
- సెకండ్, థర్డ్ ప్లేస్ లలో అమిత్ షా, జైశంకర్
- తొమ్మిదో స్థానంలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ
- 28వ స్థానంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
- 14వ ప్లేస్లో చంద్రబాబు, 73వ స్థానంలో పవన్ కల్యాణ్
- 92వ స్థానంలో అల్లు అర్జున్, రోహిత్ శర్మకు 48వ స్థానం
- మాజీ సీఎంలు కేసీఆర్, జగన్కు దక్కని చోటు
- ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఐఈ–100 జాబితా రిలీజ్
హైదరాబాద్: ఇండియన్ ఎక్స్ప్రెస్ మోస్ట్ పవర్ఫుల్ ఇండియన్స్ జాబితా రిలీజైంది. వరుసగా మరోసారి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ టాప్ పొజిషన్లో నిలిచారు. జవహర్ లాల్ నెహ్రూ తర్వాత మూడో సారి కేంద్రంలో పగ్గాలు చేపట్టడం ఆయన పట్ల ప్రజాదరణ తగ్గకుండా చేసిందని నివేది తెలిపింది. రెండో స్థానంలో అమిత్ షా, మూడో స్థానంలో కేంద్రమంత్రి జైశంకర్, నాలుగో స్థానంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ నిలవగా లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ 9వ స్థానంలో నిలిచారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఎంఐఎం అధ్యక్షుడు అసద్దుదీన్ ఒవైసీ, ఐకానిక్ స్టార్ అల్లుఅర్జున్ కు జాబితాలో చోటు దక్కింది.
28వ స్థానంలో సీఎం రేవంత్ రెడ్డి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐఈ 100 లో 28 వస్థానంలో నిలిచారు. గతంలో ఆయన స్థానం 38గా ఉండేది. పది ర్యాంకులు మెరుగు పడటం విశేషం. 2021లో టీపీసీసీ చీఫ్‌గా నియమితులైన తర్వాత పార్టీలో అసంతృప్తిని ఎదుర్కోవడంతోపాటు వర్గపోరుతో కూడిన కాంగ్రెస్ పార్టీని 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని విజయంవైపు నడిపించారని ఈ నివేదిక పేర్కొన్నది. కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్‌ను ఓడించి ఆ పార్టీకి షాకిచ్చారు. కాంగ్రెస్ పార్టీలో రేవంత్‌రెడ్డి బయటివ్యక్తి అని కనిపించినప్పటికీ ఆ విమర్శలన్నింటినీ దాటుకుని పార్టీని విజయతీరంవైపు నడిపినట్లు ఈ రిపోర్టు తెలిపింది. ఆరు గ్యారెంటీల హామీ అమలు ఆయన ముందున్న ప్రధానమైన సవాలు అని పేర్కొంది ఐఈ–100 నివేదిక. యాక్టివ్ అవుతున్న బీజేపీని ఎదుర్కోవడం ఆయనకు సవాలు అని తెలిపింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తన పార్టీని గెలిపించుకోవాల్సి ఉందని సూచించింది.
14వ ప్లేస్ చంద్రబాబు, పవన్ కు 73ర్యాంకు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు కు జాబితాలో 14వ స్థానం దక్కింది. వైసీపీని ఓడించేందుకు కూటమి అవసరమని గ్రహించిన చంద్రబాబు, 2024 ఎన్నికల్లో బీజేపీ, జనసేనతో పొత్తుపెట్టుకొని విజయం సాధించారని తెలిపింది. గత ఏడాది జాబితాలో కనిపించని చంద్రబాబు ఈ సారి ఏకంగా 14వ ప్లేస్‌లో నిలవడం విశేషం. మళ్లీ జాతీయ రాజకీయాల్లో కీలక మిత్రపక్షంగా నిలిచారు. స్వర్ణాంధ్ర@2047ను అమలు చేయడం, సూపర్ 6 హామీలను అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఈ నివేదిక పేర్కొన్నది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గతేడాది ఈ జాబితా చోటు లేకపోయినా ఈసారి 73వ స్థానంలో నిలిచారు.
కేసీఆర్, జగన్కు దక్కని చోటు..
జాబితాలో తెలంగాణ, ఏపీ తాజా మాజీ సీఎంలు కేసీఆర్, జగన్‌కు చోటు దక్కలేదు. బీహార్‌లో అధికారంలో లేకపోయినా ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ 86, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్‌కు 87వ స్థానాలు దక్కాయి. ఇటీవల ఢిల్లీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన రేఖా గుప్తా ఈ జాబితాలో 65వ స్థానం సాధించడం విశేసం
బన్నీకి 92, రోహిత్ శర్మకు 48
పుష్ప–2 సినిమాతో ప్రపంచ స్థాయిలో సత్తా చాటిన అల్లు అర్జున్ కు ఈ జాబితాలో 92వ స్థానం దక్కడం విశేషం. బన్నీ మినహా మిగతా టాలీవుడ్ నటులెవరికీ స్థానం దక్కలేదు. క్రికెటర్లలో రోహిత్ శర్మ 48, విరాట్ కోహ్లీకి 72, బుమ్రా 83 స్థానం దక్కించుకున్నారు. అలియా బట్ 100 ర్యాంక్‌లో ఈ జాబితాలో ఆఖరిలో నిలిచారు. వీరితోపాటు 10, 11వ స్థానాల్లో ముకేశ్ అంబానీ, గౌతం అదానీలు నిలిచారు. చెస్ విశ్వనాథ్, సుప్రీంకోర్టు చీఫ్ జస్టీస్ సంజీవ్ ఖన్నాతో పాటు తదితరులు జాబితాలో చోటు దక్కించుకున్నారు.