ఆర్మీ పరేడ్‌లో డ్రోన్ల దండు
తొలిసారి ప్రదర్శించిన సైన్యం
స్వదేశీ టెక్నాలజీతోనే తయారీ
న్యూఢిల్లీ: ఆర్మీ తొలిసారి స్వార్మ్ డ్రోన్ సిస్టమ్ ను ప్రదర్శించింది. ఢిల్లీలోని కరియప్ప గ్రౌండ్ లో శుక్రవారం జరిగిన ఆర్మీ డే పరేడ్ లో 75 డ్రోన్ల యుద్ధ సామర్థ్యాన్ని చూపించింది. మిడతల్లా గుంపుగా దూసుకెళ్లే ఈ డ్రోన్ల దండు.. శత్రు స్థావరాలను ధ్వంసం చేస్తుంది. యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ వెపన్ సిస్టమ్ షిల్కా, బ్రహ్మోస్ మిస్సైల్ సిస్టమ్, యుద్ధ ట్యాంకులు, రాకెట్ లాంచర్లనూ ఆర్మీ పరేడ్ లో ప్రదర్శించింది. ‘‘మన దేశంలోనే తయారు చేసిన 75 డ్రోన్ల సామర్థ్యాన్ని పరేడ్ లో ప్రదర్శించాం. ఇవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో టాస్క్ లను కంప్లీట్ చేశాయి. ఇండియన్ ఆర్మీ టెక్నాలజీ పరంగా డెవలప్ అవుతోందని, భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోందని చెప్పడానికి ఈ ప్రదర్శనే నిదర్శనం” అని ఆర్మీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఆర్మీ డే పరేడ్ లో చీఫ్ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్జనరల్ ఎంఎం నరవాణె, ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్ కేఎస్ బదౌరియా, నేవీ చీఫ్అడ్మిరల్ కరంబీర్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా 13 మంది ఆర్మీ ఆఫీసర్లకు యూనిట్ సిటేషన్ అవార్డులు, చనిపోయిన తర్వాత ఇచ్చే సేనా మెడల్ ను మరో 15 మందికి అందజేశారు. 1949 జనవరి 15న బ్రిటిష్ కమాండర్ నుంచి ఫీల్డ్ మార్షల్ కేఎం కరియప్ప ఇండియన్ ఆర్మీ బాధ్యతలు తీసుకున్నారు. దీనికి గుర్తుగా ఏటా జనవరి 15న ఆర్మీ డే నిర్వహిస్తారు.
మీ త్యాగాలను దేశం మరవదు: రాష్ట్రపతి
దేశ సేవలో ప్రాణాలర్పించిన వీరులను ప్రజలు ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. శుక్రవారం ఆర్మీ డే సందర్భంగా ఆయన విషెస్ చెబుతూ ట్వీట్ చేశారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోడీ, కేంద్రమంత్రులు సోషల్ మీడియా ద్వారా విషెస్ చెప్పారు. ‘దేశాన్ని రక్షిస్తున్న సైనికులు, వారి కుటుంబ సభ్యులకు ఆర్మీ డే శుభాకాంక్షలు. మన సైనికులు దేశాన్ని తలెత్తుకునేలా చేస్తున్నారు” అని మోడీ ట్వీట్ చేశారు. మన సైనికులు అంకిత భావానికి ప్రతీకలు అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ట్వీట్ చేయగా.. దేశం కోసం నిస్వార్థంగా పనిచేస్తున్న జవాన్లను చూసి దేశం గర్విస్తోందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు.
మా ఓపికను పరీక్షించొద్దు: నరవాణె
మన దేశ ఓపికను పరీక్షించొద్దని ఆర్మీ చీఫ్ జనరల్ నరవాణె చైనాను హెచ్చరించారు. బార్డర్ ఇష్యూను చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఆర్మీ డే పరేడ్‌లో ఆయన మాట్లాడారు. బార్డర్లో చైనా ఆర్మీ ఆక్రమణకు ప్రయత్నించగా, మన సైన్యం దీటుగా జవాబిచ్చిందని చెప్పారు.
గల్వాన్ ఘటనలో చనిపోయిన సైనికుల త్యాగాలు వృథా కావన్నారు. పాకిస్తాన్ టెర్రరిస్టులకు సహకరిస్తోందని ఆరోపించారు. మన దేశంలోకి చొరబడేందుకు బార్డర్ వెంట 400 మంది వరకు ఉగ్రవాదులు ఉన్నారని చెప్పారు. పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని పేర్కొన్నారు. చైనాతో గొడవ నేపథ్యంలో రూ.5 వేల కోట్ల ఆయుధాలను ఎమర్జెన్సీగా కొనుగోలు చేశామని వెల్లడించారు.
For More News..