- ఆర్మీ కాన్వాయ్‌పై కాల్పులు.. ఎదురుకాల్పుల్లో ముగ్గురు హతం
- జమ్మూకాశ్మీర్‌లోని అఖ్నూర్ ప్రాంతంలో ఘటన
జమ్మూ: జమ్మూకాశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు టెర్రరిస్టులు హతమయ్యారు. సోమవారం ఉదయం 7.25 గంటల సమయంలో జమ్మూలోని బట్టాల్ అఖ్నూర్ ప్రాంతంలో శివస్సన్ ఆలయ పరిసరాల్లో వెళ్తున్న ఆర్మీ కాన్వాయ్‌పై ముగ్గురు టెర్రరిస్టులు కాల్పులకు తెగబడ్డారు. కాన్వాయ్‌లో ఉన్న అంబులెన్స్‌పై 10 రౌండ్ల కాల్పులు జరిపారు. వెంటనే అలర్ట్ అయిన భద్రతా దళాలు మెరుపు వేగంతో ఎదురు కాల్పులు జరపడంతో టెర్రరిస్టులు దగ్గర్లోని అడవిలోకి పారిపోయారు. వారిని వెంబడించిన దళాలు.. ముగ్గురు టెర్రరిస్టులను మట్టుబెట్టారు.
ఘటనా స్థలం నుంచి ఆయుధాలు, పేలుడు పదార్థాలను బలగాలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆ ప్రాంతంలో భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ఇందు కోసం యుద్ధ ట్యాంకర్లను రంగంలో దింపాయి. ‘‘కాన్వాయ్‌పై కాల్పులు జరిగిన వెంటనే భద్రతా దళాలు వేగంగా స్పందించడంతో టెర్రరిస్టులు పారిపోయారు. వారిని వెంబడించి మట్టుబెట్టాం. ప్రస్తుతం ఆ ప్రాంతంలో యుద్ధ ట్యాంకర్ల సాయంతో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది’’ అని ఇండియన్ ఆర్మీ ‘ఎక్స్’లో తెలిపింది. టెర్రరిస్టులు అస్సాన్ టెంపుల్‌లోకి ప్రవేశించి, కాల్ చేసేందుకు మొబైల్ ఫోన్ కోసం వెతుకుతుండగా, అటు వైపు నుంచి అంబులెన్స్ రావడాన్ని గమనించి, దానిపై కాల్పులు జరిపారని ఆర్మీ ఉన్నతాధికారులు వెల్లడించారు. గత రాత్రి సరిహద్దు దాటి జమ్మూలోకి టెర్రరిస్టులు చొరబడి ఉండొచ్చని తెలిపారు.