- ఐదేళ్లలో మరింత ఎక్కువైన అంతరాయం
న్యూఢిల్లీ: ఇండియాలోని టాప్ ఐదు ఐటీ కంపెనీల సీఈఓల జీతాలు గత ఐదేళ్లలో భారీగా పెరిగాయి. కానీ, ఈ కంపెనీల్లో జాయినవుతున్న ఫ్రెషర్ల జీతాల్లో మాత్రం పెద్దగా మార్పు లేదు. టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, విప్రో, టెక్ మహీంద్రా సీఈఓల జీతాలు గత ఐదేళ్లలో 160 శాతం పెరిగాయని, ఇదే టైమ్‌లో ఫ్రెషర్ల జీతాలు కేవలం 4 శాతం మాత్రమే పెరిగాయని మనీకంట్రోల్ రిపోర్ట్ వెల్లడించింది. టాప్ ఐదు కంపెనీల సీఈఓల సగటు శాలరీ 2023–24 లో రూ.84 కోట్లకు చేరుకుంది.
అదే ఈ కంపెనీల్లో జాయిన్ అవుతున్న ఫ్రెషర్ల శాలరీ ప్యాకేజీ మాత్రం రూ.3.6 లక్షల నుంచి రూ.4 లక్షలకే చేరుకుంది. ‘ఐటీ కంపెనీల మార్జిన్స్ తగ్గిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో సీఈఓల శాలరీలు ఎందుకు పెరుగుతున్నాయి? నాకైతే తెలీదు. బోర్డు ఎందుకు సీఈఓలకు రివార్డ్స్ ఇస్తున్నాయో! కిందిస్థాయిలో ఉన్నవారిని టాప్ ఒక శాతం మంది బాగా వాడుకుంటున్నారు’ అని ఇన్ఫోసిస్ మాజీ బోర్డ్ మెంబర్ మోహన్‌దాస్ పాయ్ పేర్కొన్నారు. సీఈఓ జీతానికి , ఫ్రెషర్ల జీతానికి మధ్య తేడా భారీగా పెరిగింది.
విప్రోలో ఫ్రెషర్ జీతంతో పోలిస్తే సీఈఓ జీతం 1,702 రెట్లు ఎక్కువగా ఉండగా, టెక్ మహీంద్రాలో 1,383 రెట్లు, హెచ్‌సీఎల్ టెక్‌లో 707 రెట్లు, ఇన్ఫోసిస్‌లో 677 రెట్లు, టీసీఎస్‌లో 192 రెట్లు ఎక్కువగా ఉంది. ఐదేళ్ల కిందట విప్రోలో సీఈఓ జీతం ఫ్రెషర్ల జీతం కంటే 495 రెట్లు మాత్రమే ఎక్కువగా ఉండగా, టెక్ మహీంద్రాలో 618 రెట్లు ఎక్కువగా ఉండేది.