ఇండియన్స్ తక్షణమే కీవ్‌ నుంచి బయట పడండి

ఇండియన్స్ తక్షణమే కీవ్‌ నుంచి బయట పడండి

ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ నగరాన్నితక్షణమే వదిలి వెళ్లాలని ఆ నగరంలోని భారత దౌత్య కార్యాలయం మంగళవారం కోరింది. శాటిలైట్  ఇమేజెస్  అనుసరించి 64 కిలోమీటర్ల వరకు రష్యా సైన్యాలు ఉక్రెయిన్‌ వైపు కదులుతున్నట్లు స్పష్టమైంది. దీంతో భారత దౌత్య కార్యాలయం దీనికి సంబంధించి  అత్యవసర ప్రకటన విడుదల చేసింది. అందుబాటులో ఉన్న రవాణా మార్గాల ద్వారా అక్కడి నుంచి బయటపడాలని సూచించింది. కీవ్‌లో ఉన్న భారతీయ పౌరులు, విద్యార్థులు తక్షణమే రాజధాని నగరాన్ని వీడాలని, రైళ్లు, అందుబాటులో ఉన్న ఇతర రవాణా మార్గాల ద్వారా అక్కడి నుంచి బయట పడాలని  ఆ ప్రకటనలో తెలిపింది. ఉక్రెయిన్‌ పశ్చిమ ప్రాంతంవైపునకు వెళ్లేందుకు కీవ్‌లో రైళ్లు సిద్ధంగా ఉన్నాయని సోమవారం ఎంబసి సమాచారం ఇచ్చింది. రైల్వే స్టేషన్ల దగ్గరకు భారీగా జనాలు రావొచ్చని, ఆ సమయంలో భారతీయ పౌరులంతా సంయమనంతో వ్యవహరించాలని సూచించింది. దేశం వీడేందుకు తగిన పత్రాలు, నగదు వెంట ఉంచుకోవాలని చెప్పింది.

'ఆపరేషన్‌ గంగ' పేరుతో ఉక్రెయిన్‌ నుంచి భారతీయులను విమానాల ద్వారా తరలిస్తున్నారు. అయితే ఈ తరలింపులో భారత వాయు సేన కూడా పాలుపంచుకోవాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు చెప్పినట్లు తెలుస్తోంది. వాయు సేన రంగంలోకి దిగితే తక్కువ సమయంలో ఎక్కువ మందిని తీసుకురావడానికి వీలవుతుందని ప్రభుత్వం భావిస్తోందని తెలిపింది. 'ఆపరేషన్‌ గంగ' కోసం ఇవాళ్టి(మంగళవారం) నుంచే సీ-17 విమానాలను వాయు సేన నడిపే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను తీసుకొచ్చేందుకు స్పైస్‌జెట్‌కి చెందిన ఒక ప్రత్యేక విమానం మంగళవారం స్లొవేకియాకు వెళ్లనుంది. ఈ తరలింపు ప్రక్రియను పర్యవేక్షించేందుకు కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు కూడా స్లొవేకియాకు వెళ్లనున్నారు.

మరిన్ని వార్తల కోసం..

నాటి కమెడియన్... నేటి ఉక్రెయిన్ అధ్యక్షుడు