ఇదెలా సాధ్యం.: 6 నెలలుగా ఒక్క టెస్టూ ఆడలేదు.. ICC ర్యాంకింగ్స్‌లో ఇరగదీశారు

ఇదెలా సాధ్యం.: 6 నెలలుగా ఒక్క టెస్టూ ఆడలేదు.. ICC ర్యాంకింగ్స్‌లో ఇరగదీశారు

సినిమా రిలీజ్ కాకముందే కలెక్షన్ల వర్షం కురిసినట్టు.. ఆటగాళ్లు మైదానంలోకి అడుగుపెట్టకుండానే మెరుగైన ర్యాంకులు సాధిస్తే భలే ఉంటది కదా..! తాజా ఐసీసీ ర్యాకింగ్స్ చూస్తే అలాంటి అనుభూతే కలుగుతుంది. ఈ ఏడాది మార్చి నుండి భారత జట్టు ఒక్కటంటే ఒక్క టెస్ట్ మ్యాచూ ఆడలేదు. కానీ, భారత ఆటగాళ్లు మాత్రం ర్యాకింగ్స్‌లో ఇరగదీశారు.

చివరగా ఇంగ్లండ్‌తో 

2024 మార్చిలో స్వదేశంలో ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో తలపడిన భారత జట్టు ఆ తరువాత ఒక్క టెస్టు మ్యాచ్ ఆడలేదు. సెప్టెంబర్ 19 నుండి మరో 10 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. అయితే, ఐసిసి తాజా ర్యాంకింగ్స్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్‌లు మాత్రం ఒక్కో స్థానం ఎగబాకి టాప్ 10లో చోటు దక్కించుకున్నారు.

Also Read :- మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడిన 43 మందిపై జీవితకాల నిషేధం

751 రేటింగ్ పాయింట్లతో  కెప్టెన్ రోహిత్ శర్మ ఐదో స్థానంలో ఉండగా.. జైస్వాల్(740), కోహ్లీ (737) వరుసగా ఆరు, ఏడు స్థానాల్లో ఉన్నారు. ఈ జాబితాలో ఇంగ్లండ్ బ్యాటింగ్ దిగ్గజం జో రూట్ 899 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు.

ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టాప్ 10 బ్యాటర్లు

1. జో రూట్: 899
2. కేన్ విలియమ్సన్: 859
3. డారిల్ మిచెల్: 768
4. స్టీవ్ స్మిత్: 757
5. రోహిత్ శర్మ: 751
6. యశస్వి జైస్వాల్: 740
7. విరాట్ కోహ్లీ: 737
8. ఉస్మాన్ ఖవాజా: 728
9. మహ్మద్ రిజ్వాన్: 720
10. మార్నస్ లబుఛానే: 720

సెప్టెంబర్ 19 నుండి టెస్ట్ సిరీస్ 

సెప్టెంబర్ 19 నుండి భారత్, బంగ్లాదేశ్‌ జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో భారత బ్యాటర్లు బ్యాట్ ఝుళిపిస్తే టాప్-5లోకి చేరుకోవచ్చు. అయితే, తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ పై మాత్రం తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఆటగాళ్లు మైదానంలోకి దిగకుండానే ర్యాంకుల్లో పురోగతి సాధించడం విడ్డురంగా ఉందని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.