కమాల్ చేసిన గరీబోడి గొంతు

ఇండియన్​ ఐడల్​… పాటల పోటీలకు వెళ్లే ప్రతి అమెచ్యూర్​ సింగర్​కి ఒక కల. నిరంతర సాధన, పట్టుదల, సంగీతంలో మెళకువలు, స్టేజీ భయం, సీనియర్ల ముందు జంకుగొంకు లేనితనం లాంటివెన్నో ఉండాలి. ఒక సాదాసీదా బెలూన్లు అమ్ముకునే ఆమె కొడుకు..అందులోనూ బూట్​ పాలిష్ చేసుకునే స్కూల్​ డ్రాపవుట్​ కుర్రాడికి ఊహకైనా అందనంత కల.  సుప్రసిద్ధ పాకిస్థానీ సూఫీ గాయకుడు నుస్రత్​ ఫతే అలీ ఖాన్ గొంతుకి దగ్గరగా ఉండడమే ఆ కుర్రాడికి కలిసొచ్చే విషయం. ఆ ఒక్క ప్లస్​ పాయింట్​తోనే ఇండియన్​ ఐడల్​ 11వ సీజన్​లో విజేతగా నిలిచాడు.

టాలెంట్​ని తొక్కేయడం ఎవరి తరం కాదంటారు. ఈ మాట నమ్మనివాళ్లెవరైనా ఉంటే… మొన్ననే హెవీ కాంపిటీషన్​ మధ్య ‘ఇండియన్​ ఐడల్​’గా గెలిచిన సన్నీ హిందూస్థానీ గురించి తెలుసుకోవచ్చు. బిలో పావర్టీ లైన్​ (బీపీఎల్​) అనడానికైనా వీల్లేని ఫ్యామిలీ నుంచి వచ్చాడతను. చదువు లేదు. తండ్రి మానక్​ రామ్​ చనిపోతూ వదిలేసిన హార్మోనియం, తబలాలు, వారసత్వంగా వచ్చిన గొంతు తప్ప అతనికంటూ ఎలాంటి మ్యూజిక్​ నాలెడ్జి లేదు. ముగ్గురు అక్కచెల్లెళ్ల మధ్య ఒక్కగానొక్క మగ నలుసు. ఇంట్లో ముద్దుగా ‘లడ్డూ’ అని పిలుచుకునేవారు. 15 ఏళ్ల వయసులోనే తండ్రి చనిపోతే కుటుంబాన్ని పోషించడానికి తల్లి సోమా బెలూన్లు అమ్మేది. ఆమెకు సాయంగా  సన్నీ బూట్ పాలిష్​ చేసేవాడు. అయితే, తనలోని మ్యూజిక్​ హాబీని మాత్రం వదులుకోలేదు. ఏ పని చేస్తున్నా ఫోన్​లో పాటలు వింటూ ప్రాక్టీస్​ చేసుకునేవాడు. ఈ రోజున దేశంలోని అమెచ్యూర్​ సింగర్స్​ అందరూ కలలు కనే ‘ఇండియన్​ ఐడల్​’ పొజిషన్​ని సొంతం చేసుకున్నాడు లడ్డూ.

పోయినేడాది దీపావళి సీజన్​లో ఓ వండర్​ జరిగింది. నుస్రత్​ ఫతే అలీ ఖాన్​ పాడిన ‘అఫ్రీన్​ అఫ్రీన్​…’ పాటతో సన్నీ ఇండియన్​ ఐడల్​ ఆడిషన్​ రౌండ్​లోనే జడ్జీలందరినీ మంత్రముగ్ధుల్ని చేసే శాడు. ఫతే అలీ ఖాన్​ పాకిస్థాన్​కి చెందిన గాయకుడు. ఆయనను సూఫీ సాహిత్య గాయకుడిగా ప్రపంచమంతా గౌరవిస్తుంది. సన్నీ హిందూస్థానీ ఫస్ట్​ రౌండ్​లో తన గురించి పరిచయం చేసుకుంటూ చెప్పిన మాటల్ని బిజినెస్​ టైకూన్​ ఆనంద్​ మహీంద్రకు ఆయన ఫ్రెండ్​ పంపించాడు. వాటిని విన్నాక… స్పందించకుండా ఉండలేకపోయారు మహీంద్ర.  ‘ఎదుగుతున్నవాళ్ల గురించి తెలుసుకోవడానికి దీపావళి రోజే సరైనది. నా ఫ్రెండ్​ ఒకరు ఈ క్లిప్పింగ్​ చూసి కన్నీళ్లతో తడిసిపోయాడు. ఇది చూస్తే మీకుకూడా కళ్లలో నీళ్లు ఇంకిపోవడం ఖాయం.  మరుగునపడిన మాణిక్యాల్ని వెలికితీయడంలో టీవి, సోషల్​ మీడియాలు చేస్తున్న సర్వీసు చాలా గొప్పది’ అని ట్వీట్​ చేశారు మహీంద్ర.

సన్నీ హిందూస్థానీ భటిండా (పంజాబ్​)లోని అమర్​పుర బస్తీకి చెందిన కుర్రాడు. 2014లో తండ్రి చనిపోయే సమయానికి అతను ఆరో క్లాస్​ చదువుతున్నాడు. స్కూలులో చదువుతున్నప్పుడు భటిండాలో జరిగే మ్యూజిక్​ షోల్లో తన గొంతు విప్పేవాడు. రియాల్టీ షో ‘ఎంటర్​టైన్​మెంట్​ కే లియే కుచ్​ భీ కరెగా’లో పార్టిసిపేట్​ కావడానికి తయారవుతున్న దశలో తండ్రి wమానక్​ రామ్​ చనిపోతే, ఆ  బాధలోనే రియాల్టీ షోకి హాజరయ్యాడు. ఒక పక్క ఫ్యామిలీకోసం కష్టపడుతూనే ఇండియన్​ ఐడల్​ 11వ సీజన్​లో ఎంటరయ్యాడు. ఈ కాంపిటీషన్​లో ప్రతి రౌండ్​లోనూ లైవ్​లో చూస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకుడిని తనకు ఫ్యాన్​గా మార్చుకున్నాడు. షూ పాలిష్​ చేసే కుర్రాడిగా జనం గుర్తించినా, అతనిని చిన్నచూపు చూడలేదు. లడ్డూ టాలెంట్​కి ఫుల్​ ఫిదా అయిపోయారు. దాదాపు మూడు నెలల పాటు సాగిన ఆడిషన్​ రౌండ్లలోనే రెండుసార్లు గోల్డెన్​ మైక్​లు అందుకున్నాడు. అంటే, ఆ రౌండ్​లో అతనే టాప్​ అయ్యాడు. ఫైనల్​ రౌండ్​లో రోహిత్​ రావత్​, అద్రిజ్​ ఘోష్​, అంకోనా ముఖర్జీ, రిధమ్​ కల్యాణ్​లతో గట్టి పోటీ ఎదురైంది. భర్​ దో జోలీ మేరి, హల్క హల్క సురూర్​ లాంటి పాటలతో సన్నీ హిందూస్థానీ ఫైనల్​లో ముందడుగేశాడు. చివరకు ప్రేక్షకుల ఓట్లు ఎక్కువ మొత్తం అతనికే పడ్డాయి. ఆ షోకి స్పెషల్​ గెస్ట్​లుగా వచ్చిన ఆయుష్మాన్​ ఖురానా, నీనా గుప్తాల చేతుల మీదుగా ‘ఇండియన్​ ఐడల్​–11’ ట్రోఫీతోపాటుగా 25 లక్షల రూపాయల క్యాష్​ ప్రైజ్​కూడా సన్నీ అందుకున్నాడు. రోహిత్​ రావత్​ ఫస్ట్​ రన్నరప్​గా ఎంపిక కాగా, అంకోనా ముఖర్జీ థర్డ్​ ప్లేస్​లో నిలిచింది. అంకోనాకి 5 లక్షల ప్రైజ్​ మనీ వస్తే, నాలుగు అయిదు స్థానాలు పొందిన రిథమ్​ కల్యాణ్​, అద్రిజ్​ ఘోష్​లకు చెరి మూడు లక్షలు బహుమతి దక్కింది.

విజేతగా ప్రకటించాక…. నిజమైన కాంపిటీషన్​ తనకు ఇంటిలోనే ఎక్కువగా ఉందన్నాడు. తన హాబీని అమ్మ ఎంకరేజ్​ చేసేదని, అయితే ఇంత పెద్ద ఆడిషన్​కి వెళ్లడానికి మాత్రం ఇష్టపడేది కాదని లడ్డూ చెప్పాడు. ‘మా అమ్మతోనే ఎక్కువగా ఫైట్​ చేయాల్సి వచ్చేది. అన్నీ వదిలేసి ఈ కాపింటీషన్​కోసం వెళ్లడం ఆమెకిష్టముండేది కాదు. ఎందుకంటే, ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు అలాంటివి’ అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. అక్కడక్కడ చేబదుళ్లు తెచ్చుకుని ఇండియన్​ ఐడల్​ కాంపిటీషన్​కి వచ్చాడు. ఇంత కష్టపడ్డాడు కాబట్టే, ఇండియన్​ ఐడల్​–11 విజేత కాగలిగాడు. టీ–సిరీస్​ వాళ్ల ప్రాజెక్ట్​లో పాడడానికి ఛాన్స్​ కూడా కొట్టేశాడు.

ఆనందంలో ఉబ్బితబ్బిబయిన లడ్డూ… ‘నేనసలు ఈ కాంపిటీషన్​ గెలవడం సంగతి అటుంచి, ఫస్ట్​ రౌండ్​ దాటగలనా అనుకున్నాను. ఇలాంటి పెద్ద వేదికపైన పాడే అవకాశం రావడం మొదలుకొని, ఇండియన్​ ఐడల్​గా గెలవడం వరకు అన్నీ నాకు కలగానే కనిపిస్తున్నాయి. నన్ను గైడ్​ చేసిన జడ్జీలకు, మ్యూజిక్​ ఇండస్ట్రీలో లెజెండ్స్​ ఎదుట పాడడానికి అవకాశమిచ్చిన చానెల్​వారికి ఎంతో రుణపడి ఉంటాను. నా గొంతును దేశం మొత్తం విన్నదని, నన్ను దేశ్​ కి ఆవాజ్​గా ఓటేసి గెలిపించారని తెలిసి ఇప్పటికీ నమ్మలేకపోతున్నా’ అన్నాడు. నిజమే.. అసాధ్యమని అనుకుంటున్నది నిజమైతే ఓ పట్టాన నమ్మలేరెవరు!

నుస్రత్​ ‘ఆత్మ’ సన్నీ!

నుస్రత్​ ఫతే అలీ ఖాన్​ గొంతు ఒక్కసారిగా మొన్న ఇండియన్​ ఐడల్​–11లో మారుమోగిపోయిందనుకున్నారు. ఎప్పుడో 23 ఏళ్ల క్రితం చనిపోయిన ఈ పాకిస్థానీ సూఫీ గాయకుడి స్వరం ఎలా వినిపించిందనుకోకండి. సోనీ టీవీ నిర్వహించిన ఆ కాంపిటీషన్​లో పాల్గొన్న సన్నీ హిందూస్థానీ మొదటి రౌండ్​ నుంచి ఫైనల్​ రౌండ్​ వరకు ఫతే అలీ పాడిన పాటలతో జడ్జీల్ని, ప్రేక్షకుల్ని తన వశం చేసుకున్నాడు. జ్యూరీలోని విశాల్​ దడ్లానీ, నేహా కక్కర్​, అను మాలిక్​ ఇంప్రెసయిపోయారు. అను మాలిక్ ఏకంగా సన్నీని ఈ​ సాబ్​ రూహ్​ (ఆత్మ)’ అన్నాడు. ఒక ఎపిసోడ్​కి చీఫ్​ గెస్ట్​గా వచ్చిన కునాల్​ కెమ్​ తన మెడలోని లక్మీదేవి లాకెట్​ను తీసి లడ్డూ మెడలో వేసేశాడు. మరో రౌండ్​లో సన్నీ పాట విని అజయ్​ దేవ్​గన్​​, అతని భార్య కాజల్​ ఫిదా అయ్యారు.

ఇండియన్​ ఐడల్​లో తెలుగువాళ్లు

శ్రీ రామచంద్ర ఫస్ట్​ ఐడల్​

ఫస్ట్​ టైమ్​ ఇండియన్​ ఐడల్​ అయిన తెలుగువాడిగా మైనంపాటి శ్రీరామచంద్ర రికార్డుకెక్కాడు. ప్రకాశం జిల్లా అద్దంకికి చెందిన శ్రీరామచంద్రకు చిన్నప్పట్నుంచే వెస్ట్రన్​ క్లాసికల్​, ఇండియన్​ క్లాసికల్​ సంగీతంతో పరిచయముంది. 2010లో ఇండియన్​ ఐడల్​ సీజన్​–5కి శ్రీరామచంద్ర విన్నర్​ అయ్యాడు. ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో అనేక పాటలు పాడుతున్నాడు. శ్రీరామచంద్ర ‘అకపెల్లా స్టయిల్​’లో స్పెషల్​ ఈవెంట్లు నిర్వహిస్తుంటాడు. పక్కన ఏ వాయిద్యాలు లేకుండా నోటితోనే పెర్క్యుషన్​, స్ట్రింగ్​ వంటివన్నీ పలికించడం ‘అకపెల్లా’ పద్ధతి.

 

ఉత్తరాంధ్ర సింగర్​ రేవంత్​

లొల్ల వెంకట రేవంత్​ కుమార్​ శర్మ (ఎల్వీ రేవంత్​) ‘ఇండియన్​ ఐడల్​’గా నిలిచిన రెండో తెలుగు సింగర్​. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లాకి చెందిన ఫ్యామిలీ వీళ్లది. 2017లో జరిగిన ఇండియన్​ ఐడల్​ సీజన్​–9లో ‘సబ్​సే బడా కళాకార్​’ టైటిల్​ ట్రాక్​తో ఫస్ట్​ రౌండ్​లోనే జడ్జీలను కట్టిపారేశాడు. ప్రస్తుతం సినీ సింగర్​గా సెటిలయ్యాడు. అర్జున్​ రెడ్డి, బాహుబలి లాంటి సూపర్​ హిట్​ సినిమాల్లో రేవంత్​ పాడిన పాటలుకూడా మంచి హిట్టయ్యాయి.

సెకండ్​ ప్లేస్​లో కారుణ్య

దేశవ్యాప్తంగా ఆసక్తి పుట్టించిన ఇండియన్​ ఐడల్​ కాంపిటీషన్​లో తెలుగువాళ్లుకూడా సత్తా చాటుకున్నారు.  సీజన్​–2లోనే ఎన్​.సి.కారుణ్య కొంచెంలో వెనకబడి, సెకండ్​ ప్లేస్​తో సరిపుచ్చుకున్నాడు. కారుణ్య అప్పటికే ‘పాడుతా తీయగా’ లాంటి పోటీల్లో విజేతగా నిలిచాడు. ప్రస్తుతం చాలా సినిమాల్లో ప్లేబ్యాక్​ సింగర్​గా రాణిస్తున్నాడు.