Sachin Tendulkar: సచిన్‌కు MCC గౌరవ సభ్యత్వం

Sachin Tendulkar: సచిన్‌కు MCC గౌరవ సభ్యత్వం

భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌కు విశిష్ట గౌరవ సభ్యత్వం ఇవ్వనున్నట్లు మెల్‌బోర్న్‌ క్రికెట్‌ క్లబ్‌ (Melbourne Cricket Club) ప్రకటించింది. తమ ప్రతిపాదనను సచిన్‌ అంగీకరించినట్లు ఎంసీసీ ప్రెసిడెంట్ ఫ్రెడ్ ఓల్డ్‌ఫీల్డ్ ధృవీకరించారు.

ఎంసీసీ గౌరవ సభ్యత్వాన్ని సచిన్ స్వీకరించడంపై క్లబ్ ప్రెసిడెంట్ ఫ్రెడ్ ఓల్డ్‌ఫీల్డ్ ఆనందం వ్యక్తం చేశారు. సచిన్‌ టెండుల్కర్‌ ఒక్క భారత క్రికెట్‌కే కాదు.. ప్రపంచ క్రికెట్‌కు ఎనలేని సేవలు అందించారని ప్రశంసించారు. అటువంటి అత్యుత్తమ క్రీడాకారుడు తమ విశిష్ట సభ్యత్వం స్వీకరించడమనేది తమకు గొప్ప విషయమని భారత క్రికెటర్‌ని కొనియాడారు.

  
మెల్‌బోర్న్‌ క్రికెట్‌ క్లబ్‌(MCC) ఆస్ట్రేలియాలోని పురాతన స్పోర్ట్స్ క్లబ్‌లలో ఒకటి. దీన్ని నవంబర్ 15, 1983న ఫ్రెడరిక్ పావ్లెట్, రాబర్ట్ రస్సెల్, జార్జ్ స్మిత్, ఆల్ఫ్రెడ్, చార్లెస్ సోదరులు స్థాపించారు. ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ క్రీడా వేదికగా ఈ స్టేడియానికి పేరుంది. ఈ గ్రౌండ్‌లో సచిన్‌ పరుగుల వరద పారించారు. భారత జట్టు తరుపున MCGలో 5 టెస్టులు, 7 వన్డేలు ఆడిన సచిన్.. వరుసగా 449, 190 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, మూడు అర్ధసెంచరీలు ఉన్నాయి. టీమిండియా తరఫున అత్యధిక పరుగుల స్కోరర్‌గా  సచిన్‌ ఇప్పటికీ కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో సచిన్‌కు గౌరవ సభ్యత్వం ఇవ్వాలని ఎంసీసీ నిర్ణయించింది. 

తన 24 ఏళ్ల కెరీర్‌లో భారత్ తరఫున మొత్తం 200 టెస్టులు, 463 వన్డేలు, 1 టీ20 ఆడిన టెండూల్కర్ అంతర్జాతీయ క్రికెట్‌లో ఆల్ టైమ్ అత్యధిక పరుగుల స్కోరర్. టెస్టులు, వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కూడా రికార్డు సృష్టించారు.

2012లో టెండూల్కర్ ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా (OAM)లో గౌరవ సభ్యునిగా ఎంపికయ్యారు. ఈ గౌరవం పొందిన మొదటి ఆస్ట్రేలియేతర క్రికెటర్ సచిన్. అదే ఏడాది భారత మాజీ క్రికెటర్‌కు సిడ్నీ క్రికెట్ క్లబ్ (SCC) గౌరవ జీవిత సభ్యత్వం కూడా లభించింది. 2014లో టెండూల్కర్‌కు ఇంగ్లాండ్‌లోని యార్క్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ గౌరవ జీవిత సభ్యత్వం లభించింది.