Champions Trophy 2025: వెనక్కి తగ్గిన పాక్.. కరాచీ స్టేడియంలో భారత జెండా

Champions Trophy 2025: వెనక్కి తగ్గిన పాక్.. కరాచీ స్టేడియంలో భారత జెండా

ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం నుంచి ఏ విషయంలోనూ భారత్ పై పాకిస్థాన్ గెలవలేకపోతుంది. మొదట పాకిస్థాన్ కు రావాల్సిందేనని మొండి పట్టు పట్టిన ఆ దేశ క్రికెట్ బోర్డుకు బీసీసీఐ ఖరాఖండిగా రానని చెప్పింది. దీంతో హైబ్రిడ్ మోడల్లో ఈ మెగా టోర్నీని నిర్వహించాల్సి వచ్చింది. ఇక ఛాంపియన్స్ ట్రోఫీ కెప్టెన్సీ ప్రారంభ వేడుకలకు టీమిండియా కెప్టెన్ ను రోహిత్ శర్మను పంపించాడానికి నిరాకరించింది. తాజాగా పాకిస్థాన్ లో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి  ముందు భారత జెండాను ఎగరవేయకుండా విమర్శలను మూటగట్టుకుంది. ఈ సంఘటన జరిగి రెండు రోజులు కాకముందే పాకిస్థాన్ వెనక్కి తగ్గింది. 

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య బుధవారం (ఫిబ్రవరి 19)ప్రారంభమైన తొలి మ్యాచ్ కు ముందు     కరాచి నేషనల్  స్టేడియంలో భారత పతాకాన్ని ఆవిష్కరించింది. దాయాది గడ్డపై త్రివర్ణ పతాకం సగర్వంగా రెపరెపలాడింది. ఏదైనా ఐసీసీ టోర్నీ సందర్భంగా నిబంధనల ప్రకారం పోటీపడే దేశాల జాతీయ జెండాలను మ్యాచ్ లు జరిగే వేదికల్లో కచ్చితంగా ప్రదర్శించాలి. కానీ భారత పతాకానికి మొదట చోటివ్వని పాకిస్థాన్ వక్రబుద్ధిని ప్రదర్శించింది. ఛాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు తమ దేశానికి రావడానికి భారత జట్టు నిరాకరించడంతో ప్రతీకార చర్యగా పాక్ ఇలా చేసిందేనే విమర్శలు వచ్చాయి.

Also Read : చరిత్ర సృష్టించిన అమెరికన్లు.. 40 ఏళ్ల నాటి టీమిండియా రికార్డు బద్దలు

మొదట గడాఫీ స్టేడియంలో, ఆ తర్వాత కరాచి స్టేడియంలోనూ భారత జెండాను ఏర్పాటు చేయలేదు. ఈ వివాదం తీవ్ర చర్చనీయాంశం అవడంతో పీసీబీ దిగొచ్చింది. తాజాగా కరాచి స్టేడియంలో భారత పతాకాన్ని ఆవిష్కరించింది. పోటీపడే అన్ని దేశాల జెండాలతో పాటు మన త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోంది. ఈ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్న భారత అభిమానులు.. పాకిస్థాన్ కు బుద్ధి వచ్చిందనే కామెంట్లు చేస్తున్నారు.