Success: కాంపిటేటివ్ ఎగ్జామ్ స్పెషల్.. గాంధీ సత్యాగ్రహం

Success:  కాంపిటేటివ్ ఎగ్జామ్ స్పెషల్.. గాంధీ సత్యాగ్రహం

1919 నుంచి 1947 వరకు జాతీయోద్యమానికి నాయకత్వం వహించిన ఏకైక నాయకుడు మోహన్ దాస్ కరమ్​చంద్ గాంధీ. అందుకే భారత జాతీయోద్యమ చరిత్రలో 1919 నుంచి 1947 వరకు గాంధీ శకం లేదా గాంధీ యుగంగా చరిత్రకారులు అభివర్ణిస్తారు. అతివాదులు, మితవాదులు లక్ష్య సాధనలో విఫలమైనా గాంధీజీ నాయకత్వంలో భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్య్రం  లభించింది. 

దక్షిణాఫ్రికాలో 1883 నుంచి 1915 వరకు అనేక ఉద్యమాలు, సత్యగ్రహలు చేపట్టిన గాంధీ 45 సంవత్సరాల వయస్సులో 1915, జనవరి 9న స్వదేశానికి తిరిగి వచ్చారు. అహ్మదాబాద్​లోని సబర్మతి వద్ద ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని 1916 నుంచి 1936 వరకు అక్కడే నివసించారు. ఆ తర్వాత మహారాష్ట్రలోని వార్దా సమీపంలో సేవాగ్రామ్ అనే నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. 

చంపారన్ సత్యాగ్రహం

ఇది భారతదేశంలో మహాత్మా గాంధీ చేపట్టిన మొదటి సత్యాగ్రహం. బిహార్​లోని చంపారన్ జిల్లాలో జరిగిన ఈ ఉద్యమం భారత రైతాంగ ఉద్యమాలన్నింటిలో  ఉన్నతమైంది. ఈ ప్రాంతంలో తీన్​కతియా పద్ధతి అమలులో ఉండటంతో ప్రతి రైతు తాను సాగుచేస్తున్న భూమిలో 3/20వ వంతు బలవంతంగా నీలిమందు సాగు కోసం కేటాయించాలి. 

నీలిమందు సాగు చేసే రైతులు జమీందార్లకు షరాబేషి లేదా తవాన్ పన్నును చెల్లించాల్సి వచ్చేది. షరాబేషి అంటే శిస్తు పెంచడం, తవాన్ అంటే ఏక మొత్తాల నష్టపరిహారం చెల్లించడం. రాజ్​ కుమార్ శుక్లా ఆహ్వానం మేరకు గాంధీ నీలిమందు సాగు చేస్తున్న రైతుల స్థితిగతుల విచారణకు చంపారన్ వెళ్లి ఉద్యమాన్ని చేపట్టాడు. ఈ ఉద్యమంలో జె.బి.కృపలాని, బాబు రాజేంద్రప్రసాద్, మహాదేవ్ దేశాయ్, మజహర్–ఉల్–హక్, నరహరి పారిక్ వంటి నాయకులూ పాల్గొన్నారు. 

1916లో జరిగిన  కాంగ్రెస్ సమావేశంలో గాంధీ రైతు నాయకులైన బ్రిజ్​ కిషోర్, రాజ్​ కుమార్ శుక్లాతో కలిసి ఉద్యమాన్ని నడపాలని భావించాడు. 1917, ఏప్రిల్ 10న ఉద్యమం మొదలైంది. ఈ ఉద్యమానికి తలొగ్గి గాంధీని 1917, మే 29న బిహార్ గవర్నర్ ఆహ్వానించి నీలిమందు రైతుల సమస్యల పరిష్కారానికి కమిటీని ఏర్పాటుచేసి, ఆ కమిటీకి గాంధీని కార్యదర్శిగా నియమించాడు. ఈ కమిటీ నివేదిక ఆధారంగా తీన్​ కతియా విధానం రద్దయింది. చంపారన్ సత్యాగ్రహంతో రైతు ఉద్యమాలు జాతీయోద్యమంలో భాగమయ్యాయి. 

ఖేడా సత్యాగ్రహం

ఈ సత్యాగ్రహం గుజరాత్​లోని ఖేడా జిల్లాలో 1918, మార్చి 22 నుంచి జూన్ 6 వరకు కొనసాగింది. ఈ ప్రాంతంలో తీవ్రమైన కరవు కారణంగా పంట దిగుబడి 25 శాతం కంటే తగ్గింది. ఇలాంటి పరిస్థితుల్లో పన్నులు వసూలు చేయరాదని రెవెన్యూ రికార్డుల్లో ఉంది. అయినా బ్రిటీష్​ వారు దానిని పాటించకుండా రైతులను హింసించి పన్నులు వసూలు చేసే ప్రయత్నం చేశారు. దీన్ని నిరసిస్తూ మోహన్​లాల్ పాండ్య ఉద్యమాన్ని చేపట్టాడు. ఆ తర్వాత వల్లభాయ్​ పటేల్, ఇందూలాల్ యాజ్ఞిక్ సహాయంతో గాంధీజీ ఉద్యమాన్ని ఉధృతం చేశారు. గాంధీజీ తన అధ్యక్షతన గుజరాత్ సభ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి ఈ ఉద్యమాన్ని కొనసాగించాడు. ఉద్యమ ఫలితంగా చివరకు ఖేడాలో పన్నుల వసూలులో మినహాయింపు ఇచ్చారు. 

అహ్మదాబాద్ సత్యాగ్రహం

అహ్మదాబాద్​లోని మిల్లు కార్మికుల తరఫున 1918లో గాంధీ ఉద్యమాన్ని చేపట్టారు. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు అనుగుణంగా కార్మికులు మిల్లు యాజమాన్యం బోనస్ ​ఇవ్వలేదు. అలాగే ,1917లో ప్లేగు వ్యాధి వ్యాపించినప్పుడు కార్మికులు అహ్మదాబాద్ విడిచి తమ గ్రామాలకు వెళ్లిపోయినప్పుడు వారిని ఆకర్షించడానికి మిల్లు యజమానులు వారి వేతనాన్ని 75 శాతం పెంచారు. కానీ, ప్లేగు వ్యాధి అంతరించాక యజమానులు పూర్వపు వేతనమే ఇవ్వడానికి సిద్ధపడ్డారు. దీంతో కార్మికులు, యజమానుల మధ్య ఘర్షణ మొదలైంది. 

అనసూయ బెన్, సారాబాయ్, ఆమె సోదరుడు అంబాలాల్ సారాబాయ్ పిలుపు మేరకు గాంధీ మిల్లు కార్మికుల తరఫున ఉద్యమాన్ని చేపట్టి 1918లో అహ్మదాబాద్ టెక్స్​ టైల్ లేబర్ యూనియన్ అనే కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఉద్యమంలో భాగంగా గాంధీ1918, మార్చి 26న తొలిసారి ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. ఈ దీక్ష ఫలితంగా మిల్లు యజమానులు, కార్మికుల జీతాలను 35 శాతం పెంచడానికి  అంగీకరించారు. మిల్లు యజమానులకు, కార్మికులకు జరిగిన ఘర్షణలో ఆనందశంకర ధ్రువ మధ్యవర్తిగా ఉన్నాడు. 

దక్షిణాఫ్రికా ఉద్యమాలు

 

  •      దక్షిణాఫ్రికాలో స్థిరపడిన పోరుబందర్​కు చెందిన దాదా అబ్దుల్లా సేఠ్ తరఫున వాదించడానికి లీగల్ అడ్వైజర్​    గా 1893లో గాంధీ దక్షిణాఫ్రికాకు వెళ్లాడు. నటాల్ రాష్ట్రంలో భారతీయుల ఓటు హక్కు కోసం పోరాటం జరిపి           విజయం సాధించారు. 1894లో నటాల్ ఇండియన్ కాంగ్రెస్ అనే సంస్థను స్థాపించారు.
  •      దక్షిణాఫ్రికాలో బాలస్వామి అనే కూలీపై బ్రిటీష్ వారు దాడి చేయగా గాంధీ ఈ విషయాన్ని న్యాయస్థానం               దృష్టికి   తీసుకెళ్లి బ్రిటీష్ వారిని జైలుకు పంపాడు. తత్ఫలితంగా గిర్మిటియ సోదరుడిగా పేరుగాంచాడు. 
  •      1894లో దక్షిణాఫ్రికాలో ఉన్న భారతీయులపై జరుగుతున్న అత్యాచారాలు తొలగించడానికి పోరాడారు. 
  •      1897లో గాంధీజీపై కూడా డర్బన్​లో శ్వేత జాతీయులు దాడి చేశారు. 
  •      1903లో గాంధీ స్థాపించిన ఇండియన్​ ఒపీనియన్ అనే పత్రికలో దక్షిణాఫ్రికాలోని భారతీయుల స్థితిగతులపై         అనేక వ్యాసాలను రచించి ప్రచురించాడు. 1906లో దక్షిణాఫ్రికా ప్రభుత్వం నల్లచట్టంగా పేర్కొనే ఏషియాటిక్
  •     లా అమెండ్మెంట్ చట్టాన్ని రూపొందిస్తూ భారతీయుల వేలిముద్రలను ప్రభుత్వ రికార్డుల్లో రిజిస్టర్ చేశారు. ఈ        చట్టానికి వ్యతిరేకంగా గాంధీ ప్రప్రథంగా తన నూతన రాజకీయ అస్త్రం సత్యాగ్రహాన్ని ప్రయోగించారు. 
  •      ట్రాన్స్​విల్ ఇమిగ్రేషన్ చట్టం 1907లో ఆమోదం పొందగా నటాల్ నుంచి ట్రాన్స్​ విల్ రాష్ట్రంలోకి భారతీయుల      ప్రవేశాన్ని నిషేధిస్తూ దక్షిణాఫ్రికా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. 1913లో క్రైస్తవేతర వివాహాలు చెల్లవంటూ          దక్షిణాఫ్రికా సుప్రీంకోర్టు తీర్పునివ్వడంతో ఈ తీర్పునకు వ్యతిరేకంగా సత్యాగ్రహం చేశాడు. హిందూ                      సంప్రదాయబద్ధ వివాహాలను గుర్తించాలని మళ్లీ సత్యాగ్రహం చేపట్టాడు. 
  •    జూలు జాతి ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య జరిగిన యుద్ధంలో గాయపడిన వారికి గాంధీజీ అంబులెన్స్ ఫోర్స్        సేవ చేసినందుకు దక్షిణాప్రికా ప్రభుత్వం కైజర్ ఇ హింద్ అనే బిరుదును బహూకరించింది. 
-వెలుగు, సక్సెస్-