవాణా మార్గంలో ఒక టోల్ గేట్ మాదిరిగా ఉండటం కారణంగా ఇది రీజినల్ పాలిటిక్స్ లో కీలకంగా మారింది. అందుకే మూడు దశాబ్దాల కిందట1988లో మాల్దీవుల్లో అప్పటి ప్రెసిడెంట్ మౌమూన్ అబ్దుల్ గయూమ్ ప్రభుత్వాన్ని కూల్చేసేందుకు తిరుగుబాటు కుట్ర జరిగింది. 

తమను రక్షించాలంటూ వెంటనే పాకిస్తాన్, అమెరికా, బ్రిటన్, ఇండియా దేశాలకు గయూమ్ కాల్ చేశారు. పాకిస్తాన్ పట్టించుకోలేదు. బ్రిటన్ స్పందించలేదు. అమెరికా స్పందించినా.. హిందూ మహాసముద్రంలో ఉన్నందున మాల్దీవ్స్ ను కాపాడే బాధ్యత ఇండియానే తీసుకోవాలని స్పష్టం చేసింది. కానీ మాల్దీవుల నుంచి ఆదుకోవాలంటూ విజ్ఞప్తి వచ్చిన వెంటనే కాపాడేందుకు ఇండియా సిద్ధమైంది. అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఇండియన్ ఆర్మీని పంపి.. 20 గంటల్లోనే తిరుగుబాటుదారులను అణచివేసి, ప్రెసిడెంట్ ను కాపాడి, ఆ దేశాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించింది. 

 అప్పుడే మాల్దీవులు, ఇండియా మధ్య స్నేహబంధానికి బలమైన పునాదులు పడ్డాయి. ఈ ఆపరేషన్ జరిగిన తీరును ఆర్మీ మాజీ ఆఫీసర్ సుషాంత్ సింగ్ ‘మిషన్ ఓవర్సీస్’ పేరిట రాసిన పుస్తకంలో సమగ్రంగా వివరించారు. ఆపరేషన్ వెనక కీలక పాత్ర పోషించిన జనరల్ వీపీ మాలిక్ (అప్పటి బ్రిగేడియర్) కూడా తన ‘ఇండియాస్ మిలిటరీ కాన్ ఫ్లిక్ట్ అండ్ డిప్లమసీ’ పుస్తకంలోనూ ఈ ఆపరేషన్ గురించి రాశారు. కాలంతో పోటీ పడి ఈ ఆపరేషన్​ను ముగించినట్లు పేర్కొన్నారు.    

ఆ రోజు ఏం జరిగిందంటే..? 

1988, నవంబర్ 3న ఉదయం 6 గంటలు.. మాల్దీవ్స్ రాజధాని మాలె సిటీలోని హైకమిషనర్ ఆఫీస్ నుంచి ఢిల్లీకి ఫోన్ కాల్ వచ్చింది. మాలెలో గన్ షూటింగ్ జరిగిందని సమాచారం అందింది. ఆ తర్వాత అరగంటకు మరో కాల్ వచ్చింది. ఈసారి మాల్దీవుల ఫారిన్ సెక్రటరీ ఇబ్రహీం హుస్సేన్ జకీ లైన్ లోకి వచ్చారు. మాలెపై అటాక్ జరుగుతోందని, కాపాడాలంటూ భారత్ ను కోరారు. శ్రీలంక ప్రభుత్వ అండదండలు ఉన్న తమిళ్ మిలిటెంట్ సంస్థ ప్లోట్ (పీపుల్స్ లిబరేషన్ ఆఫ్​తమిళ్ ఈలం) అధినేత ఉమా మహేశ్వరన్, మాల్దీవ్స్ బిజినెస్ మాన్ అబ్దుల్లా లుథూఫీ కలిసి సర్కారును కూల్చేందుకు సిద్ధమయ్యారు. 

సర్కారును కూల్చేస్తే.. ఓ దీవిలో మిలిటరీ బేస్ ఏర్పాటు చేసుకునేందుకు చాన్స్ ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. పక్కా ప్లాన్ ప్రకారం నవంబర్ 3న ఉదయం దాడికి తెగబడ్డారు. దీంతో ప్రెసిడెంట్ గయూమ్ మాలెలోని నేషనల్ సెక్యూరిటీ సర్వీసెస్ హెడ్ క్వార్టర్స్ లో తలదాచుకున్నారు. ఉదయం 7.30 గంటలకల్లా మాలెలో తిరుగుబాటు అణచివేతకు రాజీవ్ సర్కార్ ఆదేశించింది. ఇందులోభాగంగా ‘ఆపరేషన్ కాక్టస్ (నాగ/బ్రహ్మ జెముడు)’ పేరుతో మిలిటరీ యాక్షన్ కు రూపకల్పన జరిగింది. ఇండియన్ ఆర్మీకి చెందిన పారాచూట్ బ్రిగేడ్ ఆగ్రా నుంచి ఎయిర్ ఫోర్స్ విమానం ఐఎల్ 76లో బయలుదేరింది. దాని వెనకే బ్యాకప్, సెక్యూరిటీ కోసం మరో విమానం వెంబడించింది. 

తెల్లారేసరికి ఆపరేషన్ ముగింపు 

రాత్రి10.30 గంటలకల్లా తమిళ్ మిలిటెంట్లకు ఏమాత్రం అనుమానం రాకుండా ఐఏఎఫ్ విమానం మాల్దీవుల్లోని హుల్ హులే ద్వీపంలో సీక్రెట్ గా ల్యాండ్ అయింది. అక్కడి నుంచి నిమిషాల్లో మాలెకు పడవల్లో ఇండియన్ ఆర్మీ కమాండోలు చేరుకున్నారు. అర్ధరాత్రి ఒంటి గంటకల్లా తమిళ్ మిలిటెంట్లను మన బలగాలు చుట్టుముట్టాయి. తెల్లవారుజా మున 4 గంటలకు నేషనల్ సెక్యూరిటీ సర్వీసెస్ హెడ్ క్వార్టర్స్ లో తలదాచుకున్న ప్రెసిడెంట్ గయూమ్ ను కాపాడాయి. అప్పటికప్పుడు గయూమ్ ఫోన్ చేసి రాజీవ్ గాంధీకి థ్యాంక్స్ చెప్పారు. 

ఇండియన్ ఆర్మీ ఎంటర్ కావడంతో అబ్దుల్లా లుథూఫీ బెంబేలెత్తిపోయాడు. సముద్రతీరంలో ఉన్న ఎంవీ ప్రోగ్రెస్ లైట్ అనే కార్గో షిప్ ను హైజాక్ చేసి, శ్రీలంక వైపుగా పారిపోవాలని చూశాడు. కానీ ఇండియన్ నేవీ షిప్పులు గోదావరి, బేత్వా వెంబడించాయి. మిసైల్ ప్రయోగించి నౌకను ధ్వంసం చేశాయి. నౌక మునిగిపోయేలోపే అందులో బందీలుగా ఉన్నవారిని నేవీ సిబ్బంది కాపాడారు. 

మళ్లీ చైనా అనుకూల సర్కార్.. 

2018లో చైనాకు అనుకూలుడైన అప్పటి మాల్దీవుల ప్రెసిడెంట్ అబ్దుల్లా యామీన్ దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించి, ప్రతిపక్ష నేతలను జైల్లో పెట్టా రు. భారత్ జోక్యం చేసుకోవాలంటూ ప్రతిపక్ష నేత మహ్మద్ నషీద్ విజ్ఞప్తి చేశారు. దీంతో కొన్ని రోజుల కు యామీన్ ఎమర్జెన్సీని ఎత్తేశారు. తర్వాత జరిగిన ఎన్నికల్లో భారత్ కు అనుకూలంగా ఉండే నషీద్ గద్దెనెక్కారు. నిరుటి ఎన్నికల్లో నషీద్ ఓడిపోవడం తో మళ్లీ చైనా అనుకూలుడైన మయిజ్జు ప్రభుత్వం వచ్చింది. దీంతో మరోసారి మాల్దీవుల్లో భారత్​కు వ్యతిరేక గాలులు మొదలయ్యాయి.