భారతీయ బిలియనీర్ల సంపద విలువ.. దేశ జీడీపీలో మూడో వంతు

భారతీయ బిలియనీర్ల సంపద విలువ.. దేశ జీడీపీలో మూడో వంతు
  • అత్యధికంగా ఆర్జించిన అదానీ..  13 శాతం తగ్గిన అంబానీ సంపద


న్యూఢిల్లీ: మనదేశంలోని అత్యంత సంపన్న వ్యక్తుల సంపద విలువ జీడీపీలో దాదాపు మూడో వంతుకు సమానమని వెల్లడయింది. ఇండియాలో 284 మంది బిలియనీర్లు ఉండగా, వీరి ఉమ్మడి సంపద రూ.98 లక్షల కోట్లకు చేరుకుంది. హురూన్​ గ్లోబల్ ​రిచ్​లిస్ట్​ ప్రకారం... అందరికంటే గౌతమ్ అదానీ అత్యధికంగా ఆర్జించారు. ఆయన సంపద రూ.8.4 లక్షల కోట్లకు చేరుకుంది. గత ఏడాదే 13 శాతం పెరిగింది. రిలయన్స్ ఇండస్ట్రీస్​ చైర్మన్ ముకేశ్​అంబానీ సంపద విలువ 13 శాతం తగ్గి రూ.8.6 లక్షల కోట్లకు చేరుకుంది. అయినప్పటికీ ఆయన ఇండియాతోపాటు ఆసియాలోనూ అత్యంత సంపన్నుడిగా కొనసాగుతున్నారు. అదానీ రెండోస్థానంలో ఉన్నారు. భారతీయ బిలియనీర్ల సగటు సంపాదన రూ.34,514 కోట్లు కాగా, చైనాలో ఇది రూ.29,027 కోట్లు ఉంది. మనదేశంలోని 175 మంది బిలియనీర్ల సంపద గత ఏడాదిలో భారీగా పెరగగా, 109 మంది బిలియనీర్ల సంపాదన మాత్రం తగ్గింది. 

అత్యంత సంపన్న మహిళ.. రోషిణీ నాడార్​

రూ.3.5 లక్షల కోట్ల నికర విలువతోన రోషిణీ నాడార్​అత్యంత ధనవంతురాలైన భారతీయ మహిళగా ఎదిగారు.  తండ్రి హెచ్‌‌సీఎల్‌‌లోని 47 శాతం వాటాను ఆమెకు బదిలీ చేయడంతో నెట్​వర్త్​ భారీగా పెరిగింది. ప్రపంచంలోని అత్యంత సంపన్న మహిళల్లో ఆమె ఐదో స్థానానికి ఎదిగారు.  ముంబై నుంచి గత ఏడాది కొత్తగా 11 మంది బిలియనీర్లుగా ఎదిగారు. దీంతో మొత్తం ముంబై బిలియనీర్ల సంఖ్య 90 మందికి చేరకుంది. ఈ సంవత్సరం షాంఘై ఆసియా బిలియనీర్ క్యాపిటల్​ అనే గుర్తింపును కోల్పోయింది. మనదేశంలో ఎక్కువ మంది బిలియనీర్లు హెల్త్​కేర్​ ఇండస్ట్రీ నుంచి ఉన్నారు.  భారతీయ బిలియనీర్ల సగటు వయస్సు 68 సంవత్సరాలు కాగా, ఇది ప్రపంచ బిలియనీర్ల సగటు వయస్సు కంటే రెండు సంవత్సరాలు ఎక్కువ. రేజర్‌‌పేకు చెందిన 34 ఏళ్ల శశాంక్ కుమార్, హర్షిల్ మాథుర్ రూ.8,643 కోట్ల చొప్పున సంపదతో భారత్​లోని అతిచిన్న వయస్కులైన బిలియనీర్లుగా ఎదిగారని హురూన్ వెల్లడించింది.