టీమిండియా వెటరన్ వికెట్ కీపర్, బెంగాల్ బ్యాటర్ వృద్ధిమాన్ సాహా(Wriddhiman Saha) అన్ని రకాల క్రికెట్ నుండి వైదొలిగాడు. శనివారం(ఫిబ్రవరి 1) రంజీ ట్రోఫీలో తన చివరి గ్రూప్-స్టేజ్ మ్యాచ్ ఆడిన తరువాత సాహా తన నిర్ణయాన్ని ప్రకటించాడు. దేశ అత్యుత్తమ వికెట్ కీపర్లలో ఒకరైన సాహా.. తన కుటుంబ సభ్యులకు, కోచ్ లకు కృతజ్ఞతలు తెలుపుతూ భావోద్వేగ ప్రకటన చేశాడు.
28 ఏళ్ల సుదీర్ఘ క్రికెట్ కెరీర్ కొనసాగించిన సాహా.. దేశం, రాష్ట్రం, జిల్లా, క్లబ్‌లు, స్కూల్, కాలేజీ, యూనివర్సిటీ స్థాయిల్లో ప్రాతినిధ్యం వహించడం తన జీవితంలో గొప్ప గౌరవమని చెప్పుకొచ్చాడు. కెరీర్‌లో హెచ్చు తగ్గులను గుర్తించి, ముందుకు సాగడానికి ఇదే సమయం అని తెలిపిన సాహా.. తన క్రికెట్ ప్రయాణంలోనిరంతరం మద్దతుగా నిలిచిన తల్లిదండ్రులు, సోదరుడు, భార్య (రోమి), పిల్లలు (అన్వీ, అన్వే) అత్తమామలకు కృతజ్ఞతలు తెలిపాడు.
Thank You, Cricket. Thank You everyone. 🙏 pic.twitter.com/eSKyGQht4R
— Wriddhiman Saha (@Wriddhipops) February 1, 2025
2010లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన సాహా భారత జట్టు తరఫున 40 టెస్టులు, 9 వన్డేలు ఆడాడు. 2014లో ఎంఎస్ ధోని టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్ అయ్యాక.. రిషబ్ పంత్ రాకముందే భారత టెస్ట్ జట్టుకు సాహానే దిక్కు. ఎన్నో విలువైన ఇన్నింగ్స్‌లు ఆడినప్పటికీ, తగిన గుర్తింపు పొందలేకపోయాడు. 2021లో సాహా తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. ఐపీఎల్‌లో పలు జట్లకు ప్రాతినిధ్యం వహించిన సాహా.. 170 మ్యాచుల్లో 2934 పరుగులు చేశాడు.
ALSO READ | BCCI Awards 2025: బీసీసీఐ నమన్ అవార్డులు.. విజేతలు వీరే..