
సినిమా అనేది కాలక్షేపం కాదు.. మన సంస్కృతిలో, మన జీవన విధానంలో ఒక భాగం. ఏ ఇద్దరు ఒక్కచోట చేరినా, నలుగురు కుటుంబసభ్యులు సంతోషంగా మాట్లాడుకోవాలన్నా అవి ఒక్క సినిమా విశేషాలే. పలనా సినిమా బాగుందని, పాటలు బాగున్నాయని, పలనా హీరో బాగా నటించాడని ఏదో ఒక అంశం చర్చకు వస్తూనే ఉంటుంది. మరి ఇంకేంటి అంటారా! ఇక్కడ తెలుసుకోవాల్సిన మరో విషయం కూడా ఉంది. అదే ఏ సినిమా ఎవరు చూడాలని..? అదేంటి సినిమా అంటే అందరూ చూడచ్చు కదా అనుకోకండి..! కొన్నిటికి పిల్లలు దూరంగా ఉండాలి.. మరికొన్నిటికి పెద్దలు దూరంగా ఉండాలి. అదెలా తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
భారతదేశంలోని ఏ సినిమా అయినా ప్రదర్శించడానికి ముందు CBFC నుండి సర్టిఫికేట్ పొందాలి. లేనిచో ప్రదర్శించకూడదు. భారత ప్రభుత్వ సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్(CBFC) ఇష్యూ చేస్తుంది. ముందుగా సదరు సినిమాకు సంబంధించిన వ్యక్తులు సర్టిఫికేట్ కోసం సీబీఎఫ్‌సీ ప్రాంతీయ కార్యాలయాల్లో దరఖాస్తు చేస్తే.. వారు ఆ సినిమాను వీక్షించి.. అందుకు తగిన సర్టిఫికెట్ ఇస్తారు. ఆ సమయంలో కొన్ని సన్నివేశాలను తొలగించడం లేదా సవరించమని కమిటీ సూచించవచ్చు. ఉదాహరణకు అందులో అనుచితంగా ఏమైనా ఉన్నాయా..? పిల్లలు చూడగలరా లేదా అని వారు తనిఖీ చేస్తారనమాట. వాటికి అంగీకరించి మార్పులు జరిగాక.. రివైజింగ్ కమిటీ మార్పులను ఆమోదించిన తర్వాత, సినిమా ప్రదర్శిస్తారు.
U, U/A, A, S సర్టిఫికెట్ల మధ్య తేడా..
'U' సర్టిఫికేట్: అనియంత్రిత పబ్లిక్ ఎగ్జిబిషన్ అంటే ఎవరైనా దీన్ని చూడవచ్చు. సినిమా కథ, సన్నివేశాలు కుటుంబ సభ్యులకు అనుకూలంగా ఉంటాయని అర్థం. హింస లేదా నగ్నత్వ సన్నివేశాలు ఉండవనమాట.
'U/A' సర్టిఫికేట్: ఎవరైనా దీన్ని చూడవచ్చు.. కాకపోతే 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు ఈ చిత్రాన్ని వారి తల్లిదండ్రులతో కలిసొ లేదా పెద్దల తోడుతో చూడాలని సూచిస్తారు. ఈ సర్టిఫికేట్ పొందిన సినిమాల్లో హింసాత్మక యాక్షన్ సన్నివేశాలు, కొంతవరకు నగ్నత్వం ఉంటుంది.
'A' సర్టిఫికేట్: ఈ సర్టిఫికేట్ పొందిన సినిమాలను 18 సంవత్సరాలు పైబడిన పెద్దలు మాత్రమే చూడాలి. ఈ సినిమాల్లో ఎక్కువ హింసాత్మక దృశ్యాలు, పూర్తి నగ్నత్వం, దూషించే భాష అన్నీ ఉంటాయి.
'S' సర్టిఫికేట్: ఈ సినిమాలు వైద్యులు లేదా శాస్త్రవేత్తల వంటి వారి కోసం తీస్తారు.
ఉదాహరణకు U, U/A, A సర్టిఫికేట్ వచ్చిన సినిమాలు:
- దంగల్: 'U',
- రాగిణి MMS 2: 'A',
- వార్: 'U/A'