
- రెండు పథకాలకు నిధులు పెంచిన ప్రభుత్వం
- యూపీఏ లావాదేవీలకు సర్కారు ప్రోత్సాహకాలు
- కేంద్ర కేబినెట్భేటీలో నిర్ణయం
న్యూఢిల్లీ: పాల ఉత్పత్తిని మరింత పెంచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం రెండు పథకాలకు నిధులు పెంచింది. ఈమేరకు రాష్ట్రీయ గోకుల్ మిషన్ (ఆర్జీఎం), నేషనల్ ప్రోగ్రాం ఫర్ డెయిరీ డెవలప్ మెంట్ (ఎన్ పీడీడీ) స్కీంలకు కేటాయింపులను రూ.6,190 కోట్లకు పెంచుతూ బుధవారం జరిగిన కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో బుధవారం యూనియన్ కేబినెట్ సమావేశం జరిగింది. కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు.
సవరించిన ఆర్జీఎం, ఎన్ పీడీడీ ప్రతిపాదనలను కేబినెట్ ఆమోదించిందని మంత్రి వెల్లడించారు. పాల ఉత్పత్తి, రైతుల ఆదాయాన్ని పెంచేందుకు ఉద్దేశించిన ఈ పథకాలకు నిధులు పెంచామన్నారు. అదనంగా రూ.వెయ్యి కోట్ల నిధులతో సవరించిన ఆర్జీఎంను అమలు చేస్తామని, దీంతో ఈ పథకం కింద మొత్తం నిధులు రూ.3,400 కోట్లకు చేరుకున్నాయని పేర్కొన్నారు. అలాగే, సవరించిన ఎన్ పీడీడీకి అదనంగా రూ.వెయ్యి కోట్లు ఇచ్చామని, దీంతో 15వ ఫైనాన్స్ కమిషన్ సైకిల్లో ఈ పథకం కింద మొత్తం బడ్జెట్ రూ.2,790 కోట్లకు చేరిందన్నారు.
డెయిరీ మౌలిక సౌకర్యాలను ఆధునికీకరించడం, సుస్థిర వృద్ధి, ఉత్పాదకత జరిగేలా చూడడం ఆర్జీఎం, ఎన్ పీడీడీ ఉద్దేశమని మంత్రి చెప్పారు. కాగా.. ఆర్జీఎం అమలు, ప్రభుత్వ చొరవతో గత పదేళ్లలో పాల ఉత్పత్తి 63.55% పెరిగిందని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. 2013–14లో పాల లభ్యత ఒక వ్యక్తికి 307 గ్రాములు ఉండగా.. 2023–24కు అది 471 గ్రాములకు పెరిగిందని చెప్పారు. కాగా, మహారాష్ట్రలో ఆరు లేన్ల యాక్సెస్ కంట్రోల్డ్ గ్రీన్ ఫీల్డ్ హైస్పీడ్ నేషనల్ హైవే ప్రాజెక్టుకు సైతం ఆమోదం తెలిపింది.
యూపీఐ ట్రాన్సాక్షన్లకు ప్రోత్సాహం
2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.2 వేలలోపు యూపీఐ ట్రాన్సాక్షన్లను ప్రోత్సహించడానికి దాదాపు రూ.1500 కోట్ల విలువైన ప్రోత్సాహకాల స్కీమ్ కు యూనియన్ కేబినెట్ ఆమోదం తెలిపింది. ‘2024–25 ఆర్థిక సంవత్సరంలో ‘లో వాల్యూ భీమ్ యూపీఐ ట్రాన్సాక్షన్స్ పర్సన్ టు మర్చంట్ (పీ2ఎం)’ ఇన్సెంటివ్ స్కీమ్‌ను యూనియన్ కేబినెట్ ఆమోదించింది. 2024 ఏప్రిల్ 1 నుంచి 2025 మార్చి 31 వరకు ఈ పథకం అమలవుతుంది. చిన్న వ్యాపారులకు రూ.2 వేల లోపు చేసే ట్రాన్సాక్షన్లకు మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుంది” అని అధికారులు పేర్కొన్నారు.