- ఇన్వెస్టర్లకు రూ. 9.19 లక్షల కోట్ల లాస్
- సెన్సెక్స్ 930 పాయింట్లు డౌన్
- 2 నెలల కనిష్టానికి చేరిక
- 24,500 దిగువన నిఫ్టీ
ముంబై: స్మాల్, మిడ్‌క్యాప్ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడితో మార్కెట్లు మంగళవారం ఘోర నష్టాలను మూటగట్టుకున్నాయి. నిఫ్టీ స్మాల్ 100 ఇండెక్స్ 3.7 శాతం నష్టపోయింది. 17 ఇండెక్స్ స్టాక్స్‌లు ఐదు శాతానికిపైగా ఆనష్టపోయాయి. బీఎస్ఈ స్మాల్‌క్యాప్ గేజ్ 3.81 శాతం, మిడ్‌క్యాప్ ఇండెక్స్ 2.52 శాతం క్షీణించాయి. విదేశీ పెట్టుబడులు పెద్ద ఎత్తున తరలి వెళ్లడం, గ్లోబల్మార్కెట్ల నుంచి నెగటివ్ సంకేతాల వల్ల మార్కెట్లు రెండు నెలల కనిష్టానికి పడిపోయాయి. బెంచ్‌మార్క్ సెన్సెక్స్ 930.55 పాయింట్లు పడగా, నిఫ్టీ 24,500 స్థాయికి దిగజారింది. రెండవ రోజు నష్టాలను పొడిగిస్తూ సెన్సెక్స్ 930.55 పాయింట్లు క్షీణించి 80,220.72 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 1,001.74 పాయింట్లు తగ్గి 80,53.14 పాయింట్లకు చేరింది.
ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 309 పాయింట్లు క్షీణించి 24,472.10 వద్దకు చేరుకుంది. ఇందులోని 47 షేర్లు దిగువన ముగిశాయి. దీంతో ఇన్వెస్టర్లకు రూ. 9.19 లక్షల కోట్ల లాస్ వచ్చింది. బలహీనమైన ఆదాయ వృద్ధి ధోరణి, గ్లోబల్ మార్కెట్లలో బలహీనత ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయని, పెరుగుతున్న యూఎస్ బాండ్ ఈల్డ్‌లు, చైనా పాలసీ చర్యలు ఎఫ్ఐఐ అవుట్‌ఫ్లోలకు కారణమవుతున్నాయని ఎనలిస్టులు తెలిపారు.
30 సెన్సెక్స్ ప్యాక్ నుంచి, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎస్బీఐ, పవర్ గ్రిడ్, టాటా స్టీల్, ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా మోటార్స్, లార్సెన్ అండ్ టూబ్రో, ఎన్టీపీసీ, బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్ భారీగా నష్టపోగా, ఐసీఐసీఐ బ్యాంక్, నెస్లే ఇన్ఫోసిస్ లాభపడ్డాయి. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐలు) సోమవారం రూ. 2,261.83 కోట్లు, మంగళవారం రూ.3,978 కోట్ల విలువైన విలువైన ఈక్విటీలను అమ్మారు. ఈ నెల ఇప్పటి వరకు వీళ్లు రూ.86,365 కోట్ల విలువైన పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు (డీఐఐలు) సోమవారం రూ. 3,225.91 కోట్ల విలువైన ఈక్విటీలను కొన్నారు. అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ముగిశాయి. బీఎస్‌ఈలో మొత్తం 3,428 స్టాక్‌లు క్షీణించగా, 559 మాత్రమే పెరిగాయి. ఆసియా మార్కెట్లలో, సియోల్, టోక్యో నష్టాల్లో ముగియగా, షాంఘై, హాంకాంగ్ లాభాలతో ముగిశాయి. యూరప్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. సోమవారం అమెరికా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 0.61 శాతం పెరిగి 74.74 డాలర్లకు చేరుకుంది.
నిరాశపర్చిన హ్యుందాయ్ మోటార్ ఇండియా లిస్టింగ్
హ్యుందా య్ మోటార్ ఇండియా లిమిటెడ్ షేర్లు లిస్టింగ్‌లో తేలిపోయాయి. ఇష్యూ ధర రూ. 1,960తో పోలిస్తే 7 శాతం కంటే తక్కువగా ముగిశాయి. బీఎస్‌ఈలో ఇష్యూ ధర నుంచి 1.47 శాతం తగ్గి షేరు రూ.1,931 వద్ద లిస్టయింది. ప్రారంభ ట్రేడింగ్‌లో కొంత కోలుకుని గరిష్టంగా 0.44 శాతం పెరిగి రూ.1,968.80కి చేరుకుంది. తదనంతరం ఊపందుకోవడంలో విఫలమైంది. ఇంట్రాడేలో 7.80 శాతం క్షీణించి రూ. 1,807.05కి చేరుకుంది. సంస్థ షేర్లు చివరకు 7.12 శాతం క్షీణించి రూ.1,820.40 వద్ద ముగిశాయి. ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 1.32 శాతం క్షీణించి రూ.1,934 వద్ద ప్రారంభమైంది.