న్యూఢిల్లీ: కెనడాలో ఉన్నత చదువులు చదవాలనుకునే ఇండియన్లు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలని భారత దౌత్యవేత్త సంజయ్ వర్మ అన్నారు. ఎన్నో ఆశలతో ఉన్నత చదువుల కోసం కెనడా వెళుతున్న భారత యువత చివరకు కలలు చెదిరి విగత జీవులుగా స్వదేశానికి వస్తున్నారని ఆయన చెప్పారు. ఇటీవల కెనడా నుంచి తిరిగివచ్చిన భారత దౌత్యవేత్తల్లో వర్మ కూడా ఒకరు. శుక్రవారం పీటీఐతో ఆయన మాట్లాడారు. ‘‘కెనడాలో కొన్ని వర్సిటీలు తప్ప మిగతావన్నీ నాసిరకమే. టాప్ వర్సిటీల్లో కొంతమందికే సీటు వస్తుంది.
సీటురాని మిగతా విద్యార్థులు నాసిరకం వర్సిటీల్లో చేరతారు. విద్యా ప్రమాణాలు ఏమాత్రం బాగుండవు. వారానికి ఒక్కసారే క్లాసులు జరుగుతాయి. అంతేకాకుండా మన స్టూడెంట్లు ఇరుకైన గదుల్లో ఉంటారు. ఒక్క రూమ్ లో కనీసం 8 మంది నిద్రపోతారు. దీన్ని ఎవరికీ చెప్పుకోలేరు. నాసిరకం వర్సిటీల్లో చదవడంతో వారి నైపుణ్యాలు కూడా అలాగే ఉంటాయి. చివరకు అనుకున్న లక్ష్యం సాధించక క్యాబ్ డ్రైవర్ గా పనిచేయడం, చాయ్ సమోసా విక్రయించడం చేస్తుంటారు. కొంతమంది సూసైడ్ చేసుకున్న ఘటనలు కూడా ఉన్నాయి.
అక్కడ నేను పని చేస్తున్నపుడు వారంలో కనీసం ఇద్దరు విద్యార్థుల మృతదేహాలు బాడీ బ్యాగ్ లలో పెట్టి ఇండియాకు తరలించిన సందర్భాలు ఉన్నాయి” అని సంజయ్ వివరించారు. కాగా, కెనడా ప్రధాని ట్రూడో కోటరీలో ఖలిస్తానీ టెర్రరిస్టులు ఉన్నారని, అక్కడ ఓసారి తనపై హత్యాయత్నం కూడా జరిగిందని వర్మ తెలిపారు.
ఖలిస్తానీలకు ట్రూడో మద్దతు: అమరీందర్ సింగ్
కెనడా ప్రధాని ట్రూడో కేవలం ఓట్ల కోసం ఖలిస్తానీలను ప్రమోట్ చేస్తున్నారని బీజేపీ నేత, పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ ఫైర్ అయ్యారు. ఇండియా, కెనడా మధ్య సంబంధాల్లో అనిశ్చితి నెలకొనడానికి ఆయనే ప్రధాన కారణమని విమర్శించారు. సిక్కు ఓట్ల కోసం ఆయన రెండు దేశాల మధ్య సంబంధాలను నాశనం చేశారన్నారు.