కొందరు షూటర్లు చేసిన పిచ్చి పని విదేశీ గడ్డపై భారత్ పరువును బజారు కీడ్చింది. ఇంతకీ వీరేం ఘనకార్యం చేశారంటారా? అర్ధరాత్రి పూట మహిళా షూటర్లు.. మగ షూటర్ల గదుల్లోకి వెళ్లి నానా రచ్చ చేశారట. బిగ్గరగా పాటలు పాడుతూ హంగామా చేశారట. వీరి దెబ్బకు నిర్వాహకులు భయపడిపోయి.. ఇక మీదట భారతీయులకు గదులు ఇవ్వొద్దని సిబ్బందిని హెచ్చరించినట్లు వార్తలొస్తున్నాయి.
ఐఎస్‌ఎస్ఎఫ్ వరల్డ్ జూనియర్ ఛాంపియన్‌షిప్ మూడో ఎడిషన్ 2023 జూలై 16 నుండి 24 వరకు దక్షిణ కొరియాలోని చాంగ్వాన్ వేదికగా జరిగింది. ఈ ఈవెంట్‌లో పాల్గొనేందుకు కొరియా వెళ్లిన భారత జూనియర్ షూటింగ్ జట్టులోని కొందరు సభ్యులు నిబంధనలు ఉల్లంఘించినట్లు కథనాలు వస్తున్నాయి. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇద్దరు మహిళా షూటర్లు.. మగ షూటర్ల హోటల్ గదుల్లోకి వెళ్లి అర్ధరాత్రి వరకు పార్టీలు చేసుకుంటున్నారని, బిగ్గరగా పాటలు పాడుతూ సందడి చేశారన్నది ఆరోపణ.
వీరి చేసిన హంగామాకు హోటల్‌లోని కొన్ని వస్తువులు దెబ్బతిన్నాయని, అందుకు తగిన పరిహారం చెల్లించడంతో చెక్ అవుట్ చేసినట్లు హోటల్ సిబ్బంది చెప్తున్నారు. అయితే ఈ పర్యటనకు వెళ్లిన భారత అధికారుల వాదన మరోలా ఉంది. పురుష షూటర్లు ఉన్న హోటల్‌కు మహిళా షూటర్లు వెళ్లినట్లు ఎలాంటి ఆధారాలు లేవని చెప్తున్నారు.
భారత్ రెండో స్థానంలో
ప్రపంచ జూనియర్ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ రెండో స్థానంలో నిలిచింది. భారత యువ షూటర్లు 6 స్వర్ణాలు, 6 రజతాలు, 5 కాంస్య పతకాలు సాధించారు. 12 స్వర్ణాలు, 9 రజతాలు, 7 కాంస్య పతకాలు సహా మొత్తం 28 పతకాలను సాధించిన చైనా పతకాల పట్టికలో అగ్ర స్థానంలో నిలిచింది.