"ఆడితే దేశానికి లేదంటే ఐపీఎల్.." భారత జట్టులోని కీలక ఆటగాళ్లు అందరూ దాదాపు ఇదే వైఖరి అనుసరిస్తున్నారు. ఒకవేళ జట్టులో స్థానం కోల్పోతే ఇంటికెళ్లి విశ్రాంతి తీసుకుంటాం తప్ప దేశవాళీ క్రికెట్ ఆడేదిలేదంటూ మొండికేస్తున్నారు. ఈ విషయంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) హెచ్చరించినా వారు పెడచెవిన పెడుతున్నారు. కాదు, కూడదు అంటే దాన్నించి తప్పించుకోవడానికి తప్పుడు మార్గాలు అనుసరిస్తున్నారు. భారతయువ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ అలాంటి పని చేసి అడ్డంగా బుక్కయ్యాడు.
ALSO READ | నాలుగో టెస్ట్‌కు స్లో వికెట్!
ఇంగ్లండ్‌తో చివరి మూడు టెస్టులకు ప్రకటించిన భారత జట్టులో శ్రేయాస్ అయ్యర్‌కు చోటు దక్కలేదు. గాయం కారణంగా అతనికి విశ్రాంతినిచ్చారని తొలుత వార్తలొచ్చినప్పటికీ.. అది ప్రధాన కారణం కాదని తరువాత తెలిసింది. పరుగులు సాధించడంలో విఫలమవ్వడంతోనే సెలెక్టర్లు అతనిపై వేటు వేశారు. అయితే, వెన్ను నొప్పి అంటూ జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ)కి వెళ్లిన అయ్యర్.. దాన్ని సాకుగా చూపుతూ రంజీ ట్రోఫీ నుంచి వైదొలిగాడు. శుక్రవారం నుంచి ముంబై-బరోడా జట్ల మధ్య రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్స్ జరగనుండగా.. అయ్యర్ అందుబాటులో ఉండట్లేదని ముంబై అసోషియేషన్ ప్రకటించింది. ఇక్కడే అయ్యర్ పన్నిన కుట్ర బట్టబయలైంది. ఎన్సీఏ అధికారులు బీసీసీఐకి ఇచ్చిన తాజా నివేదిక అయ్యర్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఉంది.
గాయాలు లేవు.. ఫిట్
ప్రస్తుతానికి అయ్యర్‌కు గాయమేది లేదని, పూర్తి ఫిట్‌గా ఉన్నాడని ఎన్సీఏ అధికారులు బీసీసీఐకి నివేదిక ఇచ్చారు. దీంతో అయ్యర్ మొండి వైఖరిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఐపీఎల్‌ను దృష్టిలో పెట్టుకుని అయ్యర్ ఇలా వ్యవహరిస్తున్నాడని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ కూడా ఇదే దారి అనుసరిస్తున్నాడు. దేశవాళీ క్రికెట్ ఆడితేనే మానసిక అలసటతో దూరమైన ఇషాన్ కిషన్ తిరిగి భారత జట్టులోకి వస్తాడని హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ చెప్పినప్పటికీ.. అతను బరిలోకి దిగలేదు. దీనిపై బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.