
శ్రీనగర్: ఇండియన్ ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది రేపు (ఏప్రిల్ 25) జమ్ము కశ్మీర్కు వెళుతున్నారు. పహల్గాంలో ఉగ్రమూకల దాడి తర్వాత శ్రీనగర్లో భద్రతా పరిస్థితులను స్వయంగా సమీక్షించాలని ఆయన నిర్ణయించుకున్నారు. అంతేకాదు.. భారత్ కౌంటర్ ఆపరేషన్స్పై సీనియర్ మిలటరీ కమాండర్లతో ఆయన చర్చించనున్నారు. ఎల్ఓసీ దగ్గర తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై కూడా ఆయన చర్చిస్తారు.
పహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన నరమేధం ఘటన తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య దైపాక్షిక సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. పర్యాటకులే లక్ష్యంగా జమ్మూకాశ్మీర్లో టెర్రరిస్టులు తెగబడ్డారు. ఆర్మీ యూనిఫాంలో వచ్చి, మతం అడిగి మరీ కాల్పులు జరిపారు. దొరికిన వాళ్లను దొరికినట్లు పిట్టలను కాల్చినట్లు కాల్చి చంపేశారు. అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న ఆ ‘మినీ స్విట్జర్లాండ్’.. కాల్పులతో దద్దరిల్లింది. ఎక్కడికక్కడ మృతదేహాలతో రక్తసిక్తమైంది. ఈ మారణహోమంలో 26 మంది ప్రాణాలు వదిలారు.
మృతుల్లో పలువురు హనీమూన్కు వచ్చిన దంపతులు ఉన్నారు. ఇద్దరు విదేశీయులు కూడా ఉన్నారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దారుణానికి తామే పాల్పడ్డట్లు లష్కరే తోయిబా ఉగ్ర సంస్థకు చెందిన ‘ది రెసిస్టెంట్ ఫ్రంట్’ (టీఆర్ఎఫ్) ప్రకటించింది. ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా స్పందించారు. ఉగ్రవాదులను వదిలిపెట్టేది లేదని, టెర్రరిజంపై తమ పోరాటాన్ని మరింత పెంచుతామని స్పష్టం చేశారు. ఉగ్రవాదులను వదిలిపెట్టేది లేదని, టెర్రరిజంపై తమ పోరాటాన్ని మరింత పెంచుతామని హెచ్చరించారు.