హెలికాప్టర్ ప్రమాదం.. నెల రోజుల తర్వాత కోస్ట్ గార్డ్ పైలట్ మృతదేహం లభ్యం

హెలికాప్టర్ ప్రమాదం.. నెల రోజుల తర్వాత కోస్ట్ గార్డ్ పైలట్ మృతదేహం లభ్యం

2024, సెప్టెంబర్ 2న గుజరాత్ తీరంలో అరేబియా సముద్రంలో కూలిపోయిన అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్ (ALH) పైలట్ ఆర్‌కె రాణా మృతదేహాన్ని వెలికితీసినట్లు ఇండియన్ కోస్ట్ గార్డ్ ధృవీకరించింది. పోర్‌బందర్‌కు 55 కిలోమీటర్ల దూరంలో రానా అవశేషాలు లభించినట్లు ఐసీజీ ఒక ప్రకటనలో తెలిపింది.

ప్రమాదం ఎలా జరిగింది..?

సెప్టెంబర్ 2న గుజరాత్ తీరానికి దాదాపు 30 నాటికల్ మైళ్ల దూరంలో.. అరేబియా సముద్రం మధ్యలో మెడికల్ ఎమర్జెన్సీ రెస్క్యూ మిషన్ సమయంలో హెలికాప్టర్ సముద్రంలో కూలిపోయింది. ఆ సమయంలో హెలికాప్టర్ పైలట్ ఆర్‌కె రాణా సహా నలుగురు ఉన్నారు. ప్రమాదం జరిగిన కొద్దిసేపటికే ఒకరిని రక్షించగా, కమాండెంట్ (జూనియర్ గ్రేడ్) విపిన్ బాబు, ప్రధాన్ నావిక్ కరణ్ సింగ్ మృతదేహాలను మరుసటి రోజున(సెప్టెంబర్ 3) కనుగొన్నారు.

పైలట్ కమాండెంట్ ఆర్‌కె రాణా ఆచూకీ కోసం నెల రోజుల పాటు అన్వేషణ సాగింది. 70కి పైగా ఎయిర్ సోర్టీలు, 82 ఓడలు రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. సైనిక లాంఛనాలతో రాణా భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఐసీజీ వెల్లడించింది.