రష్యా ఆయిల్‌‌ కొనుగోలుకు టెండర్లు!

రష్యా ఆయిల్‌‌ కొనుగోలుకు టెండర్లు!
  • 25 డాలర్ల తక్కువకే  బ్యారెల్‌‌‌‌
  • ఇప్పటికే టెండర్లు వేసిన ఐఓసీ, హెచ్‌‌‌‌పీసీఎల్‌‌‌‌
  • అదే బాటలో ఎంఆర్‌‌‌‌‌‌‌‌పీఎల్‌‌‌‌..
  • రిలయన్స్ మాత్రం దూరం

న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌‌‌‌పై దాడి చేసినందుకు రష్యాపై ఆంక్షలు కొనసాగుతున్నప్పటికీ,   ఆ దేశం నుంచి క్రూడ్‌‌‌‌ ఆయిల్‌‌‌‌ను మాత్రం అగ్గువకే కొనేస్తున్నాం.  తక్కువ రేటుకే దొరుకుతుండడంతో రష్యా ఆయిల్‌ను దేశంలోని ప్రభుత్వ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు భారీగా కొనుగోలు చేస్తున్నాయి. రష్యాపై ఆంక్షలు కొనసాగుతుండడంతో  రష్యా క్రూడాయిల్ ఉరల్స్‌‌‌‌ రేటు మార్కెట్‌‌‌‌లో తక్కువగా ఉంది. ప్రస్తుతం మార్కెట్‌‌‌‌లోని బ్యారెల్ బ్రెంట్‌‌‌‌ క్రూడాయిల్ రేటు కంటే ఉరల్స్ రేటు 20–25 డాలర్లుగా తక్కువగా ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. దేశంలోని ఆయిల్ కంపెనీలు గత ఏడాది నవంబర్‌‌‌‌‌‌‌‌ నుంచి పెట్రోల్‌‌‌‌,డీజిల్ రేట్లను మార్చలేదు. పెరుగుతున్న క్రూడాయిల్ రేట్ల భారాన్ని తగ్గించుకోవాలంటే తక్కువ రేటుకే దొరుకుతున్న రష్యా ఆయిల్‌‌‌‌ను కొనుక్కోవడం మంచిదని కంపెనీలు భావిస్తున్నాయి. దేశంలోని అతిపెద్ద ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌‌‌‌ (ఐఓసీ)  20 లక్షల బ్యారెళ్ల ఉరల్స్ కోసం  ఆర్డర్లు పెట్టుకుందని ఈ విషయం తెలిసిన వ్యక్తులు చెప్పారు. హెచ్‌‌‌‌పీసీఎల్‌‌‌‌ కూడా మే నెల అవసరాల కోసం 10 లక్షల బ్యారెళ్ల రష్యా ఆయిల్ కోసం టెండర్లు వేసిందని అన్నారు. ఈ రెండు కంపెనీలు డైరెక్ట్‌‌‌‌గా రష్యన్ గవర్నమెంట్‌‌‌‌ నుంచి ఆయిల్ కొనకుండా, ఉరల్స్‌‌‌‌ను అమ్మే  కంపెనీ విటల్‌‌‌‌  నుంచి కొనుగోలు చేయడానికి టెండర్లు పెట్టుకున్నాయి. ఓఎన్‌‌‌‌జీసీ సబ్సిడరీ కంపెనీ మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్‌‌‌‌ (ఎంఆర్‌‌‌‌‌‌‌‌పీఎల్‌‌‌‌) కూడా 10 లక్షల  బ్యారెళ్ల ఆయిల్‌‌‌‌ను కొనేందుకు టెండర్లు వేయనుందని వార్తలొస్తున్నాయి.  రష్యా ఆయిల్ రేటు తక్కువగా ఉన్నప్పుడే కొనుక్కోవాలని కంపెనీలు ఆత్రుత పడుతున్నాయి.  మరోవైపు రష్యన్ ఆయిల్‌‌‌‌ కొనేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్‌‌‌‌ ఆసక్తి చూపించడం లేదు. ఈ కంపెనీకి యూఎస్‌‌‌‌లో బిజినెస్‌‌‌‌లు ఎక్కువగా ఉన్నాయి. దీంతో  రష్యన్ ఆయిల్ కొంటే తమపై నెగెటివ్ ప్రభావం ఉంటుందని కంపెనీ భావిస్తోంది. 

పేమెంట్స్ చేయడంలో సమస్య..

రష్యాపై వెస్ట్రన్ దేశాల ఆంక్షలు కొనసాగుతున్న విషయం తెలిసిందే.  ఈ దేశం నుంచి కమోడిటీలను కొనుక్కోవడంపై మాత్రం ఎటువంటి ఆంక్షలు పెట్టలేదు. అంటే ఈ దేశం నుంచి  క్రూడాయిల్‌‌‌‌ను, ఇతర కమోడిటీలను ఏ దేశమైన కొనుక్కోవచ్చు. అయినప్పటికీ వెస్ట్రన్‌‌‌‌ దేశాల ఆంక్షలు ముదిరితే నష్టపోతామని  రష్యన్ ఆయిల్‌‌‌‌ను కొనే ట్రేడర్లు భావిస్తున్నారు. ఇంకా యూఎస్‌‌‌‌, జపాన్ వంటి దేశాల్లోనే మెజార్టీ ట్రేడర్లు ఉరల్స్‌‌‌‌ను కొనమని కూడా ప్రకటించారు. దీంతో రష్యన్ ఆయిల్ మార్కెట్‌‌‌‌లో చాలా తక్కువ రేటుకి ట్రేడవుతోంది. ఈ అవకాశాన్ని మన కంపెనీలు వాడుకోవాలని చూస్తున్నాయి. కానీ, ఈ ఆయిల్‌‌‌‌ను అమ్మే కంపెనీలకు  పేమెంట్స్ చేయడంలో ఇబ్బందులు ఉన్నాయి. వెస్ట్రన్ దేశాలు విధించిన ఆంక్షల ప్రకారం, రష్యాకు చెందిన కంపెనీకి స్విఫ్ట్‌‌‌‌ కింద పేమెంట్స్‌‌‌‌ చేయడానికి వీలులేదు. కానీ, రష్యన్ ఆయిల్‌‌‌‌ను అమ్మే వేరే దేశపు కంపెనీకి స్విఫ్ట్‌‌‌‌ కింద పేమెంట్స్ చేయొచ్చు. కాగా, తక్కువ రేటుకే ఆయిల్ అమ్మడానికి రష్యా ముందుకొచ్చిందని, ఈ ఆఫర్‌‌‌‌‌‌‌‌ను ప్రభుత్వం పరిశీలిస్తోందని ఆయిల్ మినిస్టర్‌‌‌‌‌‌‌‌ హరదీప్‌‌‌‌ సింగ్ పురి గతంలో అన్నారు. 

రష్యాకు సపోర్ట్ చేసినట్టే: యూఎస్‌‌‌‌

కిందటేడాది రష్యా నుంచి రోజుకి సగటును 45 వేల బ్యారెళ్లను మాత్రమే మనం దిగుమతి చేసుకున్నాం. రష్యా నుంచి ఆయిల్‌‌‌‌ను తెచ్చుకోవడంలో రవాణా ఖర్చులు, ఇన్సూరెన్స్ ఖర్చులు ఎక్కువగా ఉండడంతోనే ఈ దేశ ఆయిల్‌‌‌‌ను కొనేందుకు మన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. కానీ, ప్రస్తుతం పరిస్థితులు మారాయి. రష్యా క్రూడాయిల్ రేటు మార్కెట్‌‌‌‌లో 20–25 డాలర్లు తక్కువకే దొరుకుతుండడంతో ఈ ఆయిల్‌‌‌‌ను కొనేందుకు ఎగబడుతున్నాయి. రష్యా ఆయిల్‌ను ఇండియా కొనడంపై యూఎస్ వైట్‌‌‌‌హౌస్ స్పందించింది. ‘రష్యా ఆయిల్ కొనకూడదనే ఆంక్షలేవి లేవు. కానీ,  ఉరల్స్ కొంటే ఉక్రెయిన్‌‌‌‌పై దాడిలో రష్యాకు సపోర్ట్  చేసినట్టే’ అని వైట్‌‌‌‌హౌస్‌‌‌‌ ప్రెస్ సెక్రెటరీ జెన్‌‌‌‌ సకి పేర్కొన్నారు. చరిత్ర పుస్తకాల్లో ఎవరివైపు ఉంటారో ఆలోచించుకోవాలని హితవు చెప్పారు. తాము విధించిన ఆంక్షలను పాటించాలని కోరారు.