ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఇతర ప్రపంచ దేశాలతో జరిపే అన్ని రకాల ఆర్థిక కార్యకలాపాలను ఒక క్రమపద్ధతిలో రాసే పట్టికను విదేశీ వ్యాపార చెల్లింపుల శేషం (బీఓపీ) అంటారు. ఒక నిర్ణీత కాలంలో ఒక దేశ ప్రజలు ప్రపంచ దేశాలతో జరిపే అన్నిరకాల కార్యకలాపాలను ద్వంద్వ పద్ధతిలో నమోదు చేసే పట్టికే బీఓపీ. వస్తు ఎగుమతులు, అందించిన సేవలకు రాబడులు, దేశీయులు పొందిన మూలధన రాబడులు, రాబడి వర్గంలోను, వస్తు దిగుమతులకు చెల్లింపులు ఇతర దేశాల నుంచి పొందిన సేవల చెల్లింపులు, విదేశీయులకు బదిలీ చేసిన మూలధనం, చెల్లింపుల వర్గంలోను వస్తాయి. కేవలం వస్తువుల ఎగుమతులు, దిగుమతుల గురించి తెలియజేసేది బీఓటీ. కాగా అన్నిరకాల ఆర్థిక కార్యకలాపాలను తెలియజేసేది బీఓపీ. బీఓపీలో రెండు ఖాతాలుంటాయి.
అవి.. ఎ. కరెంట్ ఖాతా బి. మూలధన ఖాతా.
వస్తువుల, సేవలు, ఆదాయం కరెంట్ ఖాతాకు సంబంధించినవి. క్లెయిమ్‌లు, లయబిలిటీలు, కరెంట్ ఖాతా లోటు లేదా మిగులు భర్తీ అంశాలు, మూలధన ఖాతాకు చెంది ఉంటాయి. ఈ కరెంటు, మూలధన ఖాతా వ్యవహారాలు రెండూ కలిపి బేసిక్ బ్యాలెన్స్‌ను చూపుతాయి. ఐఎంఎఫ్.. బీఓపీ మాన్యువల్ ప్రకారం వస్తువుల ఎగుమతులు, దిగుమతులను ఫ్రీ–ఆన్–బోర్డ్ –ఎఫ్ఓబీ (రవాణా, బీమా వ్యయం కలపకుండా ప్రకటిస్తారు. కారణం వీటిని అదృశ్య అంశాల్లో లెక్కిస్తారు) పద్ధతిలో ప్రకటిస్తారు. అయితే మన దేశంలో సమాచార అడ్డంకుల వల్ల దిగుమతులను సీఐఎఫ్ (కాస్ట్ ఇన్సూరెన్స్ అండ్ ఫ్రైట్) ప్రాతిపదికన, ఎగుమతులను ఎఫ్ఓబీ ప్రాతిపదికన ప్రకటిస్తారు.
కరెంట్ ఖాతా: ఇది ఫ్లో కాన్సెప్ట్. ఇందులో మూడు అంశాలు ఉన్నాయి.
దృశ్యాంశాలు: వస్తువుల ఎగుమతి, దిగుమతులకు సంబంధించిన అంశాలు దృశ్యాంశాలు. వస్తువుల ఎగుమతి, దిగుమతుల నమోదును తెలియజేసేది వ్యాపార శేషం(బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్). ఇందులో వస్తువులు మాత్రమే చూపుతారు. బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ మూడు రకాలుగా ఉండవచ్చు. ఎ. వస్తువుల ఎగుమతులు, దిగుమతులు సమానమైతే వర్తక శేషం సమతౌల్యం (ఎక్స్–ఎం). బి. దిగుమతుల కంటే ఎగుమతులు ఎక్కువగా ఉంటే వర్తక శేషం మిగులు (ఎక్స్>ఎం). వర్తకపు మిగులునే అనుకూల వర్తక శేషం అంటారు. సి. ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువైతే వర్తక శేషం లోటు (ఎక్స్< ఎం). వర్తకపు లోటునే ప్రతికూల వర్తక శేషం అంటారు. ఎగుమతుల విలువ నుంచి దిగుమతుల విలువ తీసివేస్తే నికర ఎగుమతులు వస్తాయి. నికర ఎగుమతుల విలువ శూన్యం (ఎక్స్ =ఎం) అయితే బీఓటీ సమతౌల్యం. నికర ఎగుమతుల విలువ పాజిటివ్‌గా ఉంటే (ఎక్స్>ఎం) అయితే బీఓటీ మిగులు. నికర ఎగుమతుల విలువ నెగిటివ్ అయితే (ఎక్స్< ఎం) బీఓటీ లోటు.
అదృశ్య అంశాలు: ఒక దేశం మరో దేశానికి అందించే, స్వీకరించే సేవలు అదృశ్య అంశాలు. ఉదా: బ్యాంకింగ్, బీమా, రవాణా, యాత్రికుల సేవలు, విదేశాల్లో చదువుతున్న విద్యార్థులు, దౌత్యకార్యాలయాలపై వ్యయం, వడ్డీ లాభాలు, డివిడెండ్లు మొదలైనవి. ఒక దేశం మరో దేశానికి సేవలందిస్తే రాబడిగాను, ఇతర దేశాల నుంచి పొందితే చెల్లింపులుగాను నమోదు చేస్తారు.
మూలధన ఖాతా: వర్తమాన ఖాతాలోని మిగులు, లోటులను మూలధన ఖాతాల లావాదేవీల ద్వారా పూరించబడుతాయి. మూలధన ఖాతాలో స్వల్పకాలిక– దీర్ఘకాలిక రుణాలు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు – పోర్టుపోలియో పెట్టుబడులు, విదేశీ దేశాల ప్రభుత్వాలు, అంతర్జాతీయ విత్త సంస్థలు అందించే అభివృద్ధి సహాయం, బంగారం క్రయవిక్రయాలు, విదేశీ సెక్యూరిటీల కొనుగోళ్లు, అమ్మకాలు, విదేశీ మారకద్రవ్య చలనాలు మొదలైన అంశాలు భాగాలుగా ఉంటాయి.
బీఓపీ– అకౌంటింగ్ దృష్ట్యా సమతౌల్యం: కరెంట్ ఖాతాలో లోటు ఏర్పడితే మూలధన ఖాతాలో మిగులు చూపడం ద్వారా కరెంట్ ఖాతాలో మిగులు ఏర్పడిన మూలధన ఖాతాలో లోటు చూపడం ద్వారా బీఓపీలో ఎల్లప్పుడూ అకౌంటింగ్ దృష్ట్యా సమతౌల్యం ఉంటుంది. అందుకే ఇది దేశ ఆర్థిక వాస్తవ స్థితిని తెలియజేయదు. అందువల్ల బీఓపీలో లోటు అంటే కరెంట్ ఖాతాలో లోటునే పేర్కొంటారు. బీఓపీని డబుల్ ఎంట్రీ సిస్టమ్‌లో నమోదు చేస్తారు. కాబట్టి రాబడులు, చెల్లింపులు సమానంగా ఉంటాయి. అంటే దేశం బీఓపీ సమస్యను ఎదుర్కోదు అని అర్థం కాదు. ఒక దేశం కరెంట్ ఖాతా లోటును కలిగి ఉంటే విదేశాల నుంచి అప్పు తీసుకురావడం ద్వారా భర్తీ చేస్తారు. ఈ పరిస్థితి తరచూ పునరావృతమైతే బీఓపీ సమస్య తీవ్రమవుతుంది. అంతర్జాతీయ మార్కెట్లో అధిక వడ్డీ రేటుకు తీసుకోవాల్సి వస్తుంది.
భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎగుమతి చేసే వ్యవసాయ వస్తువుల ఆదాయం, ధర వ్యాకోచత్వాలు అతి స్వల్పంగా ఉంటాయి. ఆదాయం పెరగడంతోపాటు ఇలాంటి వస్తువులకు ఎగుమతి డిమాండ్ పెరగదు. ధర తగ్గించి వస్తువులను అమ్మదలిచినప్పుడు ధర తగ్గించిన దానికంటే డిమాండ్ పెరిగిన పరిమాణం తక్కువగా ఉంటుంది. అందువల్ల ఇలాంటి వస్తువుల ఎగుమతి పెరగదు.
ఏకపక్ష బదిలీలు
ఒక దేశం నుంచి మరో దేశానికి ఏకపక్ష బదిలీలుంటాయి. ఉదా: కానుకలు, గ్రాంట్లు, విరాళాలు, నష్టపరిహారాలు, దానాలు, మానవతా చెల్లింపులు, అబివృద్ధి ఎయిడ్ మొదలైనవి. ఇవి విదేశాల నుంచి వస్తే రాబడిగాను, ఇత దేశాలకు ఇస్తే చెల్లింపుగాను చూపుతారు. ఇవి రెండు రకాలు ప్రైవేటు బదిలీలు, ప్రభుత్వ బదిలీలు.
ఎ. ఒక దేశీయులు విదేశాల్లో ఉంటూ తమ దేశానికి పంపించేవి ప్రైవేట్ బదిలీలు. ఉదా: అమెరికాలో ఉంటున్న భారతీయులు తమ కుటుంబీకులకు పంపించే ద్రవ్యం.
బి. ఒక ప్రభుత్వం మరో ప్రభుత్వానికి గ్రాంట్లు, బహుమతులు, నష్టపరిహారాలు ఇవ్వొచ్చు. వీటిని ప్రభుత్వ బదిలీలు అంటారు.
వర్తమాన లావాదేవీలు సాధారణంగా ఒక సంవత్సరానికి లెక్కిస్తారు. కరెంట్ ఖాతాలోని లావాదేవీలు, ఆ దేశ సంపాదనా సామర్థ్యాన్ని తెలియజేస్తాయి. వర్తమాన చెల్లింపుల కంటే వర్తమాన రాబడి ఎక్కువగా ఉంటే, ఆ దేశ సంపాదనా సామర్థ్యం ఎక్కువగా ఉందని గ్రహించాలి. అలా కాకుండా ఆ దేశ వర్తమాన రాబడుల కంటే వర్తమాన చెల్లింపులు ఎక్కువగా ఉంటే ఆ దేశ సంపాదనా సామర్థ్యం తక్కువగా ఉందని గ్రహించాలి. వస్తువులు, సేవలు, ఏకపక్ష బదిలీల ఎగుమతులు, దిగుమతులకు చెందిందే కరెంట్ ఖాతా. ఈ మూడు అంశాల ఎగుమతుల విలువ దిగుమతుల కంటే ఎక్కువైతే కరెంట్ ఖాతాలో మిగులు ఉందని అర్థం.
అవిపత్తు నిర్వహణ చట్రం
విదేశీ వ్యాపార చెల్లింపుల శేషంలో అసమతౌల్యం అనేక రకాలుగా ఉంటుంది. అవి.. తాత్కాలిక, చక్రీయ, దీర్ఘకాలిక, నిర్మాణాత్మక, ప్రాథమిక అసమతౌల్యాలు. స్వల్పకాలిక లేదా తాత్కాలిక కారణాల వల్ల ఎగుమతులు లేదా దిగుమతుల్లో వచ్చే ఆకస్మిక మార్పుల వల్ల తాత్కాలిక అసమతౌల్యం ఏర్పడుతుంది. పంటలు విఫలమవడం, క్షామాలు లేదా రుతుపవన సంబంధమైన మార్పుల వల్ల ఏర్పడవచ్చు. క్రమంగా సంభవించే వ్యాపార చక్రాలు ఆదాయ పెరుగుదలకు లేదా క్షీణతకు దా రితీస్తాయి.
దిగుమతులు పెరగడం లేదా ఎగుమతులు తగ్గడం వల్ల విదేశీ చెల్లింపుల్లో అసమతౌల్యం సంభవించి చక్రీయ అసమతౌల్యం ఏర్పడుతుంది. దీర్ఘకాలంలో లోటు లేదా మిగులు సంభవించినట్లయితే దీర్ఘకాలిక లేదా సెక్యులర్ అసమతౌల్యంగా వ్యవహరిస్తారు. అభవృద్ధి చెందుతున్న దేశాల్లో అభివృద్ధిని సాధించాలనుకున్నప్పుడు 15 – 20 సంవత్సరాల కాలంపాటు ఎగుమతుల కంటే దిగుమతుల పరిమాణం ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు గడిచిన 65 సంవత్సరాల్లో భారతదేశ చెల్లింపుల శేషంలో దీర్ఘకాలిక లోటును అనుభవిస్తున్నది.