నేపాల్ లో జరిగిన ‘తారా ఎయిర్’ విమాన ప్రమాదంలో మృతిచెందిన భారతీయ దంపతులకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు ఆలస్యంగా వెలుగుచూశాయి. మృతిచెందిన భారతీయ దంపతులు అశోక్ కుమార్ త్రిపాఠి (53), వైభవి బందేకర్ (51) ఇప్పటికే విడాకులు తీసుకున్నారని.. కోర్టు ఆదేశం మేరకు తమ ఇద్దరు పిల్లలతో కలిసి ఫ్యామిలీ ట్రిప్ పై నేపాల్ కు వచ్చారని వెల్లడైంది. తారా ఎయిర్ విమానంలో వాళ్లు ముక్తినాథ్ ఆలయ దర్శనానికి బయలుదేరారు. పొఖారాలో వాళ్లు ఎక్కిన విమానం జోమ్ సోమ్ పట్టణంలో సురక్షితంగా ల్యాండ్ అయి ఉంటే.. అశోక్ కుమార్ త్రిపాఠి, వైభవి బందేకర్ లు తమ పిల్లలతో అక్కడ దిగి ఉండేవారు. ముందే బుక్ చేసుకున్న ప్రత్యేక జీపులో జోమ్ సోమ్ నుంచి అరగంట పాటు ప్రయాణించి రానీప్యూవా పట్టణంలోని ముక్తినాథ్ ఆలయానికి చేరుకొని దైవ దర్శనం చేసుకునేవారు. ‘‘ వైభవి బందేకర్, అశోక్ కుమార్ త్రిపాఠికి ఇప్పటికే విడాకులయ్యాయి. అయినా ఇద్దరు పిల్లలు ప్రతి సంవత్సరం 10 రోజుల పాటు తప్పకుండా తండ్రితో గడపాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈక్రమంలోనే వారు నేపాల్ లోని ముక్తినాథ్ టూర్ కు కలిసి వెళ్లారు’’ అని మహారాష్ట్రలోని థానే పరిధిలో ఉండే కపూర్ బావ్డీ పోలీసు స్టేషన్ సీనియర్ ఇన్ స్పెక్టర్ ఉత్తమ్ సోనావానే తెలిపారు. విడాకులు తీసుకున్న తర్వాత అశోక్ కుమార్ త్రిపాఠి తన స్వరాష్ట్రం ఒడిశాకు వెళ్లిపోగా, వైభవి బందేకర్ ముంబైలోని ఓ కంపెనీలో జాబ్ చేస్తూ అనారోగ్యంతో ఉన్న తన తల్లికి సపర్యలు చేస్తోంది. వైభవి చనిపోయిందనే విషయాన్ని తమ తల్లికి చెప్పొద్దని, ఆ చేదు వార్తను తట్టుకునే పరిస్థితిలో అమ్మ లేదని ఆమె సోదరి పేర్కొంది.
మరిన్ని వార్తలు..