నెల తక్కువున్నా పర్లేదు.. అమెరికా పౌరసత్వం కోసం సిజేరియన్లు చేయమంటున్న భారత జంటలు

నెల తక్కువున్నా పర్లేదు.. అమెరికా పౌరసత్వం కోసం సిజేరియన్లు చేయమంటున్న భారత జంటలు

రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) విదేశీయుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాడు. అమెరికా అధ్యక్ష పగ్గాలను చేపట్టిన మొదటిరోజే వందకుపైగా కార్యనిర్వాహక ఉత్తర్వులపై (ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్లు) సంతకాలు చేశాడు. వీటిలో ముఖ్యమైనది.. జన్మతః పౌరసత్వం (అమెరికాలో పుట్టకతో వచ్చే పౌరసత్వం).

అమెరికాకు వలస వెళ్లిన వారు ఆ గడ్డపై పిల్లలకు జన్మనిస్తే.. ఆ చిన్నారులకు అక్కడి పౌరసత్వం లభించేది. ఆ చట్టాన్ని ట్రంప్‌ రద్దు చేశారు. ఈ నెల 20తేదీన ప్రమాణస్వీకారం చేసిన ట్రంప్.. అదే రోజు వలసదారుల సిటిజెన్‌షిప్ రద్దు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. సంతకం చేసిన 30 రోజుల్లో ఇది అమల్లోకి వస్తుంది. అందుకు గడువు.. వచ్చే నెల ఫిబ్రవరి 20. అంటే ఫిబ్రవరి 19 వరకు యుఎస్‌లో జన్మించిన పిల్లలు అమెరికన్ పౌరులుగా ఉంటారు. ఆ గడువు దాటితే ట్రంప్ ఆదేశాల ప్రకారం విదేశీయులు అమెరికా గడ్డపై పిల్లలకు జన్మనిచ్చినా అక్కడి పౌరసత్వం రాదు.

ALSO READ | టాలెంట్ ఉన్నోళ్లను అడ్డుకోం..హెచ్1బీ వీసాపై రెండు వాదనలూ నచ్చినయ్ : ట్రంప్

ఈ క్రమంలో ఎనిమిది.. తొమ్మిది నెలల్లో ఉన్న గర్భిణీలు తమకు సిజేరియన్ చేయండి బాబోయ్ అంటూ అక్కడి ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. అలా ఆసుపత్రులకు వస్తున్న వారిలో భారతీయ జంటలే ఎక్కువున్నట్లు అక్కడి వైద్యులు చెప్తున్నారు. కొన్ని జంటలైతే ఏడో నెలలోనూ తమకు సిజేరియన్ చేయమని హాస్పిటళ్లకు వెళ్తున్నారట. ఏడో నెలలో సిజేరియన్ బిడ్డ ఎదుగుదలపై ప్రభావం చూపుతుందని చెప్తున్నప్పటికీ, కొన్ని జంటలు తమను కన్విన్స్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని న్యూజెర్సీకి చెందిన ఓ డాక్టర్ మీడియాకు తెలిపారు.

యూఎస్‌లో దాదాపు పదివేల మంది భారతీయులు తాత్కాలిక H-1B, L1 వీసాలపై పనిచేస్తున్నారు. వీరంతా USలో శాశ్వత నివాసం కల్పించే గ్రీన్ కార్డ్‌ల కోసం కూడా క్యూలో ఉన్నారు. ట్రంప్‌ నిర్ణయంతో వీరిది ఎటూ తేల్చుకోలేని పరిస్థితి. అందుకే ఫిబ్రవరి 20లోపు సి-సెక్షన్ ద్వారా బిడ్డలను ప్రసవించాలనే హడావుడి.