Rafale Deal: రూ.63వేల కోట్ల మెగా డీల్.. 26 రాఫెల్-M జెట్స్ కొనుగోలకు కేంద్రం ఆమోదం!

Rafale Deal: రూ.63వేల కోట్ల మెగా డీల్.. 26 రాఫెల్-M జెట్స్ కొనుగోలకు కేంద్రం ఆమోదం!

Defende Deal: ప్రపంచ అగ్ర ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా దూసుకుపోతున్న భారత్ ఇదే సమయంలో తన భూభాగాన్ని, గగనతల రక్షణకు అవసరమైన డిఫెన్స్ బలాన్ని కూడా సమకూర్చుకుంటూనే ఉంది. ఒకపక్క చైనా, పాక్ నుంచి కవ్వింపు చర్యలు పెరుగుతుండగా వాటిని డీల్ చేసేందుకు అవసరమైన యుద్ధ విమానాలను కూడా సమకూర్చుకుంటోంది.

ఇందులో భాగంగానే భారత ప్రభుత్వం ఫ్రాన్స్ నుంచి 26 రాఫెల్-ఎం (మెరైన్) యుద్ధ విమానాలను కొనుగోలు కోసం మెగా డీల్ కుదుర్చుకున్నట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ నివేదించింది. అయితే ఈ భారీ రక్షణ డీల్ విలువ ఏకంగా రూ.63వేల కోట్లుగా ఉన్నట్లు ప్రభుత్వ వర్గాల నుంచి వెల్లడైంది. భారత ప్రభుత్వం త్వరలోనే ఫ్రాన్స్ ప్రభుత్వంతో దీనికి సంబంధించిన ఒప్పందంపై సంతకాలు చేస్తుందని వెల్లడైంది. ఈ కొనుగోలులో నావికాదళానికి 22 సింగిల్ సీటర్, నాలుగు ట్విన్ సీటర్ యుద్ధ విమానాలు సమకూర్చబడతాయి.

వాస్తవానికి ఈ యుద్ధ విమానాల కొనుగోలు కోసం చర్చలు జూలై 2023లోనే జరిగాయి. దేశీయంగా తయారు చేసిన ఐఎన్ఎస్ విక్రాంత్ కోసం రాఫెల్-ఎం జెట్‌ల కొనుగోలు చేసేందుకు భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. విక్రాంత్ డెక్ నుంచి పనిచేసేందుకు వీలుగా ఈ యుద్ధవిమానాల్లో కొన్ని మార్పులతో కూడిన తయారీకి డస్సా్ల్ట్ ఏవియేషన్ అంగీకరించింది. అయితే ఒప్పందం కుదుర్చుకున్న 37-65 నెలల్లో సదరు కంపెనీ వాటిని ఇండియాకు డెలివరీ చేయాల్సి ఉంటుందని వెల్లడైంది. హిందూ మహాసముద్రంలో పెరుగుతున్న చైనా ప్రాభల్యం నేపథ్యంలో వ్యూహాత్మకంగా ఇండియా ఈ రాఫెల్ యుద్ధ విమానాలను ఆర్డర్ చేస్తోంది. ఇది సముద్రంలో భారత వాయుసేనకు పెద్ద బలాన్ని ఇస్తాయని డిఫెన్స్ నిపుణులు చెబుతున్నారు.