
Car Price Hike: మూడు రోజుల్లో మార్చి నెల ముగిసిపోతోంది. ఏప్రిల్ 1 నుంచి అనేక వస్తువులు, సేవల ఖరీదుగా మారిపోతున్నాయి. ఈ సమయంలో దేశంలోని కార్ల కంపెనీలు సైతం తమ వివిధ మోడళ్ల రేట్లను పెంచాలని నిర్ణయించాయి. ఉగాధికి కొత్త కారు కొందామని ప్లాన్ చేసుకుంటున్న వ్యక్తులు ప్రస్తుతం కార్లు పాత రేట్లలో ఉన్నప్పుడే కొనుక్కోవటం వల్ల కొన్ని వేల వరకు ప్రయోజనాన్ని పొందవచ్చు.
ఏప్రిల్ నెల నుంచి దేశంలోని అనేక ఒరిజినల్ పరికరాల తయారీదారులు తమ ప్రయాణికుల వాహనాల ధరలను పెంచుతుంటాయి. పెరుగుతున్న నిర్వహణ, ఇన్ పుట్ ఖర్చులను భర్తీ చేసేందుకు కంపెనీలు ఇలా చేస్తుంటాయి. దీనికి తోడు క్షీణిస్తున్న రూపాయి ధర సైతం కార్ల విక్రయ ధరలను ప్రభావితం చేస్తుంది. గత చరిత్రను గమనిస్తే ప్రతి ఆర్థిక సంవత్సరంలో కార్ల తయారీ సంస్థలు రెండుసార్లు తమ పాసింజెర్ వాహనాల రేట్లను పెంచుతుంటాయి. ఒకటి జనవరిలో కాగా రెండవది ఏప్రిల్ మాసంలో. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉద్రిక్తతలతో సరఫరా గొలుసు అంతరాయాలు కూడా రేట్ల పెంపుకు కారణంగా ఆటో ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
ఇప్పుడు కొత్త ఆర్థిక సంవత్సరంలో వివిధ కార్ కంపెనీలు ప్రకటించనున్న రేట్ల పెంపును పరిశీలిస్తే.. ముందుగా మారుతీ సుజుకీ కార్ల రేట్లను 4 శాతం పెంచుతుండగా.. హ్యుందాయ్ మోటార్స్ 3 శాతం వరకు రేట్ల పెంపుకు సిద్ధమౌతోంది. ఇదే సమయంలో మహీంద్రా అండ్ మహీంద్రా, కియా, బీఎండబ్యూ ఇండియాలు కూడా 3 శాతం వరకు రేట్ల పెంపుకు వెళ్లాలని నిర్ణయించాయి. అలాగే జనవరి 2025లో ఈ కంపెనీలు తమ పాసింజెర్ కార్ల ధరలను 2 శాతం నుంచి 4 శాతం మధ్య పెంపును ప్రకటించాయి. అయితే మారుతీ సుజుకీ మాత్రం రేట్లను ఎక్కువగా పెంచిన కంపెనీల జాబితాలో కొనసాగుతోంది.
ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి బలహీన సంగతి తెలిసిందే. దీంతో దిగుమతి చేసుకుంటున్న కార్ల విడిభాగాలు ఖరీదైనవిగా మారుతున్నాయి. దీనికి తోడు ఇతర కారకాలతో కార్ల తయారీదారులు మార్జిన్ల ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఇందులో 27 శాతం పెరిగిన రబ్బర్ ధరలు, 10 శాతానికి పైగా పెరిగిన అల్యూమినియం రేట్లు ధరలు పెంచాల్సిన పరిస్థితులను కల్పించాయి.
ALSO READ : పెట్రోల్ బంకుల్లో జరిగే క్రెడిట్ కార్డ్ మోసాలివే.. ఈ టిప్స్ ఫాలో అయితే మీ డబ్బు సేఫ్..!
ఇప్పటికే భారతీయ ఆటో రంగంలోని కంపెనీలు మందగించిన అమ్మకాలతో ఇబ్బంది పడుతున్నాయి. ఈ సమయంలో రేట్ల పెంపు నిర్ణయం సాహతోపేత నిర్ణయంగా చెప్పుకోవాలి. వార్షిక ప్రాతిపదికన అమ్మకాలు 10.34 శాతం తగ్గగా.. నెలవారీ అమ్మకాలు 34.88 శాతం క్షీణించిన సమయంలో రేట్ల పెంపు ప్రకటన ఆటో రంగం దిగ్గజాల నుంచి వస్తోంది. గడచిన రెండు త్రైమాసికాలుగా కంపెనీలు సేల్స్ పెంచేందుకు భారీగా డిస్కౌంట్లు ప్రకటించినప్పటికీ అమ్ముడు పోని కార్ల సంఖ్య అధికంగానే కొనసాగుతోందని తెలుస్తోంది. దీంతో ఇన్వెంటరీల క్లియరెన్స్ కోసం కంపెనీలు నానా పాట్లు పడుతున్నాయి.