- ట్రాక్టర్లు అమ్మకమే ఎక్కువ
- ట్రాక్టర్ల మాదిరి ఫార్మ్ ఎక్విప్‌మెంట్ పెంచాలి
- అప్పుడే పంట దిగుబడి పెంచొచ్చు.. ఎక్స్‌పర్ట్స్
బిజినెస్ డెస్క్, వెలుగు : ఇండియన్ అగ్రికల్చర్ మెకానిజం మొత్తం ట్రాక్టర్ చుట్టూనే తిరుగుతుంది. పంట వేసిన దగ్గర్నుంచి.. అమ్మే దాకా వ్యవసాయంలో వాడే ప్రధాన వస్తువుగా ట్రాక్టర్ ఉంటోంది. ట్రాక్టర్ సేల్స్ కూడా నానాటికీ బాగా పెరుగుతున్నాయి. కానీ ట్రాక్టర్లు అమ్ముడుపోయినట్టు ఇతర ఫార్మ్ ఎక్విప్‌మెంట్ అమ్ముడుపోవడం లేదు. రైతులు కూడా వాటిని కొనేందుకు ఆసక్తి చూపడం లేదు. ఇండియన్ అగ్రికల్చర్ సెక్టార్ ఇంకా పూర్తి స్థాయిలో మెషినరీ వాడటం లేదని అగ్రికల్చర్ ఇండస్ట్రీ నిపుణులు, కంపెనీలు అంటున్నాయి. మెషినరీ వాడకానికి రైతులు దూరంగా ఉంటున్నారని నిపుణులు చెబుతున్నారు.
2018లో 7,96,000 ట్రాక్టర్లు అమ్ముడుపోతే.. ఇవి ఈ ఏడాది మరింత పెరిగాయి. కరోనా ఉన్నప్పటికీ.. 2020 జనవరి నుంచి అక్టోబర్ వరకు ట్రాక్టర్ సేల్స్ గతేడాదితో పోలిస్తే 5 శాతం పెరిగినట్టు వెల్లడైంది. కంపెనీలు ఆఫర్ చేస్తోన్న మంచి ధరలు, ఫైనాన్సింగ్ ఆప్షన్లు, దానికి తోడు రుతుపవనాలు బాగుండటం, పంట దిగుబడి బాగా రావడం ట్రాక్టర్ సేల్స్‌కు కలిసి వచ్చింది. మహీంద్రా అండ్ మహీంద్రా(ఎం అండ్ ఎం), ఎస్కార్ట్స్ లాంటి కంపెనీలకు సప్లయికి మించి డిమాండ్ వస్తుండటంతో… 2021 ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల కాలంలో హయ్యస్ట్ ఎవర్ ప్రాఫిట్ మార్జిన్స్ వచ్చాయి. ఇండియాలో ట్రాక్టర్ మార్కెట్ సైజు సుమారు రూ.39 వేల కోట్లుగా ఉంది. అంటే మొత్తం గ్లోబల్ ఇండస్ట్రీలో10 శాతం మనదే ఉంది. దీనికి భిన్నంగా ట్రాక్టర్ మినహాయించి మిగిలిన ఫార్మ్ మెషినరీ ఇండస్ట్రీ కేవలం రూ.7 వేల కోట్లుగానే ఉంది. గ్లోబల్ ఇండస్ట్రీలో ఇది కేవలం 1 శాతం మాత్రమే. ఇండియన్ అగ్రికల్చర్ సెక్టార్ మొత్తం ‘ట్రాక్టరైజ్డ్’తోనే నిండి ఉందని, మెకనైజ్డ్ కాలేదని ఎం అండ్ ఎం ఫార్మ్ డివిజన్ సీఈవో శుభబ్రతా సాహా చెప్పారు. వ్యవసాయంలో మెషిన్లు వాడకానికి రైతులు చాలా దూరంగా ఉంటున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు. పంట వేసే సమయంలోనే నాగలి, కల్టివేటర్, ఫ్లవ్ వంటి బేసిక్ యంత్రాలను రైతులు వాడుతున్నారన్నారు. వీటి ఖర్చు కూడా సుమారు రూ.20 వేల నుంచి రూ.50 వేల మధ్యలోనే ఉంటుంది. పంట వేసిన తర్వాత, దానిని పెంచడం, కలుపుతీయడం, రసాయనాలు వేయడం వంటి అన్ని పనులను లేబర్ చేత చేయిస్తున్నారు. వరి నాటు వేసే యంత్రాల వాడకం తక్కువగానే ఉంది. ఇండియాలో వరి నాటు వేసే యంత్రాలు కేవలం 2 వేలే అమ్ముడుపోతే.. చైనాలో వీటి సేల్స్ లక్షకు పైగా ఉన్నాయి. ఇక డ్రోన్ వంటి కొత్త టెక్నాలజీల వాడకం మాత్రం అంతంతమాత్రమే. వరి నాటు వేయడం, పత్తి, ఆయిల్ సీడ్స్, చిరుధాన్యాలు వంటి పంటల్లో మెషిన్ల వాడకం చాలా తక్కువగా ఉంది. మొత్తం ఇండియాలో పండించే పంటల్లో 70 శాతానికి పైగా ఈ పంటలే ఉన్నాయి.
చిన్న రైతులే ఎక్కువ…
వ్యవసాయంలో మెషిన్ల అంత వాడకపోవడానికి కారణం చిన్న రైతులే మన దేశంలో ఎక్కువగా ఉండటమని అగ్రికల్చర్ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. రెండు ఎకరాలు లేదా అంతకంటే తక్కువ భూమి ఉన్న రైతులే ఇండియాలో 86.2 శాతం మంది వరకు ఉన్నారు. వీరికి వ్యవసాయంలో మెషిన్లు వాడటం చాలా కష్టం. ల్యాండ్ సైజు చాలా తక్కువ, దానికి తోడు మెషిన్లు తెచ్చి పండించడం తలకు మించిన భారమవుతుందని రైతులు భావిస్తారని ఎం అండ్ ఎం సాహా చెప్పారు. దీని వల్ల టెక్నాలజీ, మెషినరీకి ఇండియన్ రైతులు దూరంగా ఉంటున్నారని పేర్కొన్నారు. దీంతో పంట దిగుబడి తగ్గుతోందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఒకవేళ పంట పండించే భూములు తగ్గిపోతే.. అగ్రికల్చర్ మెషినరీ వాడకం కూడా తగ్గిపోతుందని, ఇది అన్‌ఎకనమికల్‌గా మారుతుందని పేర్కొన్నారు. ఒక్కో పంట సైకిల్‌లో, రైతులకు కనీసం 10 రకాల ఎక్విప్‌మెంట్ అవసరం పడతాయి.
అగ్రికల్చర్ రీసెర్చ్‌పై ఖర్చులు పెంచాలి..
ఇండియన్ కండిషన్లకు అనుగుణంగా ఫార్మ్ మెషినరీని ప్రభుత్వం తీసుకురావాల్సి ఉంది. ఇందుకోసం అగ్రికల్చర్ రీసెర్చ్‌పై ఖర్చులు పెంచాలని నిపుణులు సూచిస్తున్నారు. 2012 నుంచి అగ్రికల్చర్ రీసెర్చ్ ఊసే వినిపించడం లేదు. అగ్రికల్చర్ జీడీపీలో 0.2 శాతం నుంచి 0.3 శాతమే రీసెర్చ్‌పై ఖర్చు పెడుతున్నారు. ఇతర దేశాలతో పోలిస్తే అగ్రికల్చర్ రీసెర్చ్ ఇండియాలో చాలా తక్కువ. ఇండియాతో పోలిస్తే పదింతలు ఎక్కువ సౌత్ ఆఫ్రికా అగ్రికల్చర్ రీసెర్చ్‌పై ఖర్చు పెడుతోందని సాహా తెలిపారు. ఇండియన్ మార్కెట్ కోసం సరియైన ప్రొడక్ట్‌లు తేవాలంటే ఫార్మ్ మెషినరీ మాన్యుఫాక్చర్లు కూడా ఆర్ అండ్ డీపై ఎక్కువగా ఖర్చు చేయాలని ఈఎం3 అగ్రి సర్వీసెస్ ప్రాజెక్ట్స్ అండ్ మెకానిజం నేషనల్ హెడ్ ఎస్‌పీ పాండే తెలిపారు.
ట్రాక్టర్లు ఫైనాన్స్‌తో కొనుక్కోవచ్చు…
ఇండియాలో 90 శాతం వరకు ట్రాక్టర్లు ఫైనాన్స్ మీద అమ్ముడుపోతున్నాయి. ప్రొడక్ట్ వాల్యూలో 70 శాతం నుంచి 90 శాతం వరకు ఫైనాన్స్ ఇస్తున్నారు. కానీ ఎక్విప్‌మెంట్ విషయాల్లో అలా జరగడం లేదు. ఒకవేళ ఎక్విప్‌మెంట్‌కు కూడా ఫైనాన్సింగ్ ఇస్తే సేల్స్, వాడకం పెరుగుతాయని ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. రైతులు కొనే ట్రాక్టర్లను ఇటు వ్యవసాయానికి, అటు శాండ్ మైనింగ్ యాక్టివిటీలకు వాడొచ్చు. లేదంటే ఇతర వ్యవసాయ పనులకు రెంట్‌కు అయినా ఇవ్వొచ్చు. దీంతో ట్రాక్టర్లను రైతులు సేఫ్ అసెట్‌గా భావిస్తున్నారు. కానీ దీనికి భిన్నంగా ఫార్మ్ ఎక్విప్‌మెంట్ ఉంటున్నాయి.