చెన్నై : ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో ఇండియా హాకీ టీమ్ జైత్రయాత్ర కొనసాగించింది. బుధవారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లోనూ ఇండియా 4–0తో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై ఘన విజయం సాధించింది. టీమిండియా తరఫున హర్మన్‌ప్రీత్ సింగ్ (15, 23వ ని.), జుగ్రాజ్ సింగ్ (36వ ని.), అకాశ్‌దీప్ సింగ్ (55వ ని.) గోల్స్‌తో హడలెత్తించారు. పాక్ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయింది. ఓవరాల్‌గా రౌండ్ రాబిన్లో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో ఇండియా 4 విజయాలు, ఓ డ్రాతో 13 పాయింట్లు నెగ్గి టాప్ ప్లేస్‌తో సెమీస్‌కు రెడీ అయింది.
మరో మ్యాచ్‌లో మలేసియా 1–0తో కొరియాపై నెగ్గింది. మలేసియా తరఫున అజ్రాయ్ అబు కమల్ (22వ ని.) గోల్ చేశాడు. చైనాతో జరిగిన మ్యాచ్‌లో జపాన్ 2–1తో గెలిచింది. కాగా, శుక్రవారం జరిగే సెమీఫైనల్లో జపాన్‌తో ఇండియా పోటీ పడనుంది. మరో మ్యాచ్‌లో మలేసియా–కొరియా తలపడతాయి.