
అడవుల వల్ల ప్రత్యక్ష, పరోక్ష ప్రయోజనాలు ఉంటాయి. ప్రత్యక్షంగా జాతీయ ఉత్పత్తికి, ఉపాధికి దోహదపడుతాయి. పశు సంపదకు దానాను అందిస్తాయి. పరిశ్రమలకు, ఇంటి అవసరాలకు కలపను అందిస్తాయి. కొన్ని పరిశ్రమలకు ముడి పదార్థాలను సరఫరా చేస్తాయి. అడవులు మైనర్ ఉత్పత్తులను కూడా అందిస్తాయి. కొన్ని అటవీ ఉత్పత్తులకు విదేశీ మార్కెట్లో కూడా డిమాండ్ కలిగి ఉన్నాయి. అడవులు పరోక్ష ప్రయోజనాన్ని ఇస్తాయి. వాతావరణాన్ని సమతౌల్యంగా ఉంచడానికి దోహదపడతాయి. వర్షపాతానికి దోహపడతాయి. భూగర్భ జలాలను పెంచడానికి ఉపయోగపడుతాయి. నేల కోతను తగ్గిస్తాయి. వరదల తీవ్రతను తగ్గిస్తాయి. అడవుల ద్వారా ప్రవహించే నీటి వల్ల భూసారం పెరుగుతుంది.
అడవుల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి కాబట్టే అడవులపై చేసే పెట్టుబడిని గ్రీన్ క్యాపిటల్ అంటారు. దేశ భౌగోళిక విస్తీర్ణంలో అడవులు 7.15 లక్షల చదరపు కి.మీ. ఇది దేశ భౌగోళిక విస్తీర్ణంలో 21.76 శాతం. దీనికి చెట్లతో కూడుకున్న ప్రాంతాన్ని కూడా కలిపితే 8,27,357 చ.కి.మీ.లు. ఇది దేశ భౌగోళిక విస్తీర్ణంలో 25.17 శాతం.
ఐఎస్ఎఫ్ఆర్ 2023 ప్రకారం దేశంలో అడవులు, చెట్ల విస్తీర్ణంలో గరిష్ట పెరుగుదల నమోదైన మొదటి నాలుగు రాష్ట్రాలు
- ఛత్తీస్‌గఢ్( 684 చదరపు కిలోమీటర్లు),
- ఉత్తరప్రదేశ్(559 చ.కి.మీ.),
- ఒడిశా (559 చ.కి.మీ.),
- రాజస్తాన్(394 చ.కి.మీ.),
అటవీ విస్తీర్ణం అత్యధికంగా పెరిగి తొలి మూడు రాష్ట్రాలు
- మిజోరం (242 చ.కి.మీ.),
- గుజరాత్ (180 చ.కి.మీ.)
- ఒడిశా (152 చ.కి.మీ.).
2023 అటవీ గణాంకాల్లో 19 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అడవుల శాతం 33 శాతం కంటే ఎక్కువగా ఉన్నాయి. వీటిలో మిజోరం, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవులు, అరుణాచల్‌ప్రదేశ్, నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర, మణిపూర్ తదితర ఎనిమిది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 75 శాతం పైగానే అడవులు ఉన్నాయి. దేశంలో మొత్తం మడ అడవులు 4,992 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నాయి. వెదురు విస్తీర్ణం 2023లో 1,54,670 చదరపు కిలోమీటర్లుగా అంచనా వేశారు. 2021 సంవత్సరంతో పోలిస్తే వెదురు విస్తీర్ణం 5,227 చ.కి.మీ.లు పెరిగింది. వెదురు విస్తీర్ణం అధికంగా ఉన్న మూడు రాష్ట్రాలు మధ్యప్రదేశ్ (20,421 చ.కి.మీ.), అరుణాచల్‌ప్రదేశ్ (18,424 చ.కి.మీ.), మహారాష్ట్ర (13,572 చ.కి.మీ.).
దేశంలో అత్యధిక కార్బన్ నిల్వలు ఉన్న తొలి మూడు రాష్ట్రాలు అరుణాచల్‌ప్రదేశ్(1021 మిలియన్ టన్నులు), మధ్యప్రదేశ్(608 మిలియన్ టన్నులు), ఛత్తీస్‌గఢ్(505 మిలియన్ టన్నులు). మడ అడవులు అత్యధికంగా గుజరాత్ రాష్ట్రంలో 36.39 చ.కి.మీ.లు తగ్గాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13.01 చదరపు కిలోమీటర్ల మడ అడవులు పెరగ్గా, మహారాష్ట్రలో 12.39 చ.కి.మీ.లు పెరిగాయి.
ప్రపంచంలో అటవీ విస్తీర్ణం ఎక్కువగా ఉన్న రష్యా ప్రపంచ అడవుల్లో 20శాతం వాటా కలిగి ఉంది. రష్యా విస్తీర్ణంలో అడవుల శాతం 49.8 శాతం. ఆ తర్వాత స్థానంలో బ్రెజిల్ (12 శాతం) . కానీ, బ్రెజిల్ విస్తీర్ణంలో బ్రెజిల్ అడవుల శాతం 59.4 శాతం. ప్రపంచ అటవీ విస్తీర్ణంలో భారతదేశ అడవుల శాతం 2. భారతదేశ విస్తీర్ణంలో అడవుల శాతం25.17.
తెలంగాణ రాష్ట్రంలో అడవులు, చెట్ల కవరేజీ 2021లో 24,758.34 చ.కి.మీ.లు ఉండగా, 2023 24,696.70 చ.కి.మీ.లకు తగ్గింది. అంటే దాదాపు 61.64 చ.కి.మీ.ల అటవీ విస్తీర్ణం తగ్గింది. ఇండియన్ స్టేట్ఆఫ్ ఫారెస్ట్ రిపోర్టు ప్రకారం రాష్ట్ర మొత్తం భూభాగంలో అటవీ విస్తీర్ణం 22.03 శాతంగా ఉన్నది. ఇది జాతీయ సగటు 25.17 శాతంతో పోలిస్తే తక్కువ. చెట్ల కవరేజీ 3478.88 చ.కి.మీ.ల నుంచి 3517.66 చ.కి.మీ.లకు తగ్గింది. తెలంగాణలో 2021తో పోలిస్తే 2023లో 33 జిల్లాలకుగాను 13 జిల్లాల్లో అటవీ విస్తీర్ణం తగ్గగా 20 జిల్లాల్లో పెరిగింది.
తెలంగాణలో అడవుల విస్తీర్ణం
అంశం విస్తీర్ణం చ.కి.మీ. విస్తీర్ణ శాతం
దట్టమైన అడవులు 1,613.32 1.44
మధ్యస్థాయి అడవులు 8,909.90 7.95
ఓపెన్ ఫారెస్ట్ 10,655.82 9.50
మొత్తం 21,179.04 18.89
చిట్టడవులు లేదా పొదలు 2,829.88 2.52
అత్యధికంగా అటవీ విస్తీర్ణం పెరిగిన మూడు జిల్లాలు
- ఆదిలాబాద్ 115.50 చ.కి.మీ.
- కొత్తగూడెం 95.55 చ.కి.మీ.
- నిర్మల్ 45.37 చ.కి.మీ.
అత్యధికంగా అటవీ విస్తీర్ణం తగ్గిన మూడు జిల్లాలు
- జగిత్యాల 54.70 చ.కి.మీ.
- నాగర్ కర్నూల్ 50.33 చ.కి.మీ
- మంచిర్యాల 34.96 చ.కి.మీ
ఇండియన్ ఫారెస్ట్ రిపోర్ట్–2023
అంశం విస్తీర్ణం చ.కి.మీ. శాతం
అడవులు 7,15,343 21.76
చెట్లు 1,12,014 3.41
అడవులు, చెట్లు 8,27,357 25.17
చిట్టడవులు 43,623 1.33
అటవీయేతర భూమి 24,16,489.29 73.50
దేశ భౌగోళిక విస్తీర్ణం 32,87,468.88 100
అధిక అటవీ విస్తీర్ణం గల రాష్ట్రాలు
- మధ్యప్రదేశ్ 785,724 చ.కి.మీ.
- అరుణాచల్‌ప్రదేశ్ 67,083 చ.కి.మీ.
- మహారాష్ట్ర 65,383 చ.కి.మీ.
అడవుల శాతం ఎక్కువున్న రాష్ట్రాలు
- లక్షద్వీప్ 91.33 శాతం
- మిజోరం 85.34 శాతం
- అండమాన్ నికోబార్ 81.62 శాతం