ముంబై: మన టెక్నాలజీ సెక్టార్జోరు ఈ ఏడాది తగ్గనుంది. 2022–23 ఫైనాన్షియల్ ఇయర్లో ఐటీ సెక్టార్ గ్రోత్ 8.4 శాతం అంటే 245 బిలియన్ డాలర్లకే పరిమితమవుతుందని నాస్కామ్ వెల్లడించింది. అంతకు ముందు ఈ సెక్టార్ పదేళ్లపాటు ఏటా 15.5 శాతం గ్రోత్తో 2021–22 నాటికి 226 బిలియన్ డాలర్లకు పెరిగింది. కొవిడ్ మహమ్మారి వల్ల మన ఐటీ కంపెనీల క్లయింట్లు టెక్నాలజీపై ఎక్కువ ఖర్చు చేయడం వాటికి బాగా కలిసొచ్చింది. కానీ, రష్యా– ఉక్రెయిన్ యుద్ధంతో గ్లోబల్‌గా ఇన్ఫ్లేషన్ పెరగడం, ఆ తర్వాత వడ్డీ రేట్లు పెరగడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. దీంతో టెక్నాలజీ రంగం ఆటుపోట్లకు లోనవుతోంది. ఫ్యూచర్ ఎలా ఉండబోతోందనే అంశం మీద దేశంలోని ఐటీ కంపెనీల చీఫ్ ఎగ్జిక్యూటివ్స్‌తో నాస్కామ్ ఒక సర్వే నిర్వహించింది.
ఈ చీఫ్ ఎగ్జిక్యూటివ్స్ ఎవరూ కూడా భవిష్యత్ మీద పూర్తి ఆశాభావాన్ని వ్యక్తం చేయలేదని సర్వే వెల్లడించింది. అంతేకాదు, సర్వే తర్వాత వచ్చే ఏడాది అంటే 2023–24 ఫైనాన్షియల్ ఇయర్‌కి గైడెన్స్‌ను కూడా బయట పెట్టడానికి నాస్కామ్ ఇష్టపడలేదు. గ్లోబల్‌గా నెలకొన్న జియో పొలిటికల్ సమస్యల వల్ల చాలా కంపెనీలు ఐటీ కాంట్రాక్టులు ఫైనలైజ్ చేయడంలో దూకుడు కనబరచడం లేదని నాస్కామ్ ప్రెసిడెంట్ దేబ్జాని ఘోష్ చెప్పారు. మరికొన్ని మార్కెట్లలోనైతే ఐటీ సర్వీసుల డిమాండే కొంత తగ్గిందని కూడా పేర్కొన్నారు. దేశంలోని టాప్5 కంపెనీలకు కలిపి 18 బిలియన్ డాలర్ల డీల్ పైప్‌లైన్ ఉందని, కొన్ని టెక్ కంపెనీలు తమ క్లయింట్లు 10 శాతం పెరిగారని చెబుతున్నాయని ఆమె వెల్లడించారు.
ఫ్రెషర్లకు స్కిల్స్ఉండట్లే....
ఎడ్యుకేషన్ సిస్టమ్ వల్ల యూనివర్సిటీల నుంచి వచ్చే గ్రాడ్యుయేట్లలో ఐటీ కంపెనీలలో పనిచేయడానికి అవసరమైన స్కిల్స్ ఉండటం లేదని ఘోష్ వాపోయారు. ఈ సమస్య ఇప్పటిది కాదని, చాలా ఏళ్లుగా నలుగుతోందని పేర్కొన్నారు. క్లయింట్ల అవసరాలు నెరవేర్చేలా ఈ ఫ్రెషర్లను ట్రెయిన్ చేయడానికి మన ఐటీ కంపెనీలు చాలా మొత్తం వెచ్చించాల్సి వస్తోందని వివరించారు. ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఐటీ ఉద్యోగుల సంఖ్య 2.9 లక్షలు పెరుగుతుందని, మొత్తం ఐటీ ఉద్యోగుల సంఖ్య మార్చి చివరి నాటికి 54 లక్షలవుతుందని ఘోష్ చెప్పారు.
2021–22 లోని 4.5 లక్షల ఉద్యోగాలతో పోలిస్తే ఈ ఏడాది తగ్గినట్లేనని, కాకపోతే కొవిడ్ టైములో ఎక్కువ ఉద్యోగాలను తీసుకోవాల్సి వచ్చిందని, దానిని లెక్కలోకి తీసుకోకూడదని నాస్కామ్ చైర్మన్ కృష్ణన్ రామానుజమ్ (టీసీఎస్) పేర్కొన్నారు. దేశపు ఐటీ ఎగుమతులు 9.4 శాతం గ్రోత్తో 194 బిలియన్ డాలర్ల దాకా ఉండొచ్చని ఘోష్ తెలిపారు. గ్లోబల్ సోర్సింగ్ అవసరాలలో 57–58 శాతాన్ని మన దేశమే నెరవేరుస్తోందని, 2030 నాటికి ఐటీ సెక్టార్ 500 బిలియన్ డాలర్లకు ఎదుగుతుందని అంచనావేశారు.