డిసెంబర్ 28న కేయూలో ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్

హసన్‍పర్తి (కేయూసీ), వెలుగు: వరంగల్‍ కాక తీయ యూనివర్సిటీ వేదికగా మూడు రోజుల పాటు 82వ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ సదస్సు నిర్వహించనున్నట్లు వీసీ తాటికొండ రమేశ్ తెలిపారు. మంగళవారం వర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్‌లో ప్రెస్​మీట్​పెట్టి వివరాలు వెల్లడించారు. ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్1935లో స్థాపించారన్నారు. ఇది 35 వేల మంది సభ్యులు కలిగిన దక్షిణాసియాలోనే వృత్తిపరమైన చరిత్రకారుల అతిపెద్ద సంస్థ అన్నారు. 

సదస్సుకు 2 వేల మంది చరిత్రకారులు హాజరయ్యే అవకాశం ఉందన్నారు. ఆరు సెక్షన్లలో దాదాపు 1,030 వరకు పరిశోధన పత్రాలు సమర్పిస్తారన్నారు. ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ కృష్ణ మోహన్ శ్రీమాలీ, కురుక్షేత్ర యూనివర్సిటీకి చెందిన రిటైర్డ్​ ప్రొఫెసర్ కుందన్ లాల్ తో స్పెషల్ లెక్చర్స్, ఇండియన్ హిస్టరీపై ప్రముఖుల ప్రసంగాలు ఉంటాయన్నారు. 

కేయూ వేదికగా 1993లో ప్రొఫెసర్లు బొబ్బిలి, జయశంకర్‍ నాయకత్వంలో ఈ సదస్సు నిర్వహించారన్నారు. మరోసారి కేయూకు ఈ ఘనత దక్కిందని చెప్పారు. ఐదేండ్లకోసారి ఇచ్చే లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు ప్రొఫెసర్ రామచంద్ర గుహ, బెస్ట్ బుక్ అవార్డు కృష్ణమోహన్ శ్రీమాలికి అందజేయనునట్లు స్పష్టం చేశారు. 28, 29, 30 తేదీల్లో నిర్వహించే సదస్సులో రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలిసింది.