
Coding Jobs: దాదాపు రెండు దశాబ్ధాల నుంచి భారతదేశం ఐటీ సేవల రంగంలో ప్రపంచంలో నమ్మదగిన సర్వీస్ ప్రొవైడర్ గా మారింది. దీంతో టీసీఎస్ నుంచి టెక్ మహీంద్రా వరకు అనేక అగ్రగామి కంపెనీలు లక్షల మందికి టెక్ రంగంలో ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నాయి. కానీ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న ఏఐ మ్యానియా ఈ రంగంలోని ఉద్యోగులకు వణుకు పుట్టిస్తోంది. ఏ క్షణం ఉద్యోగాలు పోతాయో అనే భయంతో టెక్కీలు కాలం గడుపుతున్నారు. తాజాగా ఐబీఎం సంస్థ కూడా తన లేఆఫ్స్ ప్రకటించింది. కాగా అమెరికా దిగ్గజ టెక్ కంపెనీలు ఇప్పటికే తమ ఉద్యోగి కోతల టార్గెట్ దిశగా కొనసాగుతున్నాయి.
తాజా వాషింగ్టన్ పోస్టు ప్రకారం అమెరికాలో ప్రోగ్రామింగ్ చేస్తున్న నిపుణుల సంఖ్య గడచిన రెండేళ్లుగా భారీగా తగ్గిపోయిందని వెల్లడైంది. వాస్తవానికి ఏఐ విస్తరణ పుంజుకుంటున్నందున 27 శాతానికి పైగా ఈ నిపుణులు తగ్గినట్లు అమెరికా లేబర్ బ్యూరే అధికారిక గణాంకాలు వెల్లడించాయి. దీనంతటికీ కారణం ప్రపంచవ్యాప్తంగా ఏఐని అందుబాటులోకి తీసుకొచ్చిన చాట్ జీపీటీగా వెల్లడైంది. మరిన్ని ఏఐ టూల్స్ రోజురోజుకూ ఉద్యోగులపై సంస్థలు ఆధారపడటాన్ని తగ్గించటం టెక్కీల్లో ఉపాధిపై ఆందోళనలను పెంచేస్తోంది.
అయితే ప్రస్తుతం భారతదేశంలో అయితే డాక్టర్ లేదా సాఫ్ట్ వేర్ ఉద్యోగి అనే కాన్సెప్ట్ కొనసాగుతున్న వేళ ఏటా అధిక సంఖ్యల్లో టెక్ రంగంలోకి అడుగుపెట్టడానికి కంప్యూటర్ సైన్స్ చదివిన గ్రాడ్యుయేట్లు పెరిగిపోతున్నారు. కానీ మార్కెట్లో ఏఐ టూల్స్ రాకతో పరిస్థితులు పూర్తిగా మారిపోతున్నాయి. ఎందుకంటే ఉన్న ఉద్యోగుల సంఖ్యలను తగ్గించుకుంటూ ఐబీఎం, యాక్సెంచర్ వంటి అగ్రగామి కంపెనీలు వారి స్థానాలను ఏఐతో భర్తీ చేస్తున్నట్లు ప్రకటిస్తున్న సమయంలో ఐటీ ఫ్రెషర్లకు ఉపాధి పొందటం సవాలుగా మారే ప్రమాదాలు రానున్న కాలంలో ఎక్కువని నిపుణులు అంచనా వేస్తున్నారు.
భారతదేశంలో వాస్తవ పరిస్థితులు ఇలా..
వాస్తవానికి అమెరికాలో కంటే భారతదేశంలో కంప్యూటర్ సంబంధిత టెక్ ఉద్యోగులు ఎక్కువగా ప్రోగ్రామింగ్ వర్క్ చేస్తున్నారు. ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఐటీ రంగంలో కొలువులు కోరుకునే వారికి చాట్ జీపీటీ వంటి ఏఐ విస్తరణ, అభివృద్ధి ఉద్యోగ అవకాశాలను తగ్గిస్తూ వినాశనాన్ని కలిగించే ప్రమాదం పొంచి ఉందని అమెరికాలోని పరిస్థితులు సూచనప్రాయంగా చెబుతున్నాయని నిపుణులు అంటున్నారు. కానీ ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి వంటి వారు ఏఐ పెద్దగా ఉద్యోగులపై ప్రభావం చూపబోదని చెబుతున్నప్పటికీ వాస్తవరూపంలో పరిస్థితులు కొంత భిన్నంగానే ఉన్నట్లు చెప్పుకోకతప్పదు.
ALSO READ : రూ.333 కోట్ల లాభం కొట్టేసిన రేఖా జున్‌జున్‌వాలా.. ఆ స్టాక్ వల్లే అదృష్టం..!!
దీని ప్రకారం ఏఐ వ్యాప్తి, వినియోగం, స్వీకరణ ప్రభావం.. దాని పర్యవసానాలు తీవ్రంగా, ప్రతికూలంగా ఉంటాయవే విషయం ఒప్పుకోకతప్పదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ రంగంలోకి ఎక్కువగా భారతీయ మధ్యతరగతి కుటుంబాలకు చెందిన యువత రాక నిరంతరం పెరగటం మరోపక్క ప్రతికూలతలను కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన పరిస్థితులు కొనసాగుతున్నాయి. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాన్ని చుట్టుముట్టిన ఏఐ త్వరలోనే ఇండియాలోనూ తన ప్రతికూల ప్రభావాన్ని ఎంతవరకు చూపగలదనే అంశం కొంత నిరీక్షణతో వెలుగులోకి వస్తుందని జాబ్ మార్కెట్ నిపుణులు అంటున్నారు.