న్యూఢిల్లీ: ప్రస్తుత సంవత్సరంలో కొత్త ఐటీ ఉద్యోగాల సంఖ్య కాస్త తక్కువగానే కనిపిస్తున్నప్పటికీ వచ్చే సంవత్సరంలో పరిస్థితి బాగుంటుందని ఈ రంగంలోని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఏఐ, డేటాసైన్స్ నిపుణులకు డిమాండ్ ఎక్కువ ఉంటుందని అంటున్నారు. టైర్2 సిటీల్లోనూ ఉద్యోగాలు దొరకుతాయని చెప్పారు. 2023తో పోలిస్తే ఈసారి ఐటీ నియామకాలు ఏడు శాతం తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ఇబ్బందుల వల్ల కంపెనీలు పెద్ద ఎత్తున ఉద్యోగులను తీసుకోలేదు. ఈ ఏడాది ఐటీ కంపెనీల గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీ) భారీగా ఉద్యోగాలు ఇచ్చాయి.
మొత్తం ఉద్యోగాల్లో వీటి వాటాయే 52.6 శాతం ఉందని అడెక్కో ఇండియా కంట్రీ మేనేజర్ సునీల్ చెమ్మన్ కోటిల్ చెప్పారు. ఈసారి జాబ్స్సంఖ్య తగ్గినా, ఏఐ, మెషీన్ లెర్నింగ్ఉద్యోగాల సంఖ్య వార్షికంగా 39 శాతం పెరిగింది. చాలా కంపెనీలు ఈ రెండు టెక్నాలజీలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాయని సునీల్ వివరించారు. మరో సంగతి ఏమిటంటే ఈసారి టైర్–2 సిటీల్లో నియామకాలు 48 శాతం పెరిగాయి.
కంపెనీలు చిన్న నగరాలకు పెద్ద ఎత్తున విస్తరిస్తుండటమే ఇందుకు కారణం. కొత్త టెక్నాలజీలకు డిమాండ్ పెరుగుతున్నందున, కంపెనీలు వీటిని ఉద్యోగులకు నేర్పించడానికి పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాదితో పోలిస్తే ఐటీ రంగంలో 2025లో ఉద్యోగాల సంఖ్య 20 శాతం వరకు పెరగొచ్చని అంచనా.