Team India: ఎవరింటికి వాళ్ళే.. ఈ సారి బస్ పరేడ్ వేడుకలు లేవు.. కారణమిదే!

Team India: ఎవరింటికి వాళ్ళే.. ఈ సారి బస్ పరేడ్ వేడుకలు లేవు.. కారణమిదే!

ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచి ఫుల్ జోష్ మీదున్న టీమిండియా ఆటగాళ్లు సోమవారం (మార్చి 10) ఇండియాకు బయలుదేరనున్నారు. భారత్ లో అడుగుపెట్టగానే ఎప్పటిలాగే ఈ సారి గ్రాండ్ వేడుకలు నిర్వహించడానికి బీసీసీఐ ఆసక్తి చూపించనట్టు సమాచారం. ఆదివారం దుబాయ్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ విజయం తర్వాత భారత క్రికెట్ జట్టు వేర్వేరు నగరాలకు విడివిడిగా బయలుదేరనుంది. అనగా ఎవరి ఇంటికి వారు ప్రయాణమవుతారు. గత ఏడాది టీ20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత గ్రాండ్ గా టీమిండియా విజయోత్సవాన్ని పురస్కరించుకొని  ఇండియాలో గ్రాండ్ గా పరేడ్ వేడుకలు నిర్వహించిన సంగతి తెలిసిందే.

ఈ సారి మాత్రం ఆటగాళ్లకు రెస్ట్ కల్పించాలని బీసీసీఐ భావిస్తోందట. మార్చి 22న ఐపీఎల్ ప్రారంభం కావడంతో ఆటగాళ్లకు అలసిపోకుండా ఉండడానికి ఇండియాలో ఎలాంటి వేడుకలు నిర్వహించట్లేదట. ప్లేయర్లందరూ రెస్ట్ తీసుకొని ఆయా ఫ్రాంచైజీల దగ్గరకు చేరడానికి స్వల్ప విరామం అవసరమని బీసీసీఐ భావిస్తున్నట్టు సమాచారం. భారత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ సోమవారం సాయంత్రం న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోనున్నాడు. గత ఏడాది జూలైలో భారత జట్టు ప్రధాన కోచ్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత గంభీర్‌కు ఛాంపియన్స్ ట్రోఫీ తొలి ఐసీసీ టైటిల్. 

Also Read :  పాకిస్థాన్‌లో ఫైనల్ జరిగితే ఇండియా గెలిచేదా

చాంపియన్స్ ట్రోఫీలో అజేయ, అద్భుతమైన ఆటను కొనసాగించిన టీమిండియా అనుకున్నది సాధించింది. ఛేజింగ్‌‌‌‌లో కెప్టెన్ రోహిత్ శర్మ (83 బాల్స్‌‌‌‌లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 76) జట్టును ముందుండి నడిపించడంతో ముచ్చటగా మూడోసారి విజేతగా నిలిచింది. దుబాయ్ వేదికగా  ఆదివారం (మార్చి 9) జరిగిన మెగా ఫైనల్లో 4  వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌‌‌‌ను ఓడించి పుష్కరకాలం తర్వాత మళ్లీ ట్రోఫీని అందుకుంది. కివీస్ పోటీ ఇచ్చినా భారత్ విజయాన్ని మాత్రం ఆపలేకపోయింది. ఇండియాకు ఇది మూడో ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్. అంతకముందు 2013 లో ధోనీ కెప్టెన్సీలో ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ గెలిచింది. 2002లో గంగూలీ కెప్టెన్సీలో  శ్రీలంకతో పాటు సంయుక్త విజేతగా నిలిచింది.