ఐపీఎల్ 2024 ప్రారంభానికి ముందు గుజరాత్ టైటాన్స్‌కు పెద్ద ఎదురు దెబ్బ తగలింది. ఆ జట్టు ప్రధాన పేసర్ మహ్మద్ షమీ మెగా టోర్నీకి దూరం కానున్నాడు. ప్రస్తుతం ఎడమ చీలమండ గాయంతో బాధపడుతున్న షమీ.. యూకేలో శస్త్రచికిత్స చేయించుకోనున్నాడు. త్వరలోనే అతను బయలుదేరి వెళ్లనున్నాడు. అనంతరం దాన్ని నుంచి కోలుకోవడానికి 3 నుంచి 4 నెలల సమయం పడుతుందట. దీంతో షమీ ఐపీఎల్ మొత్తానికి దూరం కానున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.
టీ20 ప్రపంచ కప్‌కు అనుమానమే..!
ఒకరకంగా షమీ గాయం.. గుజరాత్ టైటాన్స్‌కే కాదు, భారత జట్టుకు భారీ దెబ్బే. శస్త్రచికిత్స అనంతరం అతను కోలుకోవడానికి చాలా సమయం పడుతుందట. అంటే ఐపీఎల్ అనంతరం బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌లతో జరిగే సిరీస్‌లతో పాటు టీ20 ప్రపంచకప్‌కు అతడు దూరమవనున్నట్లు సమాచారం. డిసెంబర్‌లో జరిగే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి అతను తిరిగి రావచ్చని నివేదికలు పేర్కొంటున్నాయి. షమీ చివరిసారిగా నవంబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో భారత్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.
Mohammed Shami ruled out of the IPL 2024. [PTI] pic.twitter.com/zPWhSQ5o6N
— Johns. (@CricCrazyJohns) February 22, 2024
ఒకవైపు గాయంతో బాధపడుతూనే షమీ.. వన్డే ప్రపంచ కప్‌లో రాణించాడు. 24 వికెట్లతో టాప్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. ఆ ప్రదర్శనకుగానూ అతన్ని ఇటీవలే అర్జున అవార్డు వరించింది. ఇప్పటివరకూ 64 టెస్టులు, 101 వన్డేలు, 23 టీ20లు ఆడిన షమీ.. వరుసగా 229, 195, 24 వికెట్లు పడగొట్టాడు.