బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధ సంస్థ ఇస్రో, అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా సంయుక్తంగా చేపట్టిన ఏషియోమ్ 4 మిషన్ కు ఎంపికైన ఇద్దరు భారత వ్యోమగాములు మొదటి దశ శిక్షణను విజయవంతంగా పూర్తిచేసుకున్నారు. ప్రైం గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా, బ్యాకప్ గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ తమ శిక్షణను సక్సెస్ పుల్ గా పూర్తి చేసుకున్నారని ఇస్రో అధికారులు తెలిపారు. అమెరికాలో ఈ ఏడాది ఆగస్టులో వారికి శిక్షణ ప్రారంభమైంది.
మొదటి దశ శిక్షణలో ఆ ఇద్దరు గగన్ యాత్రికులు.. మిషన్ కు సంబంధించిన గ్రౌడ్ ఫెసిలిటీ టూర్స్, స్పేస్ ఎక్స్ సూట్ ఫిట్ చెక్స్ వంటి అంశాలను క్లియర్ చేశారు. అలాగే.. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ఐఎస్ఎస్) లో ఆన్ బోర్డ్ సిస్టమ్స్, స్పేస్ ఎక్స్ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ కు సంబంధించిన విషయాలను తెలుసుకోవడం, అక్కడ రోజువారీ కార్యకలాపాలు నిర్వహించడం, కమ్యూనికేషన్ ప్రొటోకాల్స్ పైనా సాంకేతికపరమైన అవగాహన పెంచుకున్నారని అధికారులు చెప్పారు. ఐఎస్ఎస్ లో అత్యవసర పరిస్థితి తలెత్తినపుడు ఎలా వ్యవహరించాలి అన్న అంశంపైనా తర్ఫీదు పొందారని వెల్లడించారు.