
న్యూఢిల్లీ: అమెరికాలో అక్రమంగా ఉంటున్న మధ్య ఆసియా, ఇండియా వలసదారులను తమ దేశం లోకి అనుమతిస్తున్నట్లు కోస్టారికా సోమవారం తెలిపింది. 200 మంది అక్రమ వలసదారులతో బుధవారం అమెరికా నుంచి ఓ కమర్షియల్ విమానం రానుందని ఆ దేశ అధ్యక్ష కార్యాలయం వెల్లడించింది. ఈ ఫ్లైట్‌లో ఎక్కువ మంది సెంట్రల్ ఏషియా, ఇండియా నుంచే ఉన్నారని పేర్కొంది.
వీరందరినీ పనామా సరిహద్దులో ఏర్పాటు చేసిన శిబిరాలకు తరలించనున్నట్లు తెలిపింది. దీనికి సంబంధించి మొత్తం ఖర్చు అమెరికానే భరించనుందని కోస్టారికా ప్రభుత్వం వెల్లడించింది. ఆ తర్వాత వారిని సొంత దేశాలకు పంపించనున్నట్లు పేర్కొంది. ఈ మొత్తం వ్యవహారాన్ని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ (ఐవోఎం) ఆధ్వర్యంలో అమెరికా ప్రభుత్వం చూసుకుంటున్నదని చెప్పింది. కాగా, ఇంతకుముందు పనామా, గ్వాటెమాలాలు కూడా అమెరికాలో ఉంటున్న అక్రమ వలసదారులను తీసుకునేందుకు ఒప్పందం చేసుకుంది.
గత వారంలో 119 మంది అక్రమ వలసదారుల విమానం పనామాలో దిగింది. వీరిలో ఎక్కువగా చైనా, పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్ దేశాలకు చెందిన వారు ఉన్నారు. అయితే, గ్వాటెమాలకు ఇప్పటివరకు ఎలాంటి వలసదారుల విమానం రాలేదు.