భారత క్రికెట్ అభిమానులు తన భార్యను ఉద్దేశించి కించపరిచే వ్యాఖ్యలు చేశారని దక్షణాఫ్రికా బౌలర్ తబ్రైజ్ షమ్సీ సంచలన ఆరోపణలు చేశాడు. అంతేకాకుండా తన కుటుంబసభ్యులను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా బెదిరింపులకు దిగినట్లు అతను వెల్లడించాడు. డిసెంబరు 12న సెయింట్ జార్జ్ పార్క్ వేదికగా ఇండియా- దక్షిణాఫ్రికా మధ్య జరిగిన రెండో టీ20 సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలిపాడు.
ఏంటి ఈ గొడవ..?
ఏదేని బౌలర్.. ప్రత్యర్థి బ్యాటర్ ని ఔట్ చేసినప్పుడు సంబరాలు చేసుకోవడం కామన్. సెయింట్ జార్జ్ పార్క్ వేదికగా ఇండియా- దక్షిణాఫ్రికా మధ్య జరిగిన రెండో టీ20లో సూర్యకుమార్ యాదవ్ ను ఔట్ చేసిన సమయంలో షమ్సీ అలానే సంబరాలు చేసుకున్నాడు. కాకపోతే అతని శైలికి తగ్గట్టుగా కాస్త వినూత్నంగా సెలెబ్రేషన్స్ చేసుకున్నాడు. అది నచ్చని భారత క్రికెట్ అభిమానులు అతని భార్యను దుర్భాషలాడారు. ఏమన్నారు..? ఎలాంటి వ్యాఖ్యలు చేశారనేది బయటకు చెప్పని షమ్సీ, ఈ ఘటన వల్ల తన కుటుంబసభ్యులందరూ మనోవేదనకు గురైనట్లు తెలిపాడు.
భారత అభిమానుల నుంచి ఇలాంటి ప్రవర్తన తాము ఊహించలేదన్న తబ్రైజ్ షమ్సీ, ఇలాంటి సంఘటనలు ఆటగాళ్లను మాత్రమే కాకుండా వారి కుటుంబాలను కూడా ప్రభావితం చేస్తాయని అభిమానులు .గ్రహించాలని బాధపడుతూ చెప్పుకొచ్చాడు.
"నన్ను దుర్భాషలాడారు. ఇది బహుశా ఎప్పుడూ లేనంత చెత్తగా ఉంది. నా భార్య పట్ల కూడా అసభ్యంగా ప్రవర్తించారు. మీరు ప్లేయర్లను నిందించాలనుకుంటే ఫర్వాలేదు, కానీ వారి కుటుంబ సభ్యులను ఇన్వాల్వ్ చేసి అసహ్యకరమైన రీతిలో మాట్లాడితే అది మరో స్థాయికి చేరుకుంటుంది. మీ జట్టు గెలవకపోవచ్చు లేదా మీరు కొన్ని విషయాలతో ఏకీభవించకపోవచ్చు. కానీ మీరు మనిషిలా ప్రవర్తించాలి. జంతువులా కాదు.." అని షమ్సీ ఓ స్పోర్ట్స్ ఛానెల్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చ్చాడు.