
Tariffs Effect On IT: యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ తన సుంకాల యుద్ధా్న్ని ప్రకటించిన వేళ భారతీయ స్టాక్ మార్కెట్లతో పాటు, ప్రభుత్వం, పరిశ్రమలు, ఉద్యోగులు దాని ప్రభావం ఎలా ఉంటుంది, ఎంత మేర ఉంటుందనే ఆందోళనలో ఉన్నారు. ఈ క్రమంలో ఆసియా మార్కెట్లు తీవ్రంగా ప్రభావితం అయ్యాయని తేలింది. అయితే ప్రస్తుతం భారతీయ ఐటీ పరిశ్రమలోని ఉద్యోగులు, కంపెనీలు దీని ప్రతికూల ప్రభావాలపై అంచనాలు వేస్తూ ఆందోళన చెందుతున్నాయి.
భారతదేశ ఉత్పత్తులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏకంగా 26 శాతం టారిఫ్స్ ప్రకటించటం ఒక విధంగా మోదీ సర్కారుకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ క్రమంలో భారతీయ ఐటీ పరిశ్రమలోని కంపెనీలు ప్రతికూలంగా ప్రభావితం అయ్యాయి. ఇంట్రాడే ట్రేడింగ్ సమయంలో నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 3 శాతం మేర పతనాన్ని నమోదు చేసింది.
కుప్పకూలిన ఐటీ స్టాక్స్..
పెర్సిస్టెంట్ సిస్టమ్స్ షేర్లు 6.5 శాతం పైగా నష్టపోగా, కోఫోర్జ్ షేర్లు 4 శాతానికి పైగా తగ్గాయి. ఇదే సమయంలో ఎంఫసిస్ స్టాక్ 3 శాతం కంటే ఎక్కువ పతనమైంది. అలాగే దేశంలోని టాప్ ఐటీ సేవల దిగ్గజాలైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్, HCL టెక్నాలజీస్ సంస్థల షేర్ల ధరలు ఒక్కొక్కటి 2 శాతానికి పైగా పతనాన్ని నమోదు చేశాయి. అలాగే టెక్ మహీంద్రా, ఎల్టిఐ మైండ్ ట్రీ, విప్రో వంటి ఇతర ఐటీ కంపెనీల షేర్ల ధరలు ఒక్కొక్కటి 1 శాతానికి పైగా పతనంతో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి.
ఇండియన్ ఐటీ పరిశ్రమపై సుంకాల ప్రభావం..
వాస్తవానికి భారత ఐటీ పరిశ్రమకు అత్యంత ముఖ్యమైన కీలకమైనది అమెరికా మార్కెట్. ఎందుకంటే అమెరికా మార్కెట్లలోని క్లయింట్ల నుంచే భారత ఐటీ సేవల సంస్థలు అత్యధికంగా ఆదాయాలను పొందుతున్నాయి. ఇండియన్ ఐటీ పరిశ్రమ మెుత్తం ఆదాయంలో దాదాపు 50 శాతం కేవలం అమెరికా నుంచి రావటమే దీనికి కారణం. ప్రస్తుతం ట్రంప్ సర్కార్ కొత్త టారిఫ్స్ పాలసీ కింద అన్ని దిగుమతులపై ప్రాధమికంగా 10 శాతం సుంకాన్ని విధించటం ఐటీ పరిశ్రమకు పెద్ద ఎదురుదెబ్పని చెప్పుకోవచ్చు.
►ALSO READ | Trump Tariffs: దయచూపించిన ట్రంప్.. ఈ 50 వస్తువులపై 'NO' టారిఫ్స్.. ఫుల్ లిస్ట్
ప్రస్తుతం ట్రంప్ ప్రకటించిన సుంకాలు అమెరికాలోని భారతీయ ఐటీ సంస్థల క్లయింట్లు కొత్త ప్రాజెక్టులను లేదా నూతన ప్రాజెక్టులను కొంత కాలం జాప్యం చేయటం లేదా వాయిదా వేయటం వంటి ప్రతికూలతలను కలిగించవచ్చని ఇండస్ట్రీ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రెండేళ్లుగా ఐటీ పరిశ్రమ మందగమనంతో తక్కువ ఆదాయాలు, మార్జిన్లు, తగ్గిన పెద్ద ఆర్డర్లతో ఆందోళన చెందుతున్న వేళ ట్రంప్ నిర్ణయం ప్రతికూలతలను పెంచుతోంది.
ఐటీ ఉద్యోగులపై ప్రభావం..
భారత్ పై అమెరికా కొత్తగా ప్రవేశపెట్టిన 26 శాతం పరస్పర సుంకాలు ఐటీ పరిశ్రమపై పరోక్షంగా పెద్ద దెబ్బగా మారుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రాజెక్టులు ఖరీదుగా మారటంతో ఇప్పటికే విచక్షణతో కూడిన ఖర్చులు చేస్తున్న అమెరికా క్లయింట్ల నుంచి వ్యాపారం మందగించే ప్రమాదం ఉందని వారు చెబుతున్నారు. ఇవి కంపెనీలపై స్వల్పకాలంలో లేదా దీర్ఘకాలం పాటు ఆర్థిక ఒత్తిళ్లను కలిగిస్తాయని తెలుస్తోంది. దీనికి అనుగుణంగానే ఇండియన్ టెక్ కంపెనీలు సైతం తమ కొత్త నియామకాలను వాయిదా వేయటం, ఉన్న ఉద్యోగులకు నైపుణ్యాలను పెంచుతూ వినియోగించుకుంటూ బెంచ్ మీద ఉన్న ఉద్యోగుల సంఖ్యను తగ్గించటానికి ప్రయత్నించవచ్చని తెలుస్తోంది. అలాగే సీనియర్ ఉద్యోగులకు బదులుగా కొన్ని సంస్థలు ఫ్రెషర్లకు అవకాశం ఇస్తూ ఖర్చులను తగ్గించుకునేందుకు ఉన్న అవకాశాలను అన్వేషించే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మెుత్తానికి ఐటీ పరిశ్రమలోని ఉద్యోగుల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లుగా మారుతోంది.