Shreyas Iyer: తప్పుడు ప్రచారాలు వద్దు.. నిజమేంటో తెలుసుకొని రాయండి: శ్రేయాస్ అయ్యర్

Shreyas Iyer: తప్పుడు ప్రచారాలు వద్దు.. నిజమేంటో తెలుసుకొని రాయండి: శ్రేయాస్ అయ్యర్

భారత జట్టుకు దూరమైన శ్రేయాస్ అయ్యర్ ప్రస్తుతం దేశవాళీ క్రికెట్ ఆడుతున్న విషయం తెలిసిందే. ముంబై జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న అయ్యర్.. ఇటీవల మహారాష్ట్రతో జరిగిన రంజీ మ్యాచ్‌లో భారీ సెంచరీ(142) నమోదు చేశాడు. అయితే, శనివారం(అక్టోబర్ 26) నుంచి త్రిపురతో ప్రారంభమైన మ్యాచ్‌లో అతను బరిలోకి దిగలేదు. ఇది పలు ఊహాగానాలకు తెరతీసింది.

సెంచరీ తరువాత తదుపరి మ్యాచ్‌లోనే అయ్యర్ ఆడకపోవటంపై ఓ క్రీడా జర్నలిస్ట్.. గాయాన్ని సాకుగా చూపాడు. భుజం గాయం కారణంగా ముంబై మిడిల్ ఆర్డర్ బ్యాటర్ కనిపించడం లేదని ఓ నివేదిక పేర్కొందంటూ తన సోషల్ మీడియా ఖాతాలో కథనాన్ని పోస్ట్ చేశాడు. ఈ విషయం అయ్యర్ దృష్టికి రావడంతో భారత బ్యాటర్ సీరియస్ అయ్యాడు. ఒక వార్తను ప్రచురించే ముందు.. నిజానిజాలేంటో తెలుసుకోవాలని అతనికి  సూచించాడు.    

Also Read :- జట్టుగా ఓడిపోయాం.. ఆ విషయం గురించి ఆలోచన లేదు

"అబ్బాయిలూ.. వార్తలను ప్రచురించే ముందు కొంత హోంవర్క్ చేద్దాం.. నిజానిజాలేంటో తెలుసుకుందాం.." అని అయ్యర్ @mufaddal_vohra అనే ఎక్స్ యూజర్ ని ఉద్దేశించి ట్వీట్ చేశాడు. వెంటనే సదరు యూజర్.. అయ్యర్‌కు క్షమాపణలు చెప్పాడు. తప్పుడు వార్తలు ప్రచారం చేయాలనే ఉద్దేశ్యం తమకు లేదని తెలిపాడు. దీనిపై నెట్టింట పెద్ద చర్చే జరుగుతోంది. గాయం నిజం కాకపోతే, ఎందుకు ఆడటం లేదో చెప్పాలని నెటిజన్లు అయ్యర్ ను ప్రశ్నిస్తున్నారు. ఈ ట్వీట్ల పరంపర అలానే కొనసాగుతోంది.